ఖూబ్‌సూరత్ | Sakshi
Sakshi News home page

ఖూబ్‌సూరత్

Published Fri, Apr 10 2015 11:45 PM

ఖూబ్‌సూరత్

దుబాయ్ శీను సినిమా చూశారుగా..! అందులో షాయాజీ షిండే తరచూ ముఖం వంకర్లు తిప్పే సీన్ గుర్తుందా..? ముఖారవిందం అందంగా కనిపించడానికి ఫేస్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నానని షిండే చెప్పే సీన్లు మనం కామెడీగా తీసుకున్నాం కానీ.. అది నిజమేనండీ బాబు..! ప్రస్తుతం సిటీలో కొందరు అతివలకు ఫేసర్‌సైజ్ ఫీవర్ పట్టుకుంది. వీకెండ్ వస్తే చాలు.. ఫేస్ చరిష్మాను మార్చే ఫేసర్‌సైజ్ వర్క్‌షాప్‌లకు పరుగులు తీస్తున్నారు.
 ..:: వాంకె శ్రీనివాస్
 
‘ఆమె ముఖం  చంద్రబింబం వలె ఉన్నది’.. తెలుగు అలంకారాలు నేర్చుకునే రోజుల్లో ఈ వాక్యం పదే పదే చదువుకున్నాం. చంద్రబింబాన్ని కృష్ణపక్షం ఎలా మింగేస్తుందో.. ముఖ వర్చస్సును వయసు అలా హరిస్తుంది. నిండు యవ ్వనంలో నిగనిగలాడిన బూరెల్లాంటి బుగ్గలు.. నడివయసుకు వచ్చే సరికి పీలగా మారిపోతాయి. ఫిట్‌నెస్ సూత్రాలను తు.చ తప్పకుండా ఫాలో అయ్యే మగువల్లోనూ తనువెల్లా అందం
 తొణికిసలాడినా.. ముఖం వరకు వచ్చే సరికి మాత్రం వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి సిటీస్త్రీలు ఫేసర్‌సైజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. వీకెండ్స్‌లో జరిగే వర్క్‌షాప్‌లకు హాజరవుతున్నారు. అక్కడ నేర్చుకున్న వ్యాయామాలను ప్రతి రోజూ ఓ 15 నిమిషాలు చేస్తూ గ్లామర్‌ను పెంచుకునే
 పనిలోపడ్డారు.

 ముఖార‘వింత’ం

ఫేసర్‌సైజ్‌లో భాగంగా ముఖంపై చేతులు పెట్టుకోవడం.. మెడ చుట్టూ చేతులను బిగించడం.. ఇలా వింత విన్యాసాలతో అందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘1980లో కారొలే మాగియో ఫేసర్‌సైజ్ ఫేసియల్ ఎక్సర్‌సైజ్‌ను సృష్టించారు. ఇందులోని ఎక్సర్‌సైజ్‌లు ముఖ కండరాలను మెరుగుపరిచి అందంగా కనబడేలా చేస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఫేసర్‌సైజ్.. ఢిల్లీ, ముంబైల మీదుగా ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఇన్నాళ్లు ముఖం అందాన్ని మార్చుకునేందుకు కాస్మొటిక్ సర్జరీల వైపు మొగ్గు చూపిన వాళ్లు.. ప్రస్తుతం ఫేసర్‌సైజ్ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. ఇందులో ఫోర్‌హ్యాండెడ్‌నెస్, డబుల్ చీక్, ఫర్ స్మైలింగ్ లైన్, నెక్ టోనర్.. ఇలా 72 డిఫరెంట్ ఎక్సర్‌సైజులను నేర్పిస్తున్నామ’ని తెలిపారు జూబ్లీహిల్స్‌లోని మేఘవి స్పా యజమానురాలు మేఘవి.
 
చహరేమే జాదూ..

ఒక్కో రకం ఎక్సర్‌సైజ్‌తో ముఖంలోని ఒక్కో భాగం అందంగా కనిపిస్తుందని చెబుతున్నారు ఫేసర్‌సైజ్ ట్రైనీలు. ‘నుదురు అందంగా కనిపించడం కోసం.. కనుబొమ్మల పైభాగంలో రెండు వైపుల నుంచి చేతులు కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సులువుగా జరిగి.. కండరాలు సంకోచించడం వల్ల.. లలాటంలో కళ పెరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాల వల్ల మీ వయసు ఐదేళ్లు తక్కువగా కనిపిస్తుంది’ అని అంటారు మేఘవి. ఈ ఫేసర్‌సైజ్ కేవలం అతివల కోసమే కాదు. మగాళ్లు కూడా చేసుకోవచ్చని చెబుతున్నారామె. ముఖంలో అందం పెరగటం వల్ల మనిషిలో కాన్ఫిడెంట్ లెవల్స్ కూడా పెరుగుతాయని అంటున్నారు.

Advertisement
Advertisement