వేలు వదిలినా...ముద్ర పోలేదు! | Sakshi
Sakshi News home page

వేలు వదిలినా...ముద్ర పోలేదు!

Published Sun, Oct 20 2013 1:31 AM

వేలు వదిలినా...ముద్ర పోలేదు!

 అనంతరం
  పదవి గల తండ్రి ఉంటే కొడుక్కి వచ్చిన లోటేంటి అనుకుంటారు చాలామంది. తండ్రి బలవంతుడైతే కొడుకు ఎదుగుదలకు అడ్డేంటి అంటారు మరికొంతమంది. కార్తి గురించి కూడా అలానే అన్నారు. దానికాయన ఒప్పుకోలేదు. ‘నా తండ్రిని అడ్డుపెట్టుకుని ఎదగడానికి నేను ప్రతిభ లేనివాణ్ని కాదు కదా’ అనేది ఆయన వాదన. ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు అయిన తన తండ్రి చిదంబరం అడుగుజాడల్లోనే నడిచినా... ఆయన కొడుకుగా కంటే, తనకు తానుగా గుర్తింపు పొందాలనేదే కార్తి తపన. నలభయ్యేళ్లుగా ఈ తపనతోనే ఉన్నారు కార్తి!
 
 ‘లాయర్ చిదంబరం ఆఫీసెక్కడ బాబూ’... ఈ ప్రశ్న వినపడగానే, హుషారొచ్చేసేది ఆ తొమ్మిదేళ్ల కుర్రాడికి. ‘చెప్పడమెందుకండీ, తీసుకెళ్లి చూపిస్తాను’ అనేవాడు. ‘నేను వెళ్తాను’ అన్నా వదిలేవాడు కాదు. ‘ఫర్వాలేదు, నేనున్నానుగా’ అంటూ బలవంతపెట్టేవాడు. తీసుకెళ్లి మరీ ఆఫీసు చూపించేవాడు. కానీ పాపం, ఆ వచ్చినవారికి తెలియదు... ఆ బుడతడు చిదంబరం ఒక్కగానొక్క కొడుకు కార్తి అని!

 


 
 చిదంబరం చెన్నైలో లాయర్‌గా నిలదొక్కుకున్న తర్వాత ఓరోజు... తన ఇంట్లో ఉన్న ఆఫీసును మరో పెద్ద బిల్డింగులోకి మార్చారు. అప్పటికి ఫోన్లు ఉన్నా, అవి అప్పుడప్పుడు మాత్రమే పని చేసేవి. దాంతో క్లయింట్లు డెరైక్టుగా ఇంటికొచ్చేసేవారు. ఆఫీసు మార్చారు కాబట్టి, అడ్రస్ తెలీక వాళ్లు ఇబ్బంది పడితే తాను నష్టపోవాల్సి వస్తుందని భావించిన చిదంబరం, చిన్నారి కార్తితో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఇంటికొచ్చినవాళ్లను దగ్గరుండి తన ఆఫీసుకు తీసుకువస్తే, మనిషికి ఒక రూపాయి చొప్పున ఇస్తానన్నారు. కార్తి దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. తండ్రి చెప్పిన పని చేసి రూపాయలు పోగేసేవాడు. అలా అతడిలో కలిగిన వ్యాపారోత్సాహం, నేటికీ కొనసాగుతూనే ఉంది.
 
 చెన్నైలోని డాన్ బాస్కో స్కూలు తన జీవితానికి అందమైన పునాదిని వేసిందంటారాయన. ఎందుకంటే, కార్తికి టెన్నిస్ పరిచయమయ్యింది అక్కడే. ‘టెన్నిస్ కోసం దేనినైనే వదిలేసుకోవాలన్నంత పిచ్చి ఉండేది నాకు’ అంటారు కార్తి.  అందుకే జాతీయస్థాయి ఆటగాడు అయ్యారు. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్‌కి వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. అయితే, అందరూ అనుకున్నట్టు కార్తి టెన్నిస్ ప్లేయర్‌గానే ఉండిపోలేదు. జనం మధ్యకు వెళ్లాలని, జనాలతో మమేకమవ్వాలని అనుకున్నారు. విదేశాలకు వెళ్లి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు కానీ, లాయర్‌గా మిగిలిపోవాలనుకోలేదు. రాజకీయాల వైపు నడిచారు. ఎన్నికలప్పుడు తండ్రికి కుడిభుజమయ్యారు. అయితే, రాజకీయాలు కార్తిని ఉన్నత శిఖరాలకైతే చేర్చలేదు. తమిళనాడు యూత్ కాంగ్రెస్‌కి అధ్యక్షుడవ్వాలన్న కలా ఫలించలేదు. వయసు పరిమితి దాటిన కారణంగా ఆ కల కలగానే మిగిలిపోయిందంటారు కార్తి. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగా ఉన్న  ఆయన, కాస్త త్వరగా రాజకీయాల్లోకి వచ్చివుంటే బాగుండేదని అంటుంటారు కొందరు.
 
 అయితే వ్యాపార రంగంలో మాత్రం తన ముద్ర వేశారు కార్తి. ‘చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ అనే లీగల్ కన్సల్టెన్సీని, మరికొన్ని సంస్థలనూ నడుపుతున్నారు. చెన్నై చాప్టర్ ఆఫ్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్, ఆన్‌లైన్ పబ్లిక్ ఒపీనియన్ ఫోరమ్‌లకు కో ఫౌండర్‌గా కూడా ప్రపంచానికి బాగా దగ్గరయ్యారు. అయితే తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని, స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు కార్తి. నిజమేనా అంటే... ‘‘ప్రజలు చాలా జడ్జిమెంటల్‌గా ఉంటారు. నా పేరు వెనుక ఉన్న నా తండ్రి పేరుని చూసి, నేనేదో చేసేస్తున్నానని అనుకుంటున్నారు. నాకంత అవసరం లేదు’’ అంటారు.
 
 ఏం చెప్పినా ఇప్పటికీ కార్తిని చిదంబరం కొడుకు అనే సంబోధిస్తున్నారంతా. ఆయన ఎంత కాదనుకున్నా ఆ ముద్ర నుంచి పూర్తిగా బయటపడలేదు. తండ్రి నీడ ఇంకా ఆయనను విడిచిపెట్టలేదు. మరి ఇది కార్తికి ప్లస్సా... మైనస్సా... ఆయనకే తెలియాలి!
 
 -సమీర నేలపూడి
 

Advertisement
Advertisement