కూల్ కెప్టెన్ ధోనీ | Sakshi
Sakshi News home page

కూల్ కెప్టెన్ ధోనీ

Published Sun, Dec 22 2013 1:52 AM

కూల్ కెప్టెన్ ధోనీ

విశ్లేషణం
 పని విషయంలో ధోనీ ప్రొయాక్టివ్‌గా ఉంటాడు. సమస్యలనుంచి తప్పించుకునే ధోరణి చూపకుండా... సానుకూల దక్పథంతో లక్ష్యంవైపు అడుగులు వేస్తాడు.
 
 మైదానంలో ఆడేటప్పుడైనా, మైక్ ముందు మాట్లాడేటప్పుడైనా ధోనీ నింపాదిగా ఉంటాడు. ఏం మాట్లాడాలన్నా ఓసారి ఎడమవైపు కిందికి చూసి, ఆ తర్వాత తల పెకైత్తి... ‘యూ నో...’ అంటూ మాట్లాడటం మొదలుపెడతాడు. ఆ మాటల్లోనూ యాక్టివిటీ, ఫీలింగ్స్‌కు సంబంధించిన పదాలే ఎక్కువగా ఉంటాయి. మాట్లాడేప్పుడు కుర్చీలో కుదురుగా కూర్చోకుండా కదులుతూ ఉంటాడు. వీటన్నింటిని బట్టి ధోనీది ప్రాథమికంగా అనుభూతి ప్రధాన (కైనస్థటిక్) వ్యక్తిత్వమని చెప్పవచ్చు. ఆటగాళ్లలో ఈ వ్యక్తిత్వం ఎక్కువగా కనిపిస్తుంది. వారికి తమ శరీరం, కదలికలపై ఎక్కువ అవగాహన, పట్టు ఉంటాయి. అందుకే బంతిని ఎలా కొట్టాలో, ఎంత బలంగా కొడితే ఎక్కడ పడుతుందో ధోనీకి బాగా తెలుసు.
 
 ‘ఈ క్షణమే’ విజయ రహస్యం
 గతంలో జీవించేవారు చేసిన తప్పుల గురించి బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తులో జీవించేవారు ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వర్తమానంలో జీవించేవారు చేసేపని చక్కగా చేయడంపైనే దష్టి పెడతారు. ధోనీ వర్తమానంలోనే జీవిస్తాడు. చేసిన తప్పుల విశ్లేషణలో కాలం గడపకుండా... అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేక్రమంలో ఆందోళన చెందకుండా... ఆ రోజు తాను ఆడాల్సిన ఆటపైనే, ఇంకా చెప్పాలంటే ఆ క్షణంలో తాను ఎదుర్కొనబోయే బంతిపైనే దృష్టి పెడతాడు. ‘ఈ క్షణంలో జీవించడమే నాకిష్టం’, ‘నేనే పని చేస్తున్నా, బెస్ట్‌గా చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని చెప్తాడు... జీవిస్తాడు... అలాగే ఆడతాడు కూడా.  అదే అతని విజయరహస్యం.
 
 పరిమితుల నుంచి అపరిమితంగా...
 అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకోవడమే జీవన గమనాన్ని, విజయాలను నిర్దేశిస్తుందన్న ధోనీ ఫిలాసఫీ కూడా అతడి మాటల్లో కనిపిస్తుంది.  తనకు మాత్రమే స్వంతమైన హెలికాప్టర్‌షాట్ అలా పుట్టిందే. తాను క్రికెట్ నేర్చుకునే రోజుల్లో టెన్నిస్‌బాల్‌ను బౌండరీలైన్‌ను దాటించడం కోసం బలంగా బాదడంలో భాగంగా ఆ షాట్ నేర్చుకున్నానని ధోనీ చెప్తాడు. పరిమిత వనరులను బలంగా మార్చుకునే లక్షణం అతనికి చిన్నప్పుడే అలవడిందనడానికి ఈ షాటే నిదర్శనం. ధోనీ  తన జీవితాన్ని ఆనందిస్తాడు. తాను సాధించిన విజయాలపట్ల గర్విస్తాడు. మరింత మెరుగైన విజయాలకోసం తనవైన రూల్స్ నిర్దేశించుకుంటాడు. ఈ లక్షణాలే అతన్ని విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా నిలిపాయి.
 
 జస్ట్ కెప్టెన్...
 20-20, వన్డే, టెస్ట్‌లలో భారత జట్టును నెంబర్‌వన్‌గా నిలిపిన ధోనీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏ ఆటగాడిలో ఏ నైపుణ్యం ఉంటుందో అతను ఇట్టే పసిగట్టేస్తాడు. సరైన సమయంలో బరిలోకి దించుతాడు. పూర్తి సామర్థ్యంతో ఆడేలా వారిని ఉత్తేజపరుస్తాడు.  విజయం సాధిస్తాడు. అయితే జట్టు సభ్యులతో అతనికి వ్యక్తిగత సంబంధాలు తక్కువ, స్నేహం అంతంత మాత్రమే. ధోనీ వారిని జట్టు సభ్యులుగానే చూస్తాడు తప్ప, తనవారిగా చూడడు. కావాలంటే అతని మాటలను గమనించండి. ది ప్లేయర్, ది టీమ్ అంటాడే తప్ప.. మై ప్లేయర్, మై టీమ్ అనడు. అందుకేనేమో అతనికి క్రికెటర్లలో స్నేహితులు తక్కువ. ‘పత్రికలు, టీవీలు మేం గెలిస్తే ఆకాశానికెత్తుతాయి, ఓడిపోతే విరుచుకుపడతాయి. అందుకే నేను పత్రికలు, టీవీలు పెద్దగా చదవను, చూడను. కానీ నేను గెలిచినా, ఓడినా నా పెంపుడు కుక్కలు నన్ను అంతే ప్రేమతో పలకరిస్తాయి, అంతే ఆనందంగా ఆడుకుంటాయి. అందుకే వాటితోనే రిలాక్స్ అవుతాను’ అని చెప్పడం ధోనీకి మాత్రమే ప్రత్యేకం!
 - విశేష్, సైకాలజిస్ట్

Advertisement
Advertisement