అన్నమో రామచంద్ర! | Sakshi
Sakshi News home page

అన్నమో రామచంద్ర!

Published Sat, Oct 15 2016 11:34 PM

అన్నమో రామచంద్ర! - Sakshi

 వరికి ఉరి
ఆంధ్రప్రదేశ్‌కు గొప్ప రాజధాని అవసరమే...అయితే దాని నిర్మాణానికి
 పచ్చని పంటపొలాలే అవసరమా?

 
వరికి ఉరి బిగించారు. ఆహార పంటలకు ‘కేపిటల్’ పనిష్‌మెంట్ విధించారు. మొత్తానికి ఉత్తపుణ్యానికే తిండికి గండి కొట్టారు. రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల పొట్టగొట్టారు. దేశంలోనే మరెక్కడా లేని రీతిలో ఏడాదికి మూడు పంటలు పండే 40 వేల ఎకరాల పచ్చని పంటపొలాల్లో రాజధాని నిర్మాణాన్ని తలపెట్టారు. దీనికోసం రైతుల నుంచి సేకరించిన భూములు 34 వేల ఎకరాలైతే, మరో ఆరువేల ఎకరాలు దేవాదాయ భూములు, గ్రామ కంఠం భూములు తదితరమైనవి. పరిసర ప్రాంతాల్లో రాజధాని అవసరాలకు తగినన్ని బంజరు భూములు ఉన్నా, వాటి జోలికి వెళ్లకుండా పచ్చని పొలాలనే కైవసం చేసుకున్నారు. ఏలినవారి నిర్వాకం ఫలితంగా ఏటా 3.80 కోట్ల కిలోల బియ్యం దిగుబడికి శాశ్వత నష్టం వాటిల్లింది.
 
 ఇక కూరగాయల పంటలకు, పండ్ల దిగుబడికి వాటిల్లిన నష్టం అంచనాలకు అందనిది. పంట పొలాల్లో కాంక్రీటు కీకారణ్యం తయారవుతుండటంతో ఏకంగా 21 వేల మంది రైతు కూలీలు ఉపాధి కోల్పోయే దుస్థితి దాపురించింది. రైతులు, రైతు కూలీలే కాకుండా పరోక్షంగా ఎంతోమంది... గోనెసంచీల తయారీదారులు, రవాణాదారులు, వారి వద్ద పనిచేసే హమాలీలు వంటి చాలామంది ఉపాధికి కూడా గండి పడింది. ఆహార సమస్య ప్రపంచవ్యాప్త సమస్యగా ఆందోళన కలిగిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏరి కోరి పంట పొలాలను ఎంపిక చేసుకున్నారంటే ఆకలితో అలమటిస్తున్న సామాన్యుల పట్ల మన పాలకులకు ఏ మాత్రం శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 ఆకలి రాజధాని
 ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అపర సింగపూర్‌లా అవతరిస్తుందో లేదో తెలీదు గాని, ఆకలి సమస్యకు మాత్రం దారితీస్తుందనేది సత్యం. అమరావతి నగర నిర్మాణం కోసం సేకరించిన మొత్తం 40 వేల ఎకరాల్లో వరి పండించే భూములు 12,820 ఎకరాల వరకు ఉండేవి. ఆ భూముల్లో ఖరీఫ్‌లో ఎకరానికి సగటున 40 బస్తాలు, రబీలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. ఒక్కో బస్తాలో 58 కిలోల ధాన్యాన్ని నింపుతారు. సారవంతమైన భూమి కావడం, సాగునీటికి ఎలాంటి ఎద్దడీ లేకపోవడం వల్ల దిగుబడికి ఎలాంటి ఢోకా ఉండేది కాదు. వంద కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 68 కిలోల బియ్యం వస్తాయి.
 
  నూకలు, తౌడు, ఊక వంటి ఉప ఉత్పత్తులు కూడా మిగులుతాయి. ఈ లెక్కన ఏటా 3.80 కోట్ల కిలోల బియ్యం దిగుబడిని కోల్పోయాం. అంటే సగటున మనిషికి పూటకు 200 గ్రాముల బియ్యం సరిపోతుందని లెక్క వేసుకున్నా... 19 కోట్లమందికి ఒకపూటకు సరిపడే బియ్యం దిగుబడికి శాశ్వత నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే మరో 11,675 ఎకరాల్లో పత్తి సాగు జరిగేది. మిగిలిన భూముల్లో పండ్లు, కూరగాయలను పండించేవారు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాలు ఉంటే వాటిలోని 19 గ్రామాల్లో కూరగాయల సాగు విస్తృతంగా సాగేది. ఏటా కనీసం 200 రోజుల పాటు సగటున రోజుకు 60 టన్నుల కూరగాయలు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లేవి. మిగిలిన రోజుల్లోనూ కూరగాయల సాగు కొనసాగేది. సీజన్‌లో ఉండవల్లి, పెనుమాక గ్రామాల నుంచే రోజుకు కనీసం పది లారీల అరటి రవాణా జరిగేది.
 
  మిగిలిన గ్రామాల్లోనూ అరటి సాగు జరిగేది. విజయవాడ, గుంటూరు నగరాలకు ఏడాది పొడవునా అరటిపళ్లు రవాణా అవుతుండేవి. ఇప్పుడు ఈ నగరాలకు ఇతర రాష్ట్రాల నుంచి అరటిపళ్లను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం పూలసాగుకు కూడా ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ లారీల కొద్దీ కూరగాయలు, పూలు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. ఇవన్నీ ఇక కాంక్రీటు కట్టడాల కింద సమాధి అయిపోతున్నట్లే! అలాగే రాజధాని నిర్మాణం కోసం సేకరించిన 40 వేల ఎకరాల సాగుభూముల్లో కేవలం వరి మాత్రమే పండించేటట్లయితే 11.83 కోట్ల కిలోల బియ్యం ఉత్పత్తయ్యేది. ఆ బియ్యం కనీసం 59.15 కోట్ల మందికి... అంటే దేశ జనాభాలో దాదాపు సగం మందికి ఒక పూట కడుపు నింపుకోవడానికి సరిపోయేది.
 
 పెరుగుతున్న ఆహార అవసరాలు
 ప్రపంచ జనాభా పెరుగుదల వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2050 నాటికి మరో 70 శాతం ఆహార ఉత్పత్తులు అదనంగా అవసరమవుతాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) అంచనా వేస్తోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచే దిశగా చాలా దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. సాగునేలలను అపురూపంగా సంరక్షించుకోవడం, అధిక దిగుబడినిచ్చే వంగడాలను తయారు చేసుకోవడం, సాగునీటి వనరుల సంరక్షణ వంటి చర్యలకు నడుం బిగించాయి.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా రాజధాని పేరిట సాగుభూమిలో కాంక్రీటు కీకారణ్య నిర్మాణాన్ని తలపెడుతోంది. సారవంతమైన సాగునేలను కాంక్రీటుమయం చేసి పారేస్తే పర్యావరణానికి భారీ స్థాయిలోనే చేటు వాటిల్లుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు మూసుకుపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. పచ్చదనం కనుమరుగవడంతో కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) పెరుగుతాయి. భూతాపం (గ్లోబల్ వార్మింగ్)  మరింతగా పెరుగుతుంది.
 
 ‘ఉన్నవాడికి తింటే అరగదు... లేనివాడికి తిండే దొరకదు’ అన్నాడో సినీకవి. ధనిక దేశాల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడుతున్న సంగతి జగద్విదితమే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. పేదరికం తాండవిస్తున్న దేశాల్లో చాలామంది ఇప్పటికీ ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 79.3 కోట్ల మంది ఆకలి, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా అంచనా.
 
 పేదరికమే అసలు సమస్య
 అభివృద్ధి చెందుతున్న దేశాలలో, వెనుకబడిన దేశాలలో ఇంకా చాలామంది ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఈ దుస్థితికి పేదరికమే అసలు కారణం. తగినంత ఆహారాన్ని కొనుగోలు చేయడానికి తగిన ఆదాయం లేకపోవడం లేదా సొంతంగా ఆహారం పండించుకోవడానికి తగినంత భూమి అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది తరచుగా పస్తులతో అలమటిస్తున్నారు. వనరుల పంపిణీలో అసమానతలు, విపరీతమైన ఆదాయ వ్యత్యాసాల వంటి కారణాల వల్ల అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లో 89.6 కోట్ల మంది నిరుపేదరికంలో మగ్గిపోతున్నారు.
 
 వీరంతా చాలీచాలని రీతిలో రోజుకు రెండు డాలర్ల (రూ.133) కంటే తక్కువ ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. లోపభూయిష్ఠమైన ఆర్థిక వ్యవస్థల కారణంగానే చాలా దేశాల్లో పేదరికం తాండవిస్తోందని ప్రపంచబ్యాంకు 2013లో పేదరికంపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కొన్ని దేశాల్లో యుద్ధాలు, అంతర్గత ఘర్షణలు, ఉగ్రవాదం వంటి కారణాలు కూడా పేదరికానికి దారితీస్తున్నాయని పేర్కొంది. ఘర్షణలతో అట్టుడుకుతున్న దేశాల్లో 17.2 కోట్ల మంది కడు పేదరికంతో మగ్గిపోతూ ఆకలితో అల్లాడుతున్నట్లు తెలిపింది.
 
 ఆహార వృథా... ప్రపంచవ్యాప్త సమస్య
 ఒకవైపు చాలా దేశాల్లో కోట్ల మంది ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తూ ఉంటే, మరోవైపు కొందరు విలాసాల్లో మునిగి తేలుతూ, అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఆహార వృథా ఏ కొన్ని దేశాలకో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న సమస్త ఆహార పదార్థాల్లో దాదాపు మూడో వంతు... అంటే ఏటా 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు ఊరకే వృథా అవుతున్నాయని, వాటి విలువ దాదాపు లక్ష కోట్ల డాలర్లకు (రూ.66 లక్షల కోట్లు) పైమాటేనని వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (డబ్ల్యూఆర్‌ఐ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా సంపన్న దేశాలే అత్యధికంగా ఆహార వృథాకు పాల్పడుతున్నాయి. సహారా ఎడారి దిగువన ఉన్న ఆఫ్రికన్ దేశాల వార్షిక ఆహార వినియోగం 23.0 కోట్ల టన్నులు అయితే, సంపన్న పారిశ్రామిక దేశాల్లో ఏటా జరుగుతున్న ఆహార వృథా దాదాపు 22.2 కోట్ల టన్నులు.
 
  యూరోపియన్ దేశాల్లో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృథా 280 కిలోలు కాగా, అమెరికాలో ఏటా జరుగుతున్న తలసరి ఆహార వృథా 295 కిలోలు. ఆసియాలోని పారిశ్రామిక దేశాల్లో ఏటా 240 కిలోలు, అభివృద్ధి చెందుతున్న దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా 125 కిలోల మేరకు తలసరి ఆహార వృథా జరుగుతోంది. నిష్కారణంగా ఆహారాన్ని వృథా చేయడంలో సంపన్న దేశాలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు చాలు. ఇవి స్వీడిష్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫుడ్ అండ్ బయో టెక్నాలజీ సేకరించిన లెక్కలు.
 
  పదార్థాల వారీగా చూసుకుంటే చిరు ధాన్యాల్లో 30 శాతం, పాల ఉత్పత్తుల్లో 20 శాతం, మత్స్య ఉత్పత్తుల్లో 35 శాతం, పండ్లు, కాయగూరల్లో 45 శాతం, పప్పుధాన్యాలు, నూనె గింజల్లో 20 శాతం, మాంసాహార ఉత్పత్తుల్లో 20 శాతం వృథా అవుతున్నట్లు ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆహార వృథాను కనీసం 25 శాతం మేరకు అరికట్టగలిగినా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంతో నీరసిస్తున్న వారి ఆకలి తీర్చడం సాధ్యమవుతుందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. యథేచ్ఛగా సాగుతున్న ఆహార వృథా వల్ల పర్యావరణానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతోంది. వృథా అవుతున్న ప్రతి టన్ను ఆహార పదార్థాల వల్ల భూతాపానికి కారణమయ్యే వాయువులు 3.8 టన్నుల మేర విడుదలవుతున్నాయని ఎఫ్‌ఏఓ చెబుతోంది.
 
 భారత్‌లోనూ భారీ వృథా
 ఆకలి కేకలు వినిపించే ప్రాంతాలు భారత్‌లోనూ చాలానే ఉన్నాయి. మరోవైపు, భారత్‌లో జరుగుతున్న ఆహార వృథా తక్కువేమీ కాదు. భారత్‌లో ఏటా 2.10 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఇంకోలా చెప్పాలంటే, బ్రిటన్ ప్రజలు ఏటా వినియోగించే ఆహారంతో దాదాపు సమానమైన పరిమాణంలో భారత్‌లో ఆహార వృథా జరుగుతోంది. విలాసవంతమైన పెళ్లి విందులు, పండుగలు పర్వాలు, సామూహిక వేడుకలతో పాటు హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాటిలో నిత్యం విలువైన ఆహార పదార్థాల వృథా జరుగుతూనే ఉంది. మన దేశంలో ఆహార పదార్థాల వృథా ఈ స్థాయిలో ఉంటే, మరోవైపు దాదాపు 20 కోట్ల మంది ప్రజలు తరచు పస్తులతో అలమటిస్తున్నారు. ఏటా దాదాపు 70 లక్షల మంది చిన్నారులు ఆకలితో, పోషకాహార లోపంతో ప్రాణాలు కోల్పోతున్నారు.

Advertisement
Advertisement