ఉత్తరం: సరదా... సమస్య కాకూడదు! | Sakshi
Sakshi News home page

ఉత్తరం: సరదా... సమస్య కాకూడదు!

Published Sun, Aug 18 2013 2:31 AM

ఉత్తరం: సరదా... సమస్య కాకూడదు! - Sakshi

ఎవరో ఏదో పేరుతో అకౌంట్ ఓపెన్ చేస్తారు. అదే అసలు పేరు అనుకుంటాం మనం. వాళ్లు పెట్టే ఫొటోలు కూడా వాళ్లవే అయి ఉంటాయని చెప్పలేం. ఫేస్‌బుల్‌లో ఫొటోలు చూసి ఇష్టపడి, తర్వాత వాళ్లను నేరుగా చూసి షాక్ తిన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు.
 
 ఒక వ్యక్తి తనను ప్రేమించి, మోసగించాడంటూ ఈ మధ్యనే ఒక అమ్మాయి పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. పోలీసులు కేసును తీసుకున్నారు. కానీ అతడిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే, ఆమె అతడి వివరాలేమీ స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రేమించినవాడి గురించి తెలియకపోవడమేంటని పోలీసులు ఆశ్చర్యపోయారు. కేవలం ఫేస్‌బుక్ ద్వారా అతడితో పరిచయమైందని, ప్రేమలో పడ్డానని, ఒకసారి కలుసుకున్నామని, అప్పుడే అనుకోకుండా అతడికి శారీరకంగా దగ్గరయ్యానని, తర్వాత అతను టచ్‌లోకి రావడం మానేశాడని చెప్పిందామె. ఆమె మీద కోప్పడాలో, జాలిపడాలో అర్థం కాలేదు పోలీసులకు. ఈ కేసు గురించి విన్నవారు మాత్రం... ఫేస్‌బుక్‌లో పరిచయమైనవాణ్ని నమ్మి అంత పెద్ద స్టెప్ ఎలా వేసింది అంటూ విమర్శించారు. వారి విమర్శ సరైనదేనా? తప్పు ఆ అమ్మాయిదేనా?
 
 సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్... ఈ మాట వింటేనే యువత వెర్రెక్కిపోతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, చాటింగ్ అంటూ వాటి వెంట పరుగులు తీస్తోంది. వీటివల్ల అబ్బాయిల సంగతేమో కానీ... అమ్మాయిలకు వచ్చే నష్టాలకు కొదువే లేదు. ముఖ్యంగా స్నేహం పేరుతో జరిగే మోసాలు, ప్రేమ పేరుతో జరిగే అన్యాయాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటిని ఎలా ఆపాలి?
 
 ఈ మోసాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మాయిలదేనంటారు ఆస్ట్రేలియాకు చెందిన సంఘ సేవకురాలు బెట్టీ డేవిస్. ఆవిడ అన్నదాంట్లో ఎంతో వాస్తవం ఉంది. నెట్‌వర్కింగ్ సైట్లు వచ్చింది కమ్యునికేషన్‌ని ఈజీ చేయడానికి. దానికి అంతవరకే పరిమితం చేయాలి. లేదంటే పైన చెప్పుకున్న పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని స్నేహం చేయడం తప్పు అని కాదు. కానీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా స్నేహం, ప్రేమ అంటే కచ్చితంగా తప్పే. ఎవరో ఏదో పేరుతో అకౌంట్ ఓపెన్ చేస్తారు.
 
 అదే అసలు పేరు అనుకుంటాం మనం. వాళ్లు పెట్టే ఫొటోలు కూడా వాళ్లవే అని చెప్పలేం. ఫొటోలు చూసి ఇష్టపడి, తర్వాత వాళ్లను నేరుగా చూసి షాక్ తిన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ఒకవేళ వాళ్ల వివరాలు నిజమైనవే అయినా, వాళ్లు ఎలాంటివాళ్లో తెలియకుండా ఆశల్ని పెంచుకోకూడదు. నిజంగా ఇష్టపడితే కనుక వాళ్ల గురించి వాళ్ల మాటల ద్వారా కాకుండా నేరుగా తెలుసుకోవాలి. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, వారి కుటుంబ సభ్యులను కలిసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అతడు వీటిలో దేనికి వెనుకాడినా అనుమానించాల్సిందే. ఆ బంధానికి స్వస్తి చెప్పాల్సిందే.
 
 అయితే అసలిలాంటి పరిచయాలు పెంచుకోకపోవడమే మంచిదంటారు బెట్టీ. ‘నెట్‌వర్కింగ్ సైట్లకు ఒక్కసారి దగ్గరైతే, దూరం కావడం కష్టం. అందుకే వాటికి అడిక్ట్ కాకుండా ఉండటం మంచిది’ అంటారామె. అవును నిజమే. చెడ్డదని తెలిసి కూడా ఎందుకు అలవాటుపడాలి! ఓ ఆడపిల్ల అర్ధరాత్రి ఆన్‌లైన్లో ఉంటే ఎవరైనా ముఖ్యమైన వారితో కమ్యునికేట్ చేస్తోందని అనుకుంటారు విదేశాల్లో. కానీ మన సంస్కృతి ఇంకా అంత ఎదగలేదు. అర్ధరాత్రి ఆన్‌లైన్లో చక్కర్లు కొడుతోందంటే ఓ రాయి వేసి చూద్దామనుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు మనకు. అందరూ అలా ఉంటారని కాదు. అలాంటివారు కూడా ఉన్నారని! అందుకే అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, ఉచ్చులో పడటం తేలికే. కానీ దాన్నుంచి బయటపడేలోపు జీవితమే ఖాళీ అయిపోతుంది!

Advertisement
Advertisement