Sakshi News home page

క్షణ క్షణం...నీ నిరీక్షణలో!

Published Sun, Aug 2 2015 4:24 AM

క్షణ క్షణం...నీ నిరీక్షణలో!

 అభిరుచులు కలిశాయి.
 మనసులు ఒక్కటయ్యాయి.
 మనువుతో బతుకులు ముడిపడ్డాయి.
 కానీ ఆ ముడి ఎందుకు విడిపోయింది?
 
  గ్రేట్ లవ్ స్టోరీస్
 ‘ఆకాశంకేసి చూస్తున్నాను...
 గంటలు గడిచాయి. రోజులు, వారాలు గడిచాయి. నీ జాడ మాత్రం లేదు.
 నేల మీద ఇప్పుడే ఒక పువ్వు పూచింది. నువ్వు మళ్లీ పుట్టావు కదూ!’
  ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమైతే... ప్రేమలు ఎక్కడ నిర్ణయమవుతాయి?’’ ఆ సాయంత్రం వర్షాన్ని చూస్తూ, వేడి కాఫీ చప్పరిస్తూ అడిగింది క్యాథలీన్.‘‘అభిరుచులు అనే స్వర్గంలో’’ అన్నాడు  రెయాన్.
 
 ‘‘అందుకేనేమో మనం  ఇలా ప్రేమికులమయ్యాం’’ అందంగా నవ్వుతూ అంది క్యాథలీన్. అంతలో పెద్ద శబ్దం. ఎక్కడో పిడుగు పడింది. భయంగా చెవులు మూసుకుంది క్యాథలీన్. ‘‘ఎందు కలా  చిన్నపిల్లలా  భయపడతావు?’’... భుజం మీద చేయివేస్తూ అన్నాడు రెయాన్. ‘‘కొన్ని భయాలంతే. వయసుతో పాటు పెరిగి పెద్దవుతాయి’’ అందామె.
    
 రెయాన్, క్యాథలీన్‌లు ప్రేమలో పడడానికి బలమైన కారణం...వారి అభిరుచులు ఒక్కటి కావడమే!
 జంతుసంక్షేమం నుంచి ప్రకృతి ప్రేమ, సినిమాలు, యోగా, పర్వతా రోహణ  వరకు... ఇద్దరి అభిరుచులూ ఒక్కటే. ‘అతడు  నా మనిషి’ అని ఆమె, ‘ఆమె నా మనిషి’ అని అతడు అనుకోవ డానికి వారికి ఎంతో కాలం పట్టలేదు.
 ‘‘ఆమె నా ప్రేమికురాలు మాత్రమే కాదు.. నాకు దారి చూపే వెలుగు దీపం.  నా కోసమే పుట్టింది. ఆమె నా వెనకాల ఉంటే ఏదైనా చేయగలను’’ అంటూ ఉండేవాడు రెయాన్.
 
  అతని ప్రేమ ఎంత గొప్పదో తెలుసు కనుక అతని ఫ్రెండ్‌‌సకి ఆ మాటలు అతిశయోక్తుల్లా తోచేవి కావు.అతడు అంత ప్రేమించడానికి క్యాథలీన్‌లో ఉన్న ప్రత్యేక క్వాలిటీస్ కూడా కారణమే. ఆమె అందమైనదే కాదు, గొప్ప మనసున్నది. ఆ గొప్పదనాన్ని ఇతరులకు సాయం చేస్తోన్న ఎన్నో సందర్భాల్లో గమనించాడు రెయాన్. ఆ మంచితనానికే మనసు పారేసుకున్నాడు. ప్రేమలో పడ్డ ఆరు నెలలకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ సంతోషాన్ని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని కొలెరాడోలోని మౌంట్ యేల్ పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లారు.
 
 మౌంట్ యేల్ పర్వత శిఖరాలు, బూడిద రంగులో ఉన్న  ఆకాశంతో ఏదో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్నాయి. ‘‘చూడు... ఆ దృశ్యం ఎంత ముచ్చటగా ఉందో’’ అంది క్యాథలీన్. ‘‘ శిఖరం నేనైతే... ఆకాశం నువ్వు’’ కవిత్వం అల్లాడు రెయాన్.
 పర్వతారోహణ మొదలైంది. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకుంటూ ఎవరి దారిన వారు పర్వతాన్ని అధిరోహిస్తున్నారు. వాతావరణంలో మార్పేదో కనబడుతోంది. అప్పటి వరకు ప్రసన్నంగా ఉన్న ఆకాశం... అపకారమేదో చేయబోతున్నట్లుగా ముఖం పెట్టింది. అంతవరకూ ఉన్న మౌనాన్ని వీడి, గొంతు సవరించుకొని గర్జిస్తోంది.క్యాథలీన్ కాస్త కంగారుపడింది. రెయాన్ ధైర్యం చెప్పాడు. అంతలో ఊహించని సంఘటన. ఓ పెద్ద పిడుగు క్యాథలీన్‌కు అతి చేరువలో పడింది. ఆమె శరీరం చాలా వరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను తీసుకుని ఆస్పత్రికి పరుగెత్తాడు రెయాన్.
 
 గంటలు గడుస్తున్నాయి. క్యాథలీన్ కోలుకోలేదు. రెయాన్ మెదడు స్తంభించి పోయింది. ఆమె వైపే దీనంగా చూస్తు న్నాడు. నలభై నిమిషాలు గడిచాయి. క్యాథలీన్‌కి అంతిమ ఘడియలు సమీపించాయి. మెల్లగా కళ్లు తెరిచింది. ఎందుకిలా జరిగింది అన్నట్టు రెయాన్ వైపు చూసింది. నిన్ను వీడి నేను వెళ్లలేను అన్నట్టుగా చేతిని అతని వైపు చాపింది. అతడు దాన్ని అందుకోబోయాడు. కానీ అంతలోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆమె చేయి నిర్జీవంగా వాలిపోయింది.

 క్యాథలీన్ అంత్యక్రియలు జరిగాయి. కానీ వాటికి రెయాన్ హాజరు కాలేదు. ఆమెను సమాధి చేశారు. కానీ ఇప్పటికీ అతడు దాన్ని చూడలేదు. ఎందుకంటే ఆమె చనిపోయిందన్న విషయాన్ని అతడు నమ్మడం లేదు. పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లిన క్యాథలీన్ కిందికి దిగి వస్తుందని నేటికీ రోజూ మౌంట్ యేల్ దగ్గర నిలబడి దీనంగా చూస్తున్నాడు!     

Advertisement

What’s your opinion

Advertisement