Sakshi News home page

మౌనంగానే... ఎదగమని...

Published Sun, Feb 26 2017 1:12 AM

మౌనంగానే... ఎదగమని...

‘‘మౌనమే నీ భాషయితే...
మంచితనమే నీ ధ్యాసయితే..
జీవితంలో ప్రతి మజిలీ మధురమే’’


అన్నారు దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి. రవితేజ హీరోగా నటించిన ‘నా ఆటోగ్రాఫ్‌.. స్వీట్‌ మెమురీస్‌’లో పాటల రచయిత చంద్రబోస్‌ రాసిన ‘మౌనంగానే ఎదగమని...’ పాటతత్వం గురించి ‘అహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’, ‘భాయ్‌’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ చౌదరి మాటల్లో...

పల్లవి:
మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది (2)
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
‘‘మౌనంగానే..‘‘


ప్రతి వ్యక్తి జీవితంలో జయాపజయాలు సహజం. గోడకు కొట్టిన బంతి ఎంత బలంగా పైకొస్తుందో... ఒక్కోసారి నింగికెసిన వ్యక్తి, అనూహ్యంగా నేల మీదకు పడొచ్చు. ప్రతి మనిషి కెరీర్‌లో గానీ, సంపాదనలో గానీ ఉన్నత స్థానాలు అధిరోహిస్తాడు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. సడన్‌గా కింద పడొచ్చు. నింగి నుంచి నేలకు పడిన సమయంలో మన భుజం తట్టి మనోధైర్యాన్నిచ్చే మనుషులు కావాలంటే... ఎదుగుదలప్పుడు మౌనమే నీ భాష కావాలి. అందుకే, ఎంత ఎత్తుకి ఎదిగినా అందరికీ నీడనిచ్చే మొక్కలా బతకాలి. అదే విధంగా ఒక్కసారైనా ఓడిన వ్యక్తికి గెలుపు విలువ తెలుస్తుంది. చిత్ర పరిశ్రమలోనూ ఒక్కోసారి వరుసగా సూపర్‌ హిట్లు పడతాయి. తర్వాత ఒక్క ఫ్లాప్‌ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డౌన్‌ అవుతాం. ‘అహనా పెళ్లంట’, ‘పూల రంగడు’ హిట్స్‌ తర్వాత ‘భాయ్‌’ నన్ను డిజప్పాయింట్‌ చేసింది. తర్వాత ‘చుట్టాలబ్బాయి’తో మళ్లీ చిగురించాను. ఓ ఫ్లాప్‌ వచ్చిందని ఆ రోజే బాధపడితే.... నెక్ట్స్‌ హిట్‌ మిస్‌ అయ్యేవాణ్ణి.

చరణం :
దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉంది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది ‘‘మౌనంగానే..‘‘


ఉదాహరణకు.... తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు భక్తులందరూ కష్టపడతారు. ప్రతి ఒక్కరికీ కాళ్ల నొప్పులు సహజమే. ఆ నొప్పిని భరించి కొండపైకి వెళ్తే స్వామి దర్శనం జరుగుతుంది. ఆ అందమైన అనుభూతిని మాటల్లో వర్ణించలేం. జీవితంలోనూ అంతే. మనం కోరుకునే గమ్యం చేరాలంటే ఎంతో దూరం ప్రయాణించాలి. ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదురు కావొచ్చు. అసలు ప్రయాణమే భారంగా ఉండొచ్చు. అప్పుడు ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెడితే... గమ్యం చేరుకున్న తర్వాత వచ్చే సంతోషాన్ని కోల్పోతాం. కొన్నిసార్లు మన ప్రయత్నలోపం లేనప్పటికీ, ఫలితం తేడా! అమృతం బదులు విషం వస్తుంది. అప్పుడు మనిషి సహనం కోల్పోకూడదు. అవరోధాలను దాటి సరైన దారిలో ప్రయాణిస్తే.. అమృతం సొంతమవుతుంది. ఒక్కోసారి హీరోలకు, నిర్మాతలకు కథలు చెప్పి ఒప్పించడానికి ఐదారేళ్లు పడుతుంది. అప్పుడు సహనంతో ప్రయత్నిస్తేనే అవకాశాలొస్తాయి. మళ్లీ సినిమా సూపర్‌ హిట్టయినప్పుడు ఐదారేళ్ల కష్టం గుర్తుకు రాదు. ఆనందం మాత్రమే మన తోడుంటుంది.

చరణం:
చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
‘‘మౌనంగానే..‘‘


‘చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో’ అంటే... చెమట పడితే తలరాత మారుతుందని కాదు. మనకు చెమట ఎప్పుడు పడుతుంది, ఎక్కువ కష్టపడినప్పుడు! ఎవరైతే చేసే పనిలో ఎక్కువ కష్టపడతారో వాళ్లే పైకి వస్తారు. ‘నా తలరాత ఇంతే. ఏం చేసినా కలసిరావడం లేదు’ అని చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం ఉండదు. ఏం చేయాలన్నా అడ్డుతగిలే మన చెడు ఆలోచనలకు చెక్‌ పెట్టి, కష్టపడి పనిచేయడం ప్రారంభించాలి. ‘కష్టే ఫలి’ అన్నారు పెద్దలు. మన కష్టమే బ్రహ్మ రాసిన తలరాతను మారుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకు పోయాయని బాధపడతారు. ఏ తలుపు తట్టినా ప్రయోజం లేదని దిగులుపడతారు.అసలు తలుపు తడితేనే కదా...


 ఓపెన్‌ చేసుందో, దగ్గరకు వేసుందో తెలిసేది! లాక్‌ చేయకుండా దగ్గరకు వేసుండొచ్చు కదా! తలుపును తడితే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. అది కూడా చేయకపోవడం తప్పు. నెగిటివ్‌ ఫీలింగ్స్‌ని పక్కనపెట్టి, ధైర్యంగా సంకల్పంతో ముందడుగు వేయాలి. ప్రతి వ్యక్తికీ స్ఫూర్తిమంతంగా నిలిచే పాటిది. మనిషి జీవిత ప్రయాణంలో ప్రతి మజిలీనీ చంద్రబోస్‌గారు చక్కగా వర్ణించారు. కీరవాణిగారి సంగీతం, కె.ఎస్‌. చిత్రగారి గానం అద్భుతం. నేను సహాయ దర్శకుడిగా పని చేస్తున్న టైమ్‌లో ఈ పాట, సినిమా వచ్చాయి. అప్పుడూ.. ఇప్పుడూ.. నాతో సహా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ పాట ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది.
ఇంటర్వూ్య: సత్య పులగం

Advertisement

What’s your opinion

Advertisement