తారాస్వరం : ప్రేమకోసం ఏం చేసినా తప్పులేదు - నయనతార | Sakshi
Sakshi News home page

తారాస్వరం : ప్రేమకోసం ఏం చేసినా తప్పులేదు - నయనతార

Published Sun, Nov 17 2013 1:24 AM

తారాస్వరం :   ప్రేమకోసం ఏం చేసినా తప్పులేదు - నయనతార - Sakshi

 ఆత్మవిశ్వాసం, నిజాయతీ ఉన్నవాళ్లకు త్వరగా దగ్గరవుతాను. అబద్ధాలాడేవాళ్లంటే అస్సలు ఇష్టముండదు. హిపోక్రసీకి దూరంగా పారిపోతాను.
     హీరోయిన్ అనగానే అందం గురించే మాట్లాడుతుంటారంతా. ఇంటర్వ్యూల్లో కూడా... మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అని తప్పక అడుగుతుంటారు. మిగిలినవాళ్ల సంగతేమో గానీ అందం కోసం అతిగా కష్టపడటం నావల్ల కాదు. ఆహారం దగ్గర్నుంచి వ్యాయామం వరకూ ఏదీ ప్రత్యేకంగా పాటించను నేను. కాకపోతే ఒంటికి చెడు చేసేవాటికి దూరంగా ఉంటాను... అంతే.
 
     నాకు భక్తి కాస్త ఎక్కువే. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాను. వీలు చిక్కినప్పుడల్లా హిందూ దేవాలయాలను కూడా సందర్శిస్తుంటాను. నమ్మకమే దేవుడు. అందుకే అందరు దేవుళ్లూ ఒకటే అనుకుంటాను!
 
     జీవితంలో ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకరితో బంధం ఏర్పడటం, అదే బంధం ఉన్నట్టుండి విచ్ఛిన్నమవడం కూడా అలానే జరుగుతాయి. ఏది జరిగినా దాని వెనుక బోలెడన్ని కారణాలు ఉంటాయి. అందుకే ఏది ఎలా జరిగినా స్వీకరించక తప్పదు. దానికి అనుగుణంగా ముందుకు సాగిపోకా తప్పదు.
 
     మనం ఎంతో కావాలనుకున్నవాళ్లు, జీవితాంతం మనతోనే ఉంటారని, ఉండాలని కోరుకున్నవాళ్లు దూరమైతే జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఆ పరిస్థితికి ఎదురీదడం అంత తేలిక కాదు. కానీ ఎదురీదక తప్పదని నా అనుభవం నాకు నేర్పింది.
 
     నా వరకూ నేను ప్రేమకు చాలా విలువిస్తాను. ఆ మాటను ఎంతో గౌరవిస్తాను. ప్రేమ కోసం ఏం చేసినా, ఎంత చేసినా తప్పు లేదని భావిస్తాను.
 
     నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ వేగంగా అందరికీ చేరిపోతుంటాయి. నన్నే తీసుకోండి. నేనెప్పుడూ ఓపెన్‌గా ఉంటాను. మంచయినా చెడయినా ముఖమ్మీదే మాట్లాడేస్తాను. దాచిపెట్టాలని అస్సలు ప్రయత్నించను. అయినా నా గురించి ఏవేవో పుట్టిస్తారు, పత్రికల్లో రాసేస్తారు. నేనలాంటి వాటిని పట్టించుకోను. నమ్మేవాళ్లు కూడా అలాంటి వాటిని కాస్త ఆలోచించి నమ్మితే బాగుంటుంది. ఎందుకంటే, అందరూ నిజాలే రాయరు కదా!
 
     నాకు స్వతహాగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదు. అలాగని అస్సలు ఇవ్వనని కాదు. కాస్త తక్కువగా ఇస్తాను. ఎందుకంటే, వృత్తి వేరుగా వ్యక్తిగత జీవితం వేరుగా ఉండాలని ఆశపడతాను నేను. వృత్తిపరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటాయి. ఇక వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూల ద్వారా అందరికీ చెప్పుకోవడం నాకంత నచ్చదు. అందుకే కొన్నిసార్లు వాటిని అవాయిడ్ చేస్తుంటాను.
 
 నేను తక్కువగా మాట్లాడతానని నాది యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ అనుకుంటారు కొందరు. అది నిజం కాదు. నేను అందరితోనూ స్నేహంగానే ఉంటాను. కాకపోతే నా పరిధుల్లో నేను ఉంటాను. వీలైనంతవరకూ నా సమయాన్ని నేను గడుపుడుతుంటాను. సినిమాలు చూస్తాను. పుస్తకాలు చదువుతాను. సరదాగా ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తుంటాను.
 
  కెరీర్ ప్రారంభించినప్పుడు కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపాను. నిలదొక్కుకోవాలంటే అవి చేయడం తప్పనిసరి. అందుకే అలాంటి చిత్రాలు, పాత్రలనే ఎంపిక చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకంటూ ఓ స్థానం ఏర్పడింది. ఓ ఇమేజ్ ఏర్పడింది. అందుకే మనసుకు నచ్చిన పాత్రల కోసం వెతుకుతున్నాను.
 
     నా కెరీర్‌లో ‘అనామిక’ ఓ ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుందని అనుకుంటున్నాను. ‘కహానీ’లో విద్యాబాలన్ అద్భుతంగా పోషించిన పాత్ర అది. దాన్ని చేసి మెప్పించడం అంత తేలిక కాదు. అందుకే నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. విద్య నుంచి స్ఫూర్తి పొందానే తప్ప అనుకరించేందుకు ప్రయత్నించలేదు. నా శైలిలో నేను చేస్తున్నాను. కచ్చితంగా నూరుశాతం న్యాయం చేయగలనన్న నమ్మకం నాకుంది!
 
 నవంబర్ 18 నయనతార పుట్టినరోజు
 అసలు పేరు    :    డయానా కురియన్
 ముద్దు పేరు   :    మణి
 జన్మస్థలం     :    తిరువల్ల, కేరళ
 చదువు         :    ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ
 నచ్చే రంగు   :    నలుపు
 నచ్చే ఆహారం    :    నార్త్ ఇండియన్
 నచ్చే హీరో    :    రజనీకాంత్

Advertisement
Advertisement