కుండీ కిందే నీటి కొలను! | Sakshi
Sakshi News home page

కుండీ కిందే నీటి కొలను!

Published Sun, Nov 6 2016 12:38 AM

కుండీ కిందే నీటి కొలను!

స్వజలాం... సుఫలాం...
 ఆసక్తితో ఇంటిపంటలు పెంచడం ప్రారంభించినా ఉరుకులు, పరుగుల జీవితంలో ప్రతి రోజూ మొక్కలకు నీటిని అందించటం కొంచెం ప్రయాసతో కూడిన పనే. నేల మీద పెరిగే మొక్కల మాదిరిగా కుండీల్లోని మొక్కలు త్వరగా బెట్టకు వస్తాయి. ఈ సమస్యకు పరిష్కారంగా విశాఖపట్నంలోని విశాలాక్ష్మి నగర్‌కు చెందిన గంటి వెంకటేష్(99482 72715) కుండీల కిందే నీటిని నిల్వ ఉంచి, అవసరం మేరకు నీటిని మొక్కలు ఉపయోగించుకునేలా వేర్వేరు పద్ధతుల్లో ‘సెల్ఫ్ వాటరింగ్ పాట్స్’ను తయారు చేసుకొని వాడుతున్నారు. 200 కుండీల్లో ఇంటిపంటలు పెంచుతున్న వెంకటేష్ తక్కువ ఖర్చుతోనే ఇంటిపంటల సాగు సాధ్యమేనంటున్నారు. ఈ కుండీల్లో నీటిని నింపితే వారం రోజుల వరకు సరిపోతుంది. ఈ పద్ధతి వల్ల కలుపు సమస్య పోయిందన్నారు.
 
 సెల్ఫ్ వాటరింగ్ పాట్ తయారీ ఇలా..
  రెండు ప్లాస్టిక్ కుండీలు, కుండీకన్నా కొంచె పొడవైన పీవీసీ పైపు, ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్లాస్టిక్ గ్లాసును తీసుకోవాలి. ఒక కుండీ(రిజర్వాయర్ కుండీ)లో సగం వరకు నీరు పోయాలి. రెండో కుండీ అడుగున రెండంగుళాల బెజ్జం చేసి.. అందులో నుంచి చిన్న ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్లాస్టిక్ గ్లాస్‌ను కిందికి దూర్చాలి. దీనికి చుట్టూ చిన్న బెజ్జాలు పెట్టాలి. రెండో కుండీ అడుగున మరో బెజ్జం చేసి పీవీసీ పైపును దూర్చాలి. తర్వాత ఆ కుండీలో పై నుంచి మట్టిమిశ్రమం నింపి, నీరు పోసిన కుండీలో పెట్టాలి. కిందికి దూర్చిన ప్లాస్టిక్ బాటిల్/గ్లాసుకున్న బెజ్జాల నుంచి మట్టి మిశ్రమానికి కేశాకర్షక శక్తి(కాపిల్లరీ ఫోర్స్) ద్వారా తగుమాత్రంగా నీటి తేమ నిరంతరం అందుతూ ఉంటుంది. అడుగున ఉన్న రిజర్వాయర్ కుండీలో నీరు అయిపోయినప్పుడు.. పీవీసీ పైపు ద్వారా నీటిని పోస్తే చాలు.
 
 రిజర్వాయర్ కుండీలో నీటి పరిమాణం తెలుసుకోవటానికి కుండీకి సగం ఎత్తులో చిన్న రంధ్రం చేయాలి. మనం నీరు పోసినప్పుడు నీటిమట్టం ఆ స్థాయికి వచ్చినప్పుడు, వర్షం ఎక్కువగా కురిసినప్పుడు ఆ రంధ్రం ద్వారా నీరు బయటకు పోతుంది.రెండో పద్ధతి: పనికిరాని మినరల్ వాటర్ 20 లీటర్ల బాటిళ్లు తక్కువ ధరకు లభిస్తాయి. ఈ బాటిల్‌ను అడ్డంగా కోసి.. అడుగు భాగాన్ని రిజర్వాయర్ కుండీగా వాడొచ్చు. పై భాగంలో నుంచి ప్లాస్టిక్ గ్లాసు (చుట్టూ చిన్న బెజ్జాలు పెట్టాలి)ను కిందికి దూర్చి.. ఆ తర్వాత మట్టిమిశ్రమం నింపి మొక్క నాటుకోవచ్చు. మూడో పద్ధతి: రిజర్వాయర్ కుండీగా పెద్ద కుండీకి బదులుగా.. గట్టిగా ఉండే చిన్న ప్లాస్టిక్ కంటెయినర్‌ను ఇలా వాడొచ్చు.
 

Advertisement
Advertisement