అరణ్యం: ఆస్ట్రిచ్‌లు రాళ్లెందుకు తింటాయి? | Sakshi
Sakshi News home page

అరణ్యం: ఆస్ట్రిచ్‌లు రాళ్లెందుకు తింటాయి?

Published Sun, Nov 17 2013 3:14 AM

అరణ్యం:  ఆస్ట్రిచ్‌లు రాళ్లెందుకు తింటాయి?

 సాధారణంగా జంతువులు, పక్షులు వెనక్కి తన్నుతాయి. కానీ ఆస్ట్రిచ్‌లు మనుషుల మాదిరి కాళ్లతో ముందుకు తన్నుతాయి. పొరపాటున శత్రువు ఎదురుగా వచ్చిందో... దాన్ని తన్నుకు పడి చావాల్సిందే!
 
     ఇవి ఆహారాన్ని నమలలేవు. అమాంతం మింగేస్తాయి. ఆ తరువాత చిన్న చిన్న గులకరాళ్లను మింగి, అటూ ఇటూ వడివడిగా తిరుగుతాయి. అప్పుడా రాళ్ల మధ్య ఆహారం నలిగి జీర్ణమవుతుందన్నమాట!
 
     ఆస్ట్రిచ్‌లు ఎంత బలంగా ఉంటాయంటే... సింహాలతో సైతం తలపడగలవు. మనిషిని సైతం చంపగలవు. కానీ వీటి తల చాలా బలహీనంగా ఉంటుంది. కాస్త గట్టి దెబ్బ తగిలినా చాలు... ప్రాణాలను కోల్పోతాయివి!
 
     ఆస్ట్రిచ్‌లు నీళ్లు తాగకుండా చాలాకాలం ఉండగలుగుతాయి. ఎందుకంటే తనంతట తానుగా తేమను సృష్టించుకునే లక్షణం వీటి శరీరానికి ఉంది. అందుకే నీళ్లు కనిపిస్తే ఇవి వాటిని తాగవు. ముందు నీటిలోకి దిగి తనివి తీరా స్నానం చేస్తాయి. తర్వాతే తాగుతాయి!
 
     వీటికి ఎరుపు రంగు అంటే అస్సలు నచ్చదు. ముఖ్యంగా మగ ఆస్ట్రిచ్‌లు ఎరుపును చూస్తే కోపంతో రెచ్చిపోతాయి!
 
     ఆడ ఆస్ట్రిచ్‌లు మహా తెలివైనవి. తాము పెట్టిన గుడ్లు... కొన్ని వందల గుడ్లలో కలిసిపోయినా కూడా అవి గుర్తించేస్తాయి!
 
     ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత ఉంటుందో తెలుసా? దీని ఒక్క గుడ్డు, రెండు డజన్ల కోడిగుడ్లతో సమానం!
 
     ఏడెనిమిది ఆస్ట్రిచ్‌లు గుంపుగా ఏర్పడతాయి. వీటిలో ఒకటి తప్ప అన్నీ ఆడ పక్షులే ఉంటాయి. మగది లీడర్‌గా ఉంటుంది. ఇది ఆ గుంపులోని ఒక ఆడపక్షిని ఎంచుకుని జతకడుతుంది. అది లీడర్‌గారి భార్య అన్నమాట!
 
 
 నాలాంటిది మరోటి లేదు తెలుసా!    
 తెల్లగా, ముద్దుగా ఉన్న ఈ బుజ్జి జీవి... కోయలా బేర్. ఎలుగు జాతికి చెందినదే అయినా ఎలుగుబంటి లక్షణాలు ఏమాత్రం ఉండని సాధు జంతువులు కోయలాలు. అయితే ఇవి సాధారణంగా నలుపు, తెలుపు రంగులు కలగలిసి ఉంటాయి. కానీ ఇది ఎంత తెల్లగా ఉందో చూశారుగా! అందుకే మరి దీని గురించి అందరూ స్పెషల్‌గా మాట్లాడుకునేది!
 
 1997వ సంవత్సరంలో శాన్ డీగో జూలో జన్మించింది ఈ తెల్లటి కోయలా. పుట్టినప్పుడు ఇది అన్నిటిలాగే నలుపు, తెలుపు రంగులు కలగలిపి ఉంది. కానీ ఆరు నెలలు గడిచేసరికి ఇలా పూర్తిగా తెల్లగా అయిపోయింది. సాధారణంగా ఎక్కడా తెల్ల కోయలాలు కనిపించవు. దట్టమైన అడవుల్లో ఎక్కడైనా ఒకటీ రెండూ ఉండవచ్చు అని జీవ శాస్త్రవేత్తలు అంటుంటారు తప్ప ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసింది లేదు. అందుకే దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. దీనికి జూ అధికారులు ఒన్యా బిర్రీ అని పేరు పెట్టారు. అంటే ‘ఘోస్ట్ బాయ్’ అని అర్థమట. ఇప్పటి వరకూ బిర్రీయే అందరికీ తెలిసిన తెల్ల కోయలా. అందుకే దీన్ని అందరూ ప్రత్యేకంగా చూస్తుంటారు, మాట్లాడుకుంటారు!
 

Advertisement
Advertisement