స్వాతంత్య్ర పోరాటంలో కీలకం ఆజాద్‌ రేడియో | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర పోరాటంలో కీలకం ఆజాద్‌ రేడియో

Published Tue, Feb 12 2019 12:52 AM

Article On Azad Radio Role In Quit India Movement - Sakshi

ఐక్యరాజ్యసమితి రేడియో 1846 ఫిబ్రవరి 13న  ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాది రేడియో దినోత్సవం సందర్భంగా ‘సంభాషణ, సహిష్ణుత, శాంతి’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్దేశించారు.   

అయితే, సంభాషణ మృగ్యమై, సహిష్ణుత లుప్తమై, శాంతి కరువైన క్విట్‌ ఇండియా ఉద్యమ వేళ 1942లో ఒక రహస్య వాణి 78 రోజులపాటు ఈ జాతిని ప్రభావితం చేసింది. అప్పటి బ్రిటిష్‌ పాలకులు దీనిని ‘కాంగ్రెస్‌ ఇల్లీగల్‌ రేడియో’అని పిలిచారు. అయితే దాన్ని నిర్వహించిన నాయకులు ‘ఆజాద్‌ రేడియో’ అన్నారు. ఈ రహస్యవాణికి వ్యూహకర్త రామ్‌ మనోహర్‌ లోహియా కాగా, నిర్వహించినది 20 నుంచి 40 ఏళ్ల మధ్యగల ఏడుగురు ధీశాలులు. అతి త్వరలో ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో, పాఠశాల విద్యార్థుల పుస్తకాల్లో అంతర్భాగం కానుంది.  

1942 ఆగస్టులో గాంధీజీ బ్రిటిష్‌వారి దుష్టపాలనకు మృత్యుగీతం రచిస్తూ ‘కరెంగే యా మారేంగే’అని పిలుపునిచ్చారు. అది మంత్రమై దేశం ఎల్లడెలా పాకింది. బ్రిటిష్‌ అధికారులు నాయకులను అగ్రస్థాయి నుంచి, బ్లాకు స్థాయి వరకూ చెరసాలల్లో బంధించారు. ఆ సమయంలో చాలామంది సోషలిస్టు నాయకులు తప్పించుకుని, రహస్యంగా ఉద్యమంలోకి సాగారు. 1942 ఆగస్టు 9 నుంచి ఉద్యమం నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ సమయంలో దిశానిర్దేశం చేసిన రహస్య మాధ్యమం ‘ఆజాద్‌ రేడియో’. 1942 ఆగస్టు 27 నుంచి బ్రిటిష్‌ ప్రభుత్వం కైవశం చేసుకునే వరకు నవంబర్‌ 12 వరకు గొప్ప సేవలందించింది. 1988 ఫిబ్రవరి 13 సంచిక మరాఠీ పత్రిక సాధనలో సోషలిస్టు నాయకుడు మధులిమాయే రాస్తూ నాసిక్‌లోని శంకరాచార్య మఠంలో ఆజాద్‌ రేడియో పరికరాలను విఠలరావ్‌ పట్వర్థన్‌ తెచ్చి ఉంచారనీ, అక్కడ నుంచి ప్రసారాలు చేయాలని తలంచినా, పోలీసు దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని గోదావరి నదిలో పడేశారని పేర్కొన్నారు. ‘అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ బ్రాడ్‌ కాస్ట్‌ డ్యూరింగ్‌ క్విట్‌ ఇండియా మూవ్‌మెంట్‌’అనే పుస్తకం 2018లో కేంద్ర ప్రభుత్వ సంస్థ పబ్లికేషన్‌ డివిజన్‌ ప్రచురించింది. ఇందిరాగాంధీ నేషనల్‌ సెంటర్‌ఫర్‌ ది ఆర్ట్స్, న్యూఢిల్లీకి చెందిన పరిశోధకులు గౌతమ్‌ చటర్జీ 1984 నుంచి నేషనల్‌ ఆర్కైవ్స్‌లో గాలించి పరిశోధన చేస్తున్నారు. వీరికి ‘పోలీస్‌ మానిటరీ రిపోర్ట్‌’ అనే పోలీసు ఇంటెలిజెన్స్‌ సీక్రెట్‌ ఫైల్‌ తారసపడింది. అప్పట్లో ఆజాద్‌ రేడియో ప్రసారాలను గమనిస్తూ, బ్రిటిష్‌ పోలీసులు తయారు చేసిన రహస్య ఫైలు ఇది. ఇందులో అక్టోబర్‌ 9 నుంచి పోలీసులు నమోదు చేసిన ప్రసారాల వివరాలున్నాయి. ఇవి పోలీసు ఇంటెలిజెన్స్‌ అధికారులు పరిశీలించిన అంశాలు. వీటిని గమనిస్తే కరాచీ నుంచి బృందావనం దాకా, అలహాబాద్‌ నుంచి బెంగాల్‌ దాకా, బిహార్‌ నుంచి మద్రాసు దాకా, కోయంబత్తూరు నుంచి త్రివేండ్రం దాకా, గుజరాత్‌ నుంచీ మహారాష్ట్ర దాకా సమాచారాన్ని చేరవేశారని అర్థమవుతుంది. 

‘‘..స్కౌట్‌ సిద్ధం చేసిన నివేదికలు జాగ్రత్తగా పరిశీలించిన కాంగ్రెస్‌ సోషలిస్టు భావాలతో సాగిన ఈ ప్రసారాలకు కీలకం రామ్‌ మనోహర్‌ లోహియా అని తెలి సింది. రైతులు, కార్మికుల కోసమే స్వాతంత్య్ర భారతదేశమని అక్టోబర్‌ 23వ తేదీ ప్రసారాలలో ప్రకటించడం గమనార్హం. అలాగే అక్టోబర్‌ 27వ తేదీన స్వాతంత్య్రం కోసం విప్లవం అనేది బీదల కోసం విప్లవం. రైతుల కోసం, కార్మికుల కోసమే ఈ స్వాతంత్య్ర భారతం’’అని బ్రిటిష్‌ గవర్నమెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌ ఈ ఆజాద్‌ రేడియో ప్రసారాల గురించి అప్పటి ప్రభుత్వానికి వివరించారు. 

సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ద్వారా నిర్వహించిన ‘ఆజాద్‌ హింద్‌ రేడియో’కు భిన్నమైనది ఈ ఆజాద్‌ రేడియో. అంతరాయం లేకుండా వివిధ ప్రాంతాల నుంచి కనీసం మూడు ట్రాన్స్‌మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71 రోజులు) ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్‌కేసులతో ట్రాన్స్‌మీటర్లను వేర్వేరు ప్రాంతాలకు బ్రిటిష్‌ వాళ్ల కళ్లుగప్పి తరలించేవారు. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్లపై ప్రసారాలు జరిగాయి. ప్రతిరోజూ ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసా రాలు సాగేవి. హిందుస్తానీ హమారా అనే పాటతో మొదలై, వందేమాతరంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసార శక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఈ ప్రసారాలు వినడానికి 225 రూపాయలు వెచ్చించి రేడియో సెట్టు కూడా నిర్వాహకులు కొన్నారు. ఈ ప్రసారాలు నిర్వహించినవారిలో గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల బాబూ భాయ్‌ విఠల్‌దాస్‌ మాథవి ఖక్కడ్‌ అనే పేరుగల యువకుడు ముఖ్యుడు. ముంబ యిలో ఫోర్త్‌ స్టాండర్డ్‌ మాత్రమే చదివిన ఈ కుర్రాడు కిరోసిన్‌తో కారు నడిపే యంత్రం కేరో గ్యాస్‌ తయారీ వ్యాపారంలో ఉండేవాడు. లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఇతనిదే. ఈ రేడియో ప్రసారాలు నిర్వహించినందుకు 1943 మే తీర్పు ప్రకారం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. సూరత్‌కు చెందిన 22 ఏళ్ల కుమారి ఉషామెహతా ఈ రేడియో ప్రసారాల విషయంలో బాబూ భాయ్‌కి కుడిభుజంగా ఉండేవారు. ట్రాన్స్‌మీటర్‌ వాడటం, మైక్రోఫోన్‌ ద్వారా లోహియా రాసిన ప్రసంగాలు రేడియోలో చదవడంవంటి పనులు చేసేవారు. ఎంఏ చదువుతున్న సమయంలో ఈమె ఈ ప్రసార సేవలు అందించారు. చివర్లో నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించిన మెహతా స్వాతంత్య్రం వచ్చాక ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇక నలభై ఏళ్ల పార్సీ నారీమన్‌ అబరాబాద్‌ ప్రింటర్‌ కూడా వీరితో చేతులు కలిపాడు. దాంతో బాబూభాయ్‌ కేరోగ్యాస్‌ వ్యాపారంతో చేతులు కలిపారు. దీన్ని నిషేధించాక, ఆజాద్‌ రేడియో ట్రాన్స్‌మీటర్‌ తయారు చేసి ఇచ్చాడు ప్రింటర్‌.  

ఈ ముగ్గురుతోపాటు గుజరాత్‌ భావనగర్‌ ప్రాంతా నికి చెందిన 28 సంవత్సరాల విఠల్‌ దాస్‌ కాంతాభాయ్‌ జవేరీ, బర్కానా సింథ్‌ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్‌లెస్‌ నిపుణులు నానక్‌ ఘర్‌ చంద్‌ మోత్వానీ, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్‌ బాబుభాయ్‌ జవేరీ, బొంబాయికే చెందిన 27 ఏళ్ల జగన్నాథ రఘునాథ్‌ ఠాకూర్‌ కూడా రేడియో ప్రసారాల్లో కీలకపాత్ర పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజెన్స్‌ రికార్డులలో ఉన్నాయి. అందువల్ల వారి పేర్లే ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇలా స్వాతంత్య్ర పోరాట సమయంలో రేడియో జర్నలిజానికి గొప్ప చారిత్రక సాక్ష్యంగా నిలిచింది ఆజాద్‌ రేడియో. (రేపు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా)


-డా‘‘ నాగసూరి వేణుగోపాల్‌
వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్‌ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్‌ ‘ మొబైల్‌ : 94407 32392

Advertisement
Advertisement