భాషలు వేరైనా కవిత్వం ఒక్కటే | Sakshi
Sakshi News home page

భాషలు వేరైనా కవిత్వం ఒక్కటే

Published Sat, Dec 14 2019 12:01 AM

Introductory Floor Of Adhe Nela In Hyderabad Study Circle - Sakshi

మన దేశం అనేక వైవిధ్యాలకు మూలం. సంస్కృతి, సంప్రదాయాలు, వేష, భాషల్లో ఎక్కడికక్కడే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటోంది. ఇంత వైవిధ్యాన్నీ దోసిట పట్టి అద్దంలో చూపించేది సాహిత్యం. వివిధ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని చదివితే ఆయా ప్రత్యేకతలన్నిటినీ కొంతవరకైనా అర్థం చేసుకోవచ్చు. అయితే, తెలుగు పాఠకులకు ఇతర భాషల్లోని కవిత్వం దగ్గర కాలేదు. వచన రచనలకంటే, కవిత్వాన్ని అనువదించడం క్లిష్టమని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆ లోటును మామూలుగా కాదు, భారీ ఎత్తున పూడుస్తూ ప్రముఖ కవి ముకుంద రామారావు ‘అదే నేల’ పేరిట భారతీయ కవిత్వం–నేపథ్యంను 867 పేజీలతో వెలువరించారు. భారత రాజ్యాంగం 22 భాషలకు గుర్తింపునిస్తే.. ఈ సంకలనంలో 32 భాషల నుంచి కవితలను సేకరించి, అనువదించి.. మన ముందుంచారు. ఆయా భాషల్లో కవిత్వం ప్రారంభమైన తీరు దగ్గర నుంచి ఆధునికతను సంతరించుకునే వరకూ తిరిగిన అన్ని కీలకమైన మలుపులనూ అందిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

శైలీ, శిల్పాల్లో వచ్చిన మార్పులను ప్రతిఫలించే కవితలకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయా భాషల్లోని ప్రముఖ కవులతోపాటు జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నవారందరినీ పొందుపరిచారు. కవుల పరిచయంతోపాటు, ఆయా భాషా సాహిత్య చరిత్రలను సైతం పరిచయం చేశారు. కవయిత్రులపైనా, తిరుగుబాటు స్వరాలపైనా ప్రత్యే కంగా దృష్టిసారించారు. ‘ఒకమారు నువ్వు అన్నావు ఈవిధంగా అయితే /ఆకాశమే నీ హద్దు అని/నేడు ఆకాశం నా చేతిలో ఉంది/కానీ నువ్వు లేవు ఆ ఘనమైన సంఘటనను చూడటానికి’ (జయంతి నాయక్‌–కొంకణి), ‘నా కళ్లలో/ఒక పురాతన నది ఉంది/నేను కూడా దానిని చూడలేదు/అయినా అది అక్కడ ప్రవహిస్తోంది’ (సురేష్‌ దలాల్‌–గుజరాతీ) వంటి పంక్తులు కవులను పెనవేసుకునే ప్రకృతికి నిద ర్శనంగా నిలుస్తాయి. భాషలు వేరైనా ప్రజలు–వారిని ప్రతిబింబించే కవిత్వ ఆకాంక్ష ఒక్కటేనని ఈ సంకలనం చూస్తే అర్థమవుతుంది.          – దేశరాజు
(రేపు సాయంత్రం హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌లో ‘అదే నేల’ పరిచయ సభ)

Advertisement
Advertisement