లంచం పునాదులపై కర్ణాటకం

19 Jul, 2019 01:13 IST|Sakshi

విశ్లేషణ 

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందన్న సుప్రీంకోర్టు తీర్పుతో తేలేదేమిటో కనబడడం లేదు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ముఖ్యమంత్రికి అవసరమయ్యే మెజారిటీ తగ్గుతుంది. 15 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగితే సమస్యను ప్రజలు తేల్చాల్సి వస్తుంది. సోమ్‌నాథ్‌ చటర్జీ లోక్‌సభ స్పీకర్‌ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన సీపీఎం పట్ల పక్షపాతం చూపలేదు. తనను ఎంచుకున్న సంకీర్ణ నేత అడుగులకు మడుగులొత్తలేదు. కొందరు ప్రశ్నలు వేయడానికి లంచాలు తీసుకున్నారని తెలియగానే ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించి సభనుంచి బహిష్కరించారు. లంచగొండి ఎంపీలు అన్యాయమని అరుస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనతో  సమాన సార్వభౌమాధికారం ఉన్న న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించి నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ పరిధిని అతిక్రమించడం, మరో వ్యవస్థ కార్యసరళిలో జోక్యం చేసుకోవడం అవుతుందని ప్రకటించి సోమ్‌నాథ్‌ గంభీరంగా తన ఉనికిని చాటుకున్నారు.  

కర్ణాటక స్పీకర్‌ 15 మంది కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలను వెంటనే ఎందుకు ఆమోదించలేదని సుప్రీంకోర్టు వారం కిందట అడిగింది. మహామహులైన న్యాయవేత్తలు, రాజీనామాచేసిన ప్రజాప్రతినిధుల పక్షాన సుప్రీంకోర్టులో నిలబడి గొప్పవాదనలు చేశారు. అత్యంత విలువైన సమయాన్ని ఈ లంచగొండి రాజీనామా రాజకీయానికి సుప్రీంకోర్టు వినియోగించి తన మేధస్సును రంగరించి, సహనంతో వాదనలు విని అటూ ఇటూ మొగ్గకుండా సమతుల్యమైన తీర్పు ఇవ్వడానికి విశ్వప్రయత్నం చేసింది. స్పీకర్, కర్ణాటక సీఎం తరఫున వాదించిన ప్రముఖ న్యాయాగ్రగణ్యులు కూడా రాజ్యాంగ సూత్రాలను అరటిపండు ఒలిచినట్టు వివరించారు.  

‘‘మఘవ (మహా ఘనత వహించిన) సర్వోన్నత న్యాయమూర్తులైన మీకు చేతులుజోడించి మనవిచేసేదేమంటే, మీకు ఇందులో జోక్యం చేసుకునే అధికారమే లేదు, సభాపతిని సబార్డినేటుగా భావించి అదిచేయ్‌ ఇది చెయ్‌ అని ఆదేశించే అధికారాన్ని మన సంవిధానం తమకు సమకూర్చలేదు మహా ప్రభో’’ అని వేడుకున్నారు. ‘‘ఏం ఎందుకు లేదు? రాజీనామాలు ఇస్తే ఆమోదించడానికి అన్ని రోజులెందుకు’’ అని కాస్త గట్టిగానే అడిగినట్టు కనిపించినా తుది తీర్పు ఇచ్చే సమయానికి రాజ్యాంగ విలువలకు అనుగుణంగా స్పీకర్‌ మహాశయుడికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు.  

కానీ దాని భావమేమి? శాసన సభా ప్రక్రియ ప్రకారం ఒక్కో రాజకీయ పార్టీకి ఒక విప్‌ ఉంటారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా సభ్యులకు విప్‌ జారీ చేస్తే తమ పార్టీ వారంతా రావాలని ఆదేశించాలి. అయినా రాకపోతే, వచ్చి వ్యతిరేక ఓటు వేస్తే వారి మీద సభలో ఉండకూడదని అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే మన ఫిరాయింపు వ్యతిరేక చట్టం పదో షెడ్యూలు అది ఫిరాయింపుతో సమానమని వివరిస్తున్నది.  

లక్షల రూపాయలు ఖర్చుచేసి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పెట్టుబడికి రెండింతలు మూడింతలు డబ్బు సంపాదించకుండా చేతులు కట్టుకునే నేతలు మనకు లేరు. అటువంటి ఎమ్మెల్యేలు ఊరికే రాజీనామా చేస్తారా? వారు ఎందుకు రాజీనామా చేస్తున్నారో అందరికీ తెలుసు. ఒక్కొక్కరికి పది కోట్ల నుంచి 25–30 కోట్ల దాకా ఇస్తామని ఫిరాయించడానికి తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్, జనతాదళ్‌ (ఎస్‌) నేతలు ఆరోపిస్తూ ఆడియో రికార్డులను విడుదల చేశారు. ఏడాది కిందట కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసతీర్మానంపై చర్చించడానికి ముందు లంచాలతో తమవైపు మళ్లించుకునే ప్రయత్నాలు సాగించారని కాంగ్రెస్‌ నాయకుడు బీసీ పటేల్‌ ఆరోపించారు. స్వయంగా తనతో ఫోన్‌లో బీజేపీ నేతలు లంచాలు ఇవ్వజూపే సంభాషణలను ఆయనే రికార్డుచేసి విడుదల చేసారు.

విచిత్రం ఏమంటే పాటిల్‌ ప్రస్తుతం బీజేపీ వారి ముంబై క్యాంప్‌లో చేరి వారి విలాసవంతమైన హోటళ్లలో గడుపుతూ, ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని పరిత్యజించి బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేసేసారు. ఇవి స్వచ్ఛంద రాజీనామాలని అనుకోవాలా? ఏడాదిన్నరలోగానే ఎమ్మెల్యే పదవిపై వీరికి విరక్తి వచ్చిందా, లేదా పెట్టుబడులన్నీ సంపాదించినట్టేనా? డబ్బు, పదవి ఎరజూపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాగుతున్న ఈ కుట్రల గురించి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తావించే వారే లేరా? పడగొట్టే సీఎం, పడిపోయే సీఎం, మధ్యలో నలిగిపోయే స్పీకర్, ఈ కర్ణాటక లంచపు పునాదుల గురించి అడిగే వాడే లేడా, ఓటర్‌కు ప్రశ్నించే అవకాశమే రాదా? కర్ణాటక వ్యవహారం ఓటరు ముందుకు 15 స్థానాలకు ఉపఎన్నికల రూపంలో వెళ్లబోతున్నది. జనం స్వేచ్ఛగా ఏపార్టీ పరిపాలించాలో తీర్పుచెప్పాలి.


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

>
మరిన్ని వార్తలు