విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం | Sakshi
Sakshi News home page

విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం

Published Thu, Apr 30 2020 12:32 AM

Sheikha Hend Faisal Al Qassemi Article My Dream Of India - Sakshi

ఒక భారీ కమలం ఆకారంలోని రంగస్థలం మధ్యలో నేను ఇజ్రేలీ సెనేటర్‌కు ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఆమె ‘టియర్స్‌ ఆఫ్‌ ఏ జ్యూయిష్‌ విమన్‌’ (యూదు మహిళ కన్నీళ్లు) పుస్తక రచయిత్రి. అంతకుముందు ఎన్నడూ నేను యూదు వ్యక్తిని కలిసి ఉండలేదు. అందులోనూ ఆమె యూదు మత సమర్థకురాలు, ఇజ్రేలీ పార్లమెంట్‌ సభ్యురాలు కూడా. తాను ఎదురుపడినప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ప్రశాంతంగా కూర్చున్నాను. మేమిరువురం క్లుప్లంగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే బెంగళూరు ఆశ్రమంలో యోగాను మేం ఇరువురం కొత్తగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ఆమె తనను మళ్లీ కలవమని చెప్పారు. నేను కూడా తనను మరోసారి కలవాలని ఆశించాను. బెంగళూరు ఆశ్రమంలో యోగాభ్యసనం ద్వారా ఆనందం పొందడం కోసం ప్రపంచమంతటినుంచి వచ్చి నిరాడంబరంగా కూర్చుని ఉన్న అనేకమంది వ్యక్తులను నేను కలిసి ఆనందించాను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆశ్రమంలో ఉన్నంతకాలం మేం శాకాహారులుగానే ఉన్నాం. నాకు మాంసాహారం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి అక్కడి అలవాటు నాకు ఏమంత ఇబ్బంది కలిగించలేదు. 

నా గురించి నేను ఎప్పుడు పరిచయం చేసుకున్నా జనం నన్ను చిరునవ్వుతో పలకరించేవారు. హింద్‌ అనే పేరు కలిగిన ఒక అరబ్‌ రాణిని కలుసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శించేవారు. వారు నా రాణిత్వం గురించి అడిగేవారు. నేను చిరునవ్వుతోనే జవాబిచ్చేదాన్ని. తెల్లవారుజామునే నిద్రలేచి, ఉదయం యోగా సెషన్స్‌ కోసం ఆశ్రమంలోని హాలుకు వెళ్లేవాళ్లం. అది నిజంగా ఒక తీర్థయాత్ర లాంటిది. మీరు ఎంత నిరాడంబరంగా జీవించవచ్చో తెలిపే ప్రయాణం అది. సాధారణమైన చెప్పులు, పలుచటి నూలుదుస్తులు ధరించేవారం. కానీ నేను మాత్రం కాటుక, బొట్టు, అరబ్‌ సెంటును కూడా వాడేదాన్ని. ఆ గ్రామంలో ప్రపంచమంతటి నుంచి వందలాది మంది వ్యక్తులు వచ్చి ఉండేవాళ్లు.
 
ఆధునిక ఊహాస్వర్గం

ఆ ఆశ్రమంలో నా అమెరికన్‌ స్నేహితుడు, నేను కలిసి ప్రజలు వారి గాథలకు సంబంధించిన ఆవిష్కరణల సంపదల గురించి తెలుసుకునేవారం. అక్కడ వివక్ష కలికానికి కూడా కనిపించేది కాదు. అది నిజంగానే ఆధునిక కాలపు ఊహాస్వర్గాన్ని గుర్తు తెచ్చేది. అనేకమంది రాయబారులు, వారి భార్యలతో కలిసి నేను ఆశ్రమ గురువును కలిసి ఆనందించేదాన్ని. మతం ఒక అనవసరమైన అంశమని వారంతా పదే పదే చెప్పేవారు. అది సామరస్యంగా జీవించే కళను తిరిగి ఆవిష్కరించిన ఒక సాధారణ ప్రపంచం. మీ జాతి, మతం, ప్రాంతానికి పూర్తి భిన్నమైన వ్యక్తుల సమూహంతో జీవించగలగడం నిజంగా ఒక పర్వదినం లాంటిదే. నా కొత్త గ్లాస్‌ చెప్పులు ధరించి అక్కడున్న బ్యాలేకి వెళ్లేదాన్ని. ఒక విముక్తిని పొందిన భావనతో.. ఎలాంటి వివక్ష, విద్వేషం లేకుండా నిరాడంబరంగా జీవించే అనుభవం కోసం కనీసం ఒక్కరోజయినా ప్రతి ఒక్కరూ ఆ అశ్రమంలో గడపాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీకు వినయం అనే గ్రంథి ఇచ్చే ప్రతి దాన్నీ విద్వేషం ఓడిస్తుంది.

నేను అక్కడి వాతావరణానికి దాసోహమైపోయానని అంగీకరిస్తున్నా. ప్రేమించడం అనే మత్తులో గడిపాను. మీ హృదయం తెరుచుకున్నప్పుడు అక్కడ విద్వేషానికి మరి చోటు ఉండదు. దేనిపైనయినా ఆగ్రహం కలగవచ్చు కానీ దాన్ని మీ పడకగది వరకూ తీసుకు పోవద్దు. విషయాలను తేలిగ్గా చూసే కళే నిజంగా జీవించడానికి అనువైన కళ. అయితే పోరాడేందుకు అవసరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ, స్వభావసిద్ధంగానే ఒక పారిశ్రామిక, ఉత్పాదక వ్యక్తినైన నేను పరిష్కారాల కోసమే చూస్తాను తప్ప సమస్యలను సాగదీస్తూ కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ద్వేషిస్తాను. నేను సమాధానాలు కనుగొనడాన్ని ఇష్టపడతాను. ఆగ్రహం, పాతుకుపోయిన దురభిప్రాయాలు అనేవి మునిగిపోతున్న నావ చుక్కాని లాంటివి. ఎమిరేట్స్‌ ప్రజలకు, భారతీయులకు మధ్య విచ్ఛిన్నం చేయడానికి వీలుకాని బంధం ఏర్పడి ఉంది. ఇది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. మా చుట్టూ, మా ఇళ్లలో అరబ్బుల కంటే భారతీయ పిల్లలే ఎక్కువగా ఉంటూవచ్చిన వాతావరణంలో మేం పెరుగుతూ వచ్చాం. కాబట్టి మా డీఎన్‌ఏలో ఒక తిరస్కరించడానికి వీలులేని అనుబంధం, ఆపేక్ష ఉంటూ వస్తోంది. మా రోజువారీ భాష కూడా మా సొంత ఆచారాల నుంచి పుట్టుకొచ్చిన పదాల నుంచే అరువు తెచ్చుకునేది.

నేను ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్వావలంబన’ అనే అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నాను. దేశాలు తమ శక్తి ఎక్కడుందో గ్రహించి, దానికోసమే ప్రయత్నించి, తమ బలహీనతలను సర్దుబాటు చేసుకోవడం, తమముందున్న అవకాశాలను గుర్తించడం, తమకు ఎదురవుతున్న ప్రమాదాలను తటస్థం చేయడం గురించిన పరిశోధన అది. భారత్‌ కూడా ఇలాంటి దేశాల్లో ఒకటి. ఒక పేద వ్యవసాయ దేశం నుంచి నేడు సూపర్‌ పవర్‌గా ఎదిగిన దేశమది. సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్‌ కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ప్రేమించే నా స్వదేశం యూఏఈ కూడా ముత్యాలు ఏరుకునే కొన్ని గ్రామాల సమూహంగా ఉండి, కొత్తగా కనుగొన్న చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా మారి ఒక సంతోషకరమైన, సంవద్వంతమైన జాతిగా ఆవిర్భవించింది.

మా దేశంలో 33 లక్షలమంది భారతీయులు ఆతిథ్యం పొందుతూ తమ కుటుంబాలకు ఏటా 17 బిలియన్‌ డాలర్లను పంపుతున్నారు. నేను పైన పేర్కొన్న దేశాలు ఏవీ మార్గదర్శకత్వం లేకుండా ఎదిగినవి కావు. వీటిలో ప్రతి దేశం కూడా అభివృద్ధి విత్తనాలను నాటిన ఒక విజ్ఞత కలిగిన నాయకుడిని కలిగి ఉండేది. అలాంటి  విజ్ఞత వల్లే రెండు తరాల తర్వాత మా శ్రమ ఫలితాన్ని ఈరోజు మేం అందుకుంటున్నాం. మతపరమైన సామరస్యపు ఔన్నత్యమే ఈ దేశాల్లో అపారమైన అభివృద్ధికి తావిచ్చిందని కొంతమంది చెబుతుంటారు కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక పెట్టుబడి, భద్రత, అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యతత్వం అనేవి ఈరోజు ఏ దేశానికైనా విజయాన్ని సాధించే వ్యూహంలో అంతర్భాగాలుగా ఉంటాయి. 

గాంధీ మ్యూజియాన్ని సందర్శించి ఆనాడు యుద్ధాన్ని నిలిపివేయాలని హిట్లర్‌ను కోరుతూ గాంధీ రాసిన ఉత్తరాన్ని చదివి నేను ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని కొనుక్కున్నాను. భారత్‌కు కావలసింది విద్య, టాయ్‌లెట్లు (ఇవి మహిళ ఆరోగ్యానికి, భద్రతకు తొలి మెట్టు) అని ఆయన నొక్కి చెప్పారు. పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కాకుండా భారతీయ నూలు వస్త్రాలను మాత్రమే వాడాలని చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులు వాణిజ్యంలో పోటీకి అవకాశమిచ్చి ఆర్థిక వ్యవస్థను పెంచిపోషించేవి. ఆయన దూరదృష్టికి నిజంగా జోహార్లు చెప్పాలి. రోమ్‌ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు.

గాంధీ కార్యాచరణను ఒక తరం తర్వాతే చూడగలిగేవాళ్లం. శాంతి సాధన విషయంలో గాంధీ ప్రాపంచిక దృక్పథాన్నే నెల్సన్‌ మండేలా అనుసరించారన్న విషయం మర్చిపోవద్దు. గాంధీ భారత విముక్తి ప్రదాత అనే విషయాన్ని ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించలేరు. భారతదేశం గురించి ఇంత అనురక్తితో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. అది పాలు, తేనె కలగలిసిన దేశం. నా సంస్కృతిలో ఒక సామెత ఉంది. మీరు భారతదేశ పాలు తాగినట్లయితే ఆ దేశమే మీ మాతృమూర్తి అవుతుందని మా వాడుకలో ఉంది.

నాజీయిజం మారణకాండకు కారణమైన విద్వేష ప్రచారం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శక్తిమంతులైన కోటీశ్వరులు గ్రహించడం లేదా? విద్వేష ప్రచారాన్ని విషంలాగా పెంచి పోషించారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. భారత్‌లో 18 కోట్లమంది ముస్లింలు ఉంటున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ నేత రాజేశ్వర్‌ సింగ్‌ ‘ముస్లింలను, క్రిస్టియన్లను 2021 డిసెంబర్‌ 31 నాటికి భారతదేశం నుంచి తుడిచిపెట్టేస్తాం’ అంటున్న మాటలు విద్వేష ప్రచారానికి అసలుసిసలు నమూనాలు.

నేటి ప్రపంచానికి కొత్తగా మరొక హిట్లర్‌ అవసరం లేదు. కానీ దానికి మార్టిన్‌ లూథర్, నెల్సన్‌ మండేలా, గాంధీ వంటి మరొక «ధీరోదాత్త నాయకులు కావాలి. మీ సోదరుడిని చంపడం మిమ్మల్ని హీరోను చేయదు. విద్వేషం స్వాగతించాల్సిన అంశం కాదు కాబట్టి దానికి పుల్‌స్టాప్‌ పడాలి. యూఏఈలో విద్వేష ప్రచారం చట్టవ్యతిరేకం. ఇలాంటి చట్టాలు ఉన్నాయంటే ప్రజలు జోక్‌గా భావించవచ్చు కానీ ఇదే దేశంలో శాంతిని నెలకొల్పుతున్నాయి. మీరు నిర్మించిన దేశాన్ని మీరే ఎందుకు తగులబెట్టుకుంటారు? మా దేశంలో అమలవుతున్న ఈ చట్టం అభివృద్ధిని కాంక్షించే ప్రతి దేశ నాయకుడు పాటించాల్సిన తారకమంత్రం లాంటిది.

కానీ భారతదేశంతో ఎంతగానో సాన్నిహిత్యం ఉంటున్న మాలాం టివారికి నేటి భారత్‌లో ద్వేషం, ఇస్లామోఫోబియా, రోజువారీ రక్తపాతం జరుగుతుండటం షాక్‌ కలిగిస్తోంది. పైగా దేశాన్ని ‘ఖురానో– వైరస్‌’ అనే సాంక్రమిక వ్యాధి చుట్టుముడుతున్నట్లుంది. ఒకనాడు నేను గడిపిన ఆ గొప్ప కమలాకారంలోని భవంతి నుంచి నేను పొందిన శాంతి సారాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నాను. వసుధైక కుటుంబం.. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావన భారతీయ సమాజంలో అత్యున్నతమైన నైతిక విలువలలో ఒకటి. ఈ ఉపనిషత్‌ శ్లోకాన్ని భారత పార్లమెంటు హాల్‌లో చెక్కారు కూడా. గాంధీ దాన్ని అనుసరించారు. ప్రధాని నరేంద్రమోదీ దాన్ని ఉల్లేఖించారు. భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి కరోనా మహమ్మారి మృత్యు ఛాయలను విస్తరించకుండా, ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన ఈ తరుణంలో భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను.

షెఖా హింద్‌ అల్‌ ఖసేమి
(గల్ఫ్‌ న్యూస్‌ సౌజన్యంతో)
వ్యాసకర్త ఎమిరేట్స్‌ యువరాణి,
రచయిత్రి, ఎడిటర్, వెల్వెట్‌ మేగజైన్

Advertisement
Advertisement