ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు

Published Sat, Aug 1 2015 3:16 AM

ఈ ఏడాది 2 లక్షల ఇళ్లు - Sakshi

ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయం
* ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి అబ్దుల్ కలాం పేరు
* రిషితేశ్వరి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 500 గజాల స్థలం

సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఈ సంవత్సరం రూ. 5,500 కోట్లతో రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కాలనీల్లో 1.50 లక్షల కొత్త ఇళ్లతో పాటు స్థలం ఉండి నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో 50 వేల ఇళ్లకు అనుమతివ్వాలని తీర్మానించింది.

ఒక్కో ఇంటిని 279 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 2.75 లక్షలతో నిర్మించాలని నిర్ణయించింది. దీనిలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 1.75 లక్షల సబ్సిడీ, లక్ష బ్యాంకు రుణం, ఇతరులకు 1.25 లక్షల సబ్సిడీ, 1.50 లక్షల బ్యాంకు రుణం ఇప్పించాలని నిర్ణయించింది. శుక్రవారం ఇక్కడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ మంత్రివర్గం భేటీ అయింది. ఆ వివరాలను మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడులతో కలసి సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు. ఆ వివరాలు...

* గతంలో రాజీవ్ స్వగృహ కింద 2,898 ఇళ్లు కట్టాలని నిర్ణయించగా 882 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను పూర్తి చేసే బాధ్యత స్విస్ చాలెంజ్ లేదా బహిరంగ టెండర్ల విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు.
* కేంద్ర గృహ నిర్మాణ విధానం ఖరారైన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగులు, పేదల ఇళ్ల నిర్మాణంపై నిర్ణయం.
* మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం నాగార్జున యూనివర్సిటీలో కాంస్య విగ్రహం ఏర్పాటు. రాష్ట్రంలో ఇచ్చే ప్రతిభ అవార్డులను కలాం పేరుతో ఇవ్వడానికి నిర్ణయం. కొత్తగా ఒంగోలులో ఏర్పాటుచేసే ట్రిపుల్ ఐటీకి కలాం పేరు.
* నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి సంతాపం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా పకడ్బందీ చర్యలు. ఆమె కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, రాజమండ్రిలో 500 చదరపు గజాల స్థలం.
* నివర్సిటీలను ప్రక్షాళన చేసి అన్ని స్థాయిల్లో ర్యాగింగ్ నిరోధించడానికి చర్యలు.  
* 75 శాతం హాజరు లేని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు నిలిపివేత. వారు పరీక్షలు రాసేందుకు అనుమతి నిరాకరించేలా చర్యలు. యూనివర్సిటీల్లో రెండో కోర్సు చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిరాకరణ. వర్సిటీల్లో ల్యాండ్ బ్యాంక్ పరిరక్షణకు చర్యలు. అన్ని యూనివర్సిటీలకు సమర్థులైన వీసీలు. నాగార్జున వర్సిటీకి ప్రొఫెసర్ సింహాద్రి పేరు పరిశీలన.
* హంద్రీ-నీవా, గాలేరు-నగరి, గుండ్లకమ్మ, పట్టిసీమ, పోలవరం కుడికాలువ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత.
* అనంతపురం జిల్లాల్లో ఉపాధి హామీ పథకం పని దినాలు 100 నుంచి 150కి పొడిగింపు. ఉల్లిపాయల ధర కేజీ రూ. 20కి మించకుండా చర్యలు.   
* అన్ని శాఖల్లో ఐటీని ఉపయోగించుకునేందుకు లక్ష ట్యాబ్‌ల కొనుగోలుకు నిర్ణయం. ఇప్పటికే 75,148 ట్యాబ్‌ల కొనుగోలు.
* వచ్చే నెల పదో తేదీ నుంచి మీ భూమి, మీ ఇల్లు కార్యక్రమం ప్రారంభం.
* మూడో విడత రుణమాఫీకి వచ్చిన 5.15 లక్షల ఫిర్యాదులు ఆగస్టు 15లోపు పరిష్కరించాలని, దానికోసం రూ. 835 కోట్లు విడుదలకు నిర్ణయం.

Advertisement
Advertisement