సండే కూడా మండేశాడు.. | Sakshi
Sakshi News home page

సండే కూడా మండేశాడు..

Published Mon, Apr 25 2016 5:14 AM

సండే కూడా మండేశాడు..

వడదెబ్బకు 48 మంది  మృత్యువాత.. హైదరాబాద్‌లో నవ వరుడు కూడా..
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ ఉధృతమవుతూనే ఉంది. మే నెల రాకముందే ఆస్థాయి ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపిన ప్రకారం.. రాష్ట్రంలో ఐదు చోట్ల 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల, కోదాడ మండలం తొగర్రి, మెట్‌పల్లి మండలం పెద్దవేడ, ఖమ్మం జిల్లా వైరా, వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం కోమలవంచల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అలాగే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడులో 46.11, ముదిగొండ మండలం పమ్మిలో 46.58, బాణాపురంలో 46.96, బూర్గుంపాడులో 46.83, వేంసూరులో 46.15, నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం చీదెళ్లలో 46.48, మేళ్లచెరువు మండలం దొండపాడులో 46.21, పెద్దవూర మండలం పులిచెర్లలో 46.67 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నల్లగొండలో 45.2, రామగుండం, ఖమ్మంలలో 45 చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 44.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తీవ్రంగా వీస్తున్న వడగాడ్పులు, రాత్రి 10 గంటలైనా కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.


 48 మంది మృతి..
 వివిధ జిల్లాల్లో వడదెబ్బతో 48 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో 14 మంది, నల్లగొండ జిల్లాలో 12 మంది, వరంగల్ జిల్లాలో 11 మంది, ఖమ్మం జిల్లాలో నలుగురు, మెదక్ జిల్లాలో ముగ్గురు, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున వడదెబ్బకు బలయ్యారు. హైదరాబాద్‌లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో చంపాపేటకు చెందిన కాచీపురం రాఘవేంద్ర(34) అనే నవ వరుడు కూడా ఉన్నాడు.
 
 వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలే: నారాయణ
వడదెబ్బ చావులన్నీ ప్రభుత్వ హత్యలేనని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ఆరోపించారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రజలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద వడదెబ్బ నివారణకుగాను హోమియోపతి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement