అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారు | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

Published Sat, May 13 2017 12:53 AM

అమిత్‌ షా పర్యటన షెడ్యూల్‌ ఖరారు - Sakshi

- గతంలో నక్సల్స్‌ చేతిలో హతమైన మైసయ్యకు నివాళి
- రజాకార్లు దాడిచేసిన గుండ్రాంపల్లి సందర్శన


సాక్షి, హైదరాబాద్‌: ‘నక్సల్స్‌ చేతిలో హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మైసయ్యగౌడ్‌ గ్రామంలో నివాళి, అక్కడే బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశం.. ఒక బస్తీకి పార్టీ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పేరు పెట్టడం.. రజాకార్ల హింసాకాండలో 150 మంది గ్రామీణులు మరణించిన గుండ్రాంపల్లి సందర్శన’  ఇవీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22–24 తేదీల మధ్య నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలు. ఆయన పోలింగ్‌బూత్‌ కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నా రు. కేంద్ర పథకాలు క్షేత్రస్థాయికి చేరాయా లేదా అని తెలుసుకోవడంతోపాటు నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.

నేరుగా నల్లగొండ జిల్లాకు...
ఈ నెల 22న శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా నల్లగొండ జిల్లాకు అమిత్‌షా పయనమవుతారు. అక్కడ చండూరు మండలం తేరట్‌పల్లికి చేరుకుంటారు. బీజేపీ రాష్ట్రకార్యదర్శిగా పనిచేసిన మైసయ్యగౌడ్‌ను గతంలో నక్సల్స్‌ హతమార్చిన ప్రదేశంలో నివాళులర్పిస్తారు. అదే గ్రామంలో బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. మధ్యాహ్నం దళితబస్తీలో భోజనం చేస్తారు. అక్కడి నుంచి నల్లగొండకు చేరుకుని రాష్ట్రపదాధికారులు, జిల్లా కోర్‌ కమిటీ, వివిధవర్గాల ప్రముఖులు, మేధావులతో విడివిడిగా సమావేశమవుతారు. 23న ఉదయమే నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఎలుగుపల్లిలో పోలింగ్‌బూత్‌ సమావేశాన్ని నిర్వహిస్తారు. పక్కనే ఉన్న దళిత బస్తీకి దీన్‌దయాళ్‌ నగర్‌గా నామకరణం చేస్తారు.

24న ఉదయమే చిట్యాల మండలం గుం డ్రాంపల్లిని సందర్శించి రజాకారుల దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పిస్తారు. ఈ గ్రామంలో రజాకార్‌ సైన్యం 150 మంది గ్రామస్తులను చంపి బావిలో వేసిన ఘటన.. మరో జలియన్‌వాలా బాగ్‌ ఘటన మాదిరిగా చరిత్రపుటల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని కార్యకర్తల సదస్సులో పాల్గొంటారు. 25న విజయవాడలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యకర్తల సదస్సులో పాల్గొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

Advertisement
Advertisement