అంకెలు భళా... నిధులు కల! | Sakshi
Sakshi News home page

అంకెలు భళా... నిధులు కల!

Published Fri, Feb 19 2016 11:48 PM

అంకెలు భళా...  నిధులు కల!

ఏటా పెరుగుతున్న అంచనాలు
సరిగా అందని నిధులు ఇదీ జీహెచ్‌ఎంసీ బడ్జెట్ తీరు

 
అంకెలు... అవసరాలు.. ఆకాశంలో... నిధులు పాతాళం లో... ఇదీ జీహెచ్‌ఎంసీ బడ్జెట్ స్వరూపం. అందుకే లక్ష్యాలను అందుకోవడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఏటా భారీ బడ్జెట్ రూపకల్పనతో ముందుకెళుతున్న జీహెచ్‌ఎంసీ... నిధుల సాధనలో ఆమడ దూరంలో ఆగిపోతోంది. ఫలితంగా ప్రగతి రథం పరుగు పెట్టలేక పోతోంది.
 
సిటీబ్యూరో: భారీ అంచనాలు... అంతే స్థాయిలో కనిపించే అంకెలు. వీటిని చూసిన వారిలో ఎన్నో ఆశలు...ఏడాది చివరిలో చూస్తే మొత్తం తారుమారు...ఇదీ జీహెచ్‌ఎంసీ బడ్జెట్ తీరు. ఏటా రూ.వేల కోట్లతో భారీ ఎత్తున బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ... ఆశించిన మేరకు నిధులు అందడం లేదు. జీహెచ్‌ఎంసీ ఆదాయ వనరులతో పాటు రాష్ట్రం ఇచ్చే నిధులు, కేంద్ర గ్రాంట్లను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కూడా ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదు.దీంతో సగం బడ్జెట్ మాత్రమే అమలవుతోంది. బడ్జెట్ జమా ఖర్చుల లెక్క మాత్రమే కాదని... అభివృద్ధికి దిక్సూచిలా ఉండాలని  సీఎం కేసీఆర్ సూచించిన నేపథ్యంలో.. ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలో దాదాపు రూ. 2,500 కోట్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ను మూడేళ్లుగా ఏటికేడు పెంచుతూ పోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికీ రూ.5,550 కోట్లతో రూపొందించినప్పటికీ... అందులో సగం మాత్రమే అమలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016-17) మరో రూ.50 కోట్లు పెంచి రూ.5,600 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ... ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి అసలు రంగు బయట పడుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరాన్నే పరిగణనలోకి తీసుకుంటే... కేంద్రం నుంచి రాగలవనుకున్న దాదాపు రూ. 800 కోట్లలో ఇప్పటి వరకు రూ.300 కోట్లు మాత్రమే వచ్చాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి వృత్తి పన్ను వాటాగా రూ.100 కోట్లు రావాల్సి ఉండగా.. ఇంతవరకూ జాడే లేదు. హెచ్‌ఎంఆర్ కింద రావాల్సిన రూ.250 కోట్లలో రూ.100 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇలా అంచనాలకు... వాస్తవానికి వ్యత్యాసం ఉండటంతో బడ్జెట్ పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అందాల్సిన నిధుల్లో ముఖ్యమైన కొన్ని అంశాలను  పరిగణనలోకి తీసుకుంటే..రెవెన్యూ రాబడి, క్యాపిటర్ రాబడి, రెవెన్యూ గ్రాంట్లకు సంబంధించి ముఖ్యమైన అంశాల్లో మొత్తం రూ.4141 కోట్లు అందగలవని భావించి బడ్జెట్‌ను రూపొందించగా... ఇప్పటి వరకు అందిన నిధులు రూ.1178 కోట్లు మాత్రమే.

 అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటే రూ.3,200 కోట్లకుగాను ఇప్పటి వరకు వచ్చింది దాదాపు రూ.1600 కోట్లు. రానున్న దాదాపు 40 రోజుల్లో ఆస్తిపన్ను ద్వారా మరో రూ.400 కోట్లు, ఇతరత్రా మరో రూ.600 కోట్లు వచ్చినా... మొత్తం రూ.2,600 కోట్లు అవుతుంది. అంటే.. రూ.5,550 కోట్ల బడ్జెట్‌లో దాదాపు సగమే.రాబోయే బడ్జెట్‌ను వాస్తవిక దృష్టితో, స్థానిక అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ చట్టం మేరకు జనవరిలోనే ప్రభుత్వానికి బడ్జెట్‌ను అందజేయాల్సి ఉన్నందున పంపించారు. మూస పద్ధతిలోనే రూ.5600 కోట్లతో రూపొందిం చారు. వీలుంటే పునః పరిశీలించి వాస్తవంగా రూపొందిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుదరని పక్షంలో అక్టోబర్‌లో బడ్జెట్‌ను రివైజ్ చేసే తరుణంలోనైనా వాస్తవాలకు దగ్గరగా రూపొందిస్తే.. సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని నగర ప్రజలు భావిస్తున్నారు.

Advertisement
Advertisement