మిర్చి ‘రైతుల మంట’ సర్కార్‌ వైఫల్యమే | Sakshi
Sakshi News home page

మిర్చి ‘రైతుల మంట’ సర్కార్‌ వైఫల్యమే

Published Thu, May 4 2017 1:36 AM

మిర్చి ‘రైతుల మంట’ సర్కార్‌ వైఫల్యమే

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ

సాక్షి, హైదరాబాద్‌: మిర్చి దిగుబడిపై సరిగ్గా అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో, పంట దిగుబడుల సేకరణ విషయంలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల వైఫల్యాలను కేంద్రంపై మోపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం బీజేపీ పార్టీనాయకులు చింతాసాంబమూర్తి, డా. ఎస్‌.మల్లారెడ్డి, డా. ప్రకాశ్‌రెడ్డి, గోలి మధుసూదనరెడ్డి, ప్రేం సాగర్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మిర్చి కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్నారు.

8, 9 నెలల్లో చేతికివచ్చే ఈ పంట గురించి ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, వ్యవసాయశాఖ అధికారులు సమీక్షించి ఉత్పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయాలన్న ఆలోచన చేయకపోవడం పెద్ద తప్పిదమన్నారు. మిర్చి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్లే రైతులు వ్యాపారుల చేతుల్లో నలిగి పోయారన్నారు. ఇంత జరిగినా బాధ్యులైన అధికారులపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముందుగానే పత్తిని గొడౌన్లలో పెట్టడంతో, మిర్చికి గొడౌన్లు అందుబాటులో లేకుండా పోయాయన్నారు.

Advertisement
Advertisement