11.25 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి | Sakshi
Sakshi News home page

11.25 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి

Published Sat, Sep 2 2017 2:28 AM

11.25 లక్షల మంది రైతులకు మొండిచెయ్యి

ఖరీఫ్‌ ముగుస్తున్నా రుణాలివ్వని బ్యాంకులు
     81 శాతం పంటలు సాగైతే... 51 శాతానికే రుణాలు
     రూ. 23,851 కోట్లకు ఇచ్చింది రూ. 12,318 కోట్లే


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు బ్యాంకులతో తిప్పలు తప్పడం లేదు. ఖరీఫ్‌ పంటల సాగు ముగింపు దశకు చేరుకున్నా కూడా పంట రుణాలు అందడం లేదు. ఇప్ప టివరకు ఖరీఫ్‌ సాగు 81 శాతం పూర్తయినా.. రుణాల మంజూరు మాత్రం లక్ష్యంలో సగానికే పరిమితం కావడం గమనార్హం. 2017–18 ఖరీఫ్‌ సీజన్‌ పంట రుణాల లక్ష్యం రూ. 23,851 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ.12,318 కోట్లే. బ్యాం కులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో 29.63 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. కానీ బ్యాంకులు 18.38 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇచ్చాయి. మరో 11.25 లక్షల మంది రైతులకు రుణాలు అందలేదు.

సర్కారు నిర్లక్ష్యం కూడా..
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 93.47 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అందులో సగం ఒక్క పత్తి సాగే కావడం గమనార్హం. ఈ సారి ఏకంగా 46.52 లక్షల ఎకరాల్లో (సాధారణంతో పోలిస్తే 111 శాతం) పత్తిని సాగు చేశారు. దీంతో పెద్ద ఎత్తున రైతులకు రుణాలు కావాల్సిన అవసరమేర్పడింది. పత్తి వాణిజ్య పంట కావడం, కాయతొలుచు పురుగు ఆశించడంతో పురుగు మందులు, ఎరువులు, ఇతర వ్యయాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

అయితే బ్యాంకర్లు మాత్రం రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వ తీరు కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. రుణాలు ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని.. కానీ ప్రభుత్వం ఇవ్వాల్సిన పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల బకాయిల సొమ్ము రూ.271 కోట్లు ఇంకా చెల్లించలేదని అంటున్నారు. మరోవైపు కొత్త రుణాల సంగతి పక్కన పెడితే.. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి వడ్డీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల కొత్త రుణం ఇస్తూనే.. ఆ రుణం సొమ్ము నుంచి వడ్డీని కత్తిరిస్తున్నాయి. మొత్తంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల మొండిపట్టు రైతుల పాలిట శాపంగా మారాయి.

సహకార బ్యాంకులు నయం
తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌) ఆధ్వర్యంలోని సహకార బ్యాంకుల ఖరీఫ్‌ రుణ లక్ష్యం రూ.2,900 కోట్లుకాగా.. ఇప్పటివరకు రూ.2,100 కోట్లు మంజూరు చేశాయి. వాణిజ్య, ప్రైవేటు బ్యాంకులు మాత్రం పక్కా వ్యాపార దృష్టితోనే వ్యవహరి స్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. రైతులు ప్రధానంగా ప్రైవేటు, వాణిజ్య బ్యాంకుల మీదే ఆధారపడతారు. వాటి శాఖలు విరివిగా ఉండటంతో అటువైపే మొగ్గుచూపుతారు.

Advertisement
Advertisement