కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం! | Sakshi
Sakshi News home page

కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం!

Published Mon, Feb 22 2016 4:08 AM

కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం!

♦ పన్ను చెల్లింపులో ఆటోమొబైల్ డీలర్ల చేతివాటం
♦ కొనుగోలుదారుల నుంచి 14.5% పన్ను వసూళ్లు
♦ చెల్లింపుల్లో మాత్రం తప్పుడు లెక్కలు
♦ 300 డీలర్ల ఎగవేత సొమ్మే రూ. 25 కోట్లు
♦ ఏటా సుమారు రూ. 100 కోట్ల ఎగవేత
♦ 900 మంది డీలర్ల మూడేళ్ల లెక్కల సేకరణలో అధికారులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆటోమొబైల్ డీలర్లు సర్కారుకు పన్ను చెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పేరున్న టూ వీలర్, త్రీ, ఫోర్ వీలర్ కంపెనీల డీలర్లతోపాటు జిల్లాల్లోని ట్రాక్టర్, ట్రక్ డీలర్లు కొనుగోలుదారుల నుంచి వ్యాట్ పేరుతో భారీగా పన్ను వసూళ్లు చేస్తున్నప్పటికీ దానిని ప్రభుత్వానికి చెల్లించే సమయంలో మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల దృష్టిసారించిన వాణిజ్యపన్నులశాఖ కళ్లు చెదిరే వాస్తవాలు తెలుసుకుంది. నెలకు రూ. 1,000 కోట్ల వరకు వ్యాపారం చేసే ఆటోమొబైల్ డీలర్లు ఏటా కనీసం రూ. 100 కోట్ల వరకు వాణిజ్యపన్నులశాఖకు ఎగనామం పెడుతున్నట్లు తేలింది.

 ఆర్టీవో ఆఫీసుల నుంచి వివరాల సేకరణ..
 రాష్ట్రంలో విక్రయించిన ప్రతి వాహనం రవాణాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ మేరకు గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను వాణిజ్యపన్నులశాఖ అధికారులు సేకరించారు. తద్వారా ఏయే డీలర్లు ఎన్ని కోట్ల విలువైన వాహనాలను విక్రయించి ఎంత పన్ను చెల్లించారనే విషయాలను విశ్లేషించారు. వాహనాల బేసిక్ ధర, యాక్సెసరీస్‌తోపాటు వ్యాట్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్న డీలర్లు పూర్తిస్థాయిలో పన్ను చెల్లించడం లేదని తేల్చారు. పది వాహనాలు విక్రయిస్తే వాటిలో కొన్నింటి వ్యాట్‌ను చెల్లించడం లేదని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్లు ఆయా జిల్లాల్లో మూడేళ్లలో జరిగిన ఆటోమొబైల్ విక్రయాలు, చెల్లించిన పన్ను వివరాలను కమిషనర్ అనిల్ కుమార్‌కు శనివారం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 900 మంది డీలర్లు ఉండగా వారిలో కేవలం 300 మందికి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తేనే ఒక సంవత్సరంలో రూ. 25 కోట్ల వరకు పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం. ఈ లెక్కన ఏటా సుమారు రూ. 100 కోట్ల వరకు ఆటోమొబైల్ వ్యాపారులు పన్ను చెల్లించడం లేదని అంచనా.

 ఈ నేపథ్యంలో మూడేళ్లలో 900 మంది డీలర్లు ఎంత మేర ఎగ్గొట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, వాణిజ్యపన్నులశాఖ చేపట్టిన చర్యల గురించి తెలిసిన కొందరు డీలర్లు బకాయిలను స్వచ్ఛందంగా చెల్లించేం దుకు ముందుకు వచ్చినట్లు తెలియవచ్చింది. ఎగవేతదారుల నుంచి పన్నుతోపాటు కనీసం 25 శాతం అపరాధ రుసుము వసూలు చేయనున్నట్లు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement
Advertisement