వైఎస్సార్‌సీపీ కమిటీలు రద్దు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కమిటీలు రద్దు

Published Fri, May 6 2016 3:46 AM

cancelled ysrcp committees

* పార్టీ తెలంగాణ ముఖ్యనేతల విస్తృత సమావేశం తీర్మానం
* నూతన అధ్యక్షుడు, కొత్త కమిటీల నిర్ణయాధికారం వైఎస్ జగన్‌కు
* పొంగులేటి, ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాకు నేతల డిమాండ్
* వారిపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లకు లేఖలు రాయాలని తీర్మానం
* కరువు సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం: కొండా రాఘవరెడ్డి

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీ-ఫాంపై గెలుపొందిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తమ స్థానాలకు వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ముఖ్యనేతల విస్తృత సమావేశం డిమాండ్ చేసింది.

తమ పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వీరిపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ లోక్‌సభ, అసెంబ్లీ స్పీకర్లకు లేఖలు సమర్పించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలన్నింటినీ రద్దు చేస్తూ నూతన అధ్యక్షుడు, కమిటీలను నియమించే అధికారాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అప్పగిస్తూ మరో తీర్మానానికి ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.

సమావేశంలో పలువురు జిల్లా నేతలు మాట్లాడుతూ ఎంపీగా, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఆయన టీఆర్‌ఎస్ కోవర్ట్‌గా వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్టీ ప్రయోజనాలను కాదని వ్యాపార ప్రయోజనాలు, సొంత లాభాన్ని చూసుకుని పార్టీని మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు,  పది జిల్లాల్లో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు.
 
కరువు సహాయ చర్యల్లో ఘోర వైఫల్యం...
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులుంటే సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు... చేతలకు పొంతన ఉండటంలేదన్నారు. పార్టీ విస్తృత సమావేశం వివరాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో తమ పార్టీ కోవర్టులతో ఇబ్బందులకు గురైందని రాఘవరెడ్డి పేర్కొన్నారు. 18 నెలలపాటు అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి పార్టీని నిర్వీర్యం చేశారని, పార్టీని అభివృద్ధి చేయకుండా బేరాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసి 2019 కల్లా నిర్ణయాత్మకశక్తిగా ఎదిగేలా చేస్తామన్నారు. తెలంగాణ పార్టీగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ దీక్షకు పూర్తి మద్దతిస్తున్నామని మరో ప్రశ్నకు జవాబిచ్చారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రూ.10 వేల కోట్లు కేటాయిస్తే 49 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు.
 
సమావేశంలో ఆమోదించిన మరికొన్ని తీర్మానాలు..
* మొత్తం రాష్ట్రాన్ని కరువుపీడిత ప్రాంతంగా ప్రకటించాలి.
* దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో చేపట్టిన 36 ప్రాజెక్టుల పూర్తికి వెంటనే రూ. 10 వేల కోట్లు కేటాయించి 49 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి.
* పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, కొందరు స్థానిక ప్రతినిధులు చేరినంత మాత్రాన టీఆర్‌ఎస్‌లో పార్టీ విలీనమంటూ ఉండదు. తెలంగాణ కమిటీ ఒక శాఖ మాత్రమే. పార్టీ అధ్యక్షుడితో చర్చించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి విలీనం చేస్తేనే కలిపినట్లు.
* సిట్టింగ్ ఎమ్యెల్యే ప్రమాదంలో లేదా అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు బరిలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేయరాదని వైఎస్సార్ సీఎంగా ఉండగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పాలేరులో రాంరెడ్డి సుచరితా రెడ్డికి మద్దతును పునరుద్ఘాటిస్తున్నాం.

Advertisement
Advertisement