చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం

Published Tue, Feb 23 2016 2:33 PM

చంద్రబాబుది రాజకీయ వ్యభిచారం - Sakshi

చంద్రబాబు చేస్తున్నది ఒక రకంగా రాజకీయ వ్యభిచారమేనని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, దాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్లు ఇలాంటి నీచానికి దిగజారుతున్నారని మండిపడ్డారు.ఇలాంటి జిమ్మిక్కులు చేసి ఒకరిద్దరిని ప్రలోభపెట్టి పార్టీని బలహీనపరచాలన్న దురాలోచన చేస్తున్నారన్నారు. ఎంతగా నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అంతగా నీ పార్టీ కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. చంద్రబాబు పాలన మీద, ఆయన మీద ఎవరికీ నమ్మకం లేదని.. ఆ విషయం అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో టీడీపీ కొట్టుకుపోయిందని, ఈ విషయం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేటతెల్లం అయ్యిందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ఓటర్లందరూ టీఆర్ఎస్‌కే పట్టంగట్టారని, జీహెచ్‌ఎంసీలో చంద్రబాబుకు వచ్చిన బలం.. ఏకో నారాయణ అని ఎద్దేవా చేశారు. ఆరోజు ఆయన గగ్గోలు పెట్టారని, కేసీఆర్ ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా తమ మనుషులను తీసుకుంటోందన్నారని గుర్తు చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలను నీతిమాలిన రాజకీయంతో ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

ఇక తమ పార్టీ నుంచి వెళ్లిన పెద్ద మనుషులు అక్కడ ఏం చూసి వెళ్లారని అడిగారు. పాలన సక్రమంగా ఉందని వెళ్లారా, ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారని వెళ్లారా అని ప్రశ్నించారు. రైతు రుణాల పరిస్థితి ఏంటో, రైతులు చంద్రబాబు పాలనను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎవరినీ సంతృప్తి పరచలేని అసమర్థ పాలనపై ఏ నమ్మకంతో వెళ్లారని అడిగారు. కేవలం దొంగ కేసులు, అవినీతి సూట్‌కేసులు.. ఈ రెండు ప్రలోభాలకే లొంగి వెళ్లినట్లు కనిపిస్తోందని జ్యోతుల నెహ్రూ అన్నారు. ప్రజలు నూటికి నూరుశాతం జగన్ మోహన్ రెడ్డిని, పార్టీని నమ్ముతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేద్దామా అని చూస్తున్నారని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement