ప్రజాభిప్రాయమే ఫైనల్ | Sakshi
Sakshi News home page

ప్రజాభిప్రాయమే ఫైనల్

Published Sat, Sep 10 2016 6:17 AM

ప్రజాభిప్రాయమే ఫైనల్ - Sakshi

కొత్త జిల్లాలపై ప్రభుత్వానికి శషబిషలేమీ లేవు: సీఎం కేసీఆర్

 సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో ప్రజలకు అసౌకర్యంగా ఉండే ప్రతిపాదనలను మార్చుకోవడానికి  ప్రభుత్వానికి ఎలాంటి శషబిషలు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ప్రజా ప్రతినిధులు రాజకీయ కారణాలతో కాకుండా ప్రజల కోణంలో ఆలోచించాలని సూచించా రు. గద్వాల జిల్లా ప్రసక్తి లేనే లేదని, హన్మకొండ జిల్లా విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి టాస్క్‌ఫోర్స్‌కు సరైన సూచనలు చేయాలని ప్రజాప్రతినిధులను కోరారు.

మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలు వేరే మండలంలో ఉంటే అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుని మార్పుచేర్పులు చేయాలని ఆదేశించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండాలనే ప్రతిపాదన ఏదీ లేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం కచ్చితంగా ఒకే జిల్లాలో ఉంటుందని చెప్పలేమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భౌగోళికంగా పెద్దదైన మహబూబ్‌నగర్ జిల్లా ఇప్పుడు మూడు జిల్లాలుగా మారడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. పాలమూరు జిల్లాలోని అన్ని జాతీయ రహదారులకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, తెలంగాణలో అడుగుపెట్టే వారికి పాలమూరు జిల్లా ఆకుపచ్చ తోరణాలతో స్వాగతం పలికినట్లుగా ఉండాలన్నారు.

వరంగల్ జిల్లాలో మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని మండలాలు యాదాద్రిలో, కొన్ని మండలాలు సిద్దిపేటలో కలుస్తున్నాయని అన్నారు. మిగిలిన మండలాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వరంగల్ జిల్లాను రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించినట్లు సీఎం చెప్పారు. రెండు జిల్లాల స్వరూపం ఎలా ఉండాలనే అంశంపై ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని, వాటికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

గోదావరి జిల్లాల సరసన పాలమూరు
మహబూబ్‌నగర్ జిల్లాకు స్వర్ణయుగం రాబోతోందని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, పాలమూరు ప్రాజెక్టు కూడా శరవేగంతో నిర్మిస్తామని సీఎం చెప్పారు. నీటిపారుదల రంగంలో పాలమూరు జిల్లా గోదావరి జిల్లాల సరసన నిలుస్తుందన్నారు. వలసలు పోయిన వారంతా తిరిగి పాలమూరుకు చేరుకునే రోజులు వస్తున్నాయని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అంతటా నీటి సౌకర్యం వస్తుందని, అందుకే రైతులెవరూ తమ భూములు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల జరగడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కృష్ణా నదితో ఈ జిల్లాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని, పాలమూరు రైతులకు నీళ్లివ్వడం గొప్ప కార్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో దాదాపు అయిదు కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చేసిన విజ్ఞప్తి మేరకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

వరంగల్‌కు మహర్దశ
హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హెల్త్, ట్రైబల్ యూనివర్సిటీలతోపాటు అనేక విద్యాసంస్థలను మంజూ రు చేశామని, టెక్స్‌టైల్ పార్కు నిర్మించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.300కోట్లు కేటాయించామని, హృదయ్, స్మార్ట్ సిటీలో కూడా ఎంపికైనందున వరంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాజీపేట వద్ద ఫాతిమా బ్రిడ్జికి సమాంతరంగా మరో బ్రిడ్జిని నిర్మించి నాలుగు లేన్ల రోడ్డుగా మార్చనున్నట్లు ప్రకటించారు. వెంటనే అంచనాలు రూపొందించాలని నేషనల్ హైవేస్ ఈఎన్‌సీ గణపతిరెడ్డిని ఆదేశించారు.

కొత్త ప్రతిపాదనలు.. మార్పులివీ..
{పజాభిప్రాయానికి అనుగుణంగా రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలాన్ని శంషాబాద్ జిల్లాలో చేర్చాలని సీఎం ఆదేశించారు.

{పతిపాదిత మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని, కొడకండ్ల మండలాన్ని తొర్రూరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలని సూచించారు.

వరంగల్ జిల్లాలో టేకుమట్ల, పెద్దవంగర,కొమురవెల్లి మండలాల ఏర్పాటు కు అవకాశాలు పరిశీలించాలన్నారు. 

దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు మండలాన్ని రెండు మండలాలుగా విభజించే ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు.

ఖమ్మం జిల్లా గుండాల మండలం విస్తీర్ణంపరంగా పెద్దగా ఉన్నందున రెండుగా విభజించాలన్నారు.

Advertisement
Advertisement