స్టార్ హోటళ్లో ఏదీ సెక్యూరిటీ | Sakshi
Sakshi News home page

స్టార్ హోటళ్లో ఏదీ సెక్యూరిటీ

Published Mon, Dec 21 2015 12:29 AM

స్టార్ హోటళ్లో ఏదీ సెక్యూరిటీ - Sakshi

సెక్యూరిటీ సిబ్బందికి తర్ఫీదునివ్వాలని సూచన
 

సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ స్థాయిలోనే స్టార్ హోటల్స్ వెలిశాయి. ఆయితే ఆయా హోటళ్లు తీసుకుంటున్న భద్రతా చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువవుతుండటంతో అటువైపుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో సేవలందిస్తున్న దాదాపు 100కు పైగా బడా హోటళ్ల మేనేజర్లతో ఇటీవల మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. గతంలో టైస్టులు లక్ష్యంగా చేసుకున్న ముంబైలోని తాజ్ హోటళ్ల ప్రస్తావన చెబుతూనే...ఇక్కడి హోటళ్ల యజమానులు భద్రతకు తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు నియమించుకోవాలన్నారు. ఈ సెక్యూరిటీ గార్డులు ఏ ఘటన సంభవిస్తే ఎలా స్పందించాలనే దానిపై తగిన తర్ఫీదునిచ్చేందుకు తమ పోలీసు విభాగం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. హోటల్‌కు వచ్చే విజిటర్స్ జాబితా తప్పకుండా మెయిన్‌టెయిన్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలతో హోటల్ సిబ్బంది జాబితాను దగ్గర ఉంచుకోవాలన్నారు.

గన్‌లెసైన్స్‌కు స్పందన కరువు...
ఐటీ కంపెనీ నిర్వాహకులతో పాటు స్టార్ హోటల్స్ కూడా కాపలా సిబ్బందిని ఉత్తచేతులతోనే ఉంచుతున్నారు. సిబ్బందికి ఆయుధాలిస్తే, నిర్వహణ, బాధ్యత తమమీద ఎక్కడ పడుతుందేమోనని సంస్థలు వెనకడుగు వేస్తుండటమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో తొలిసారిగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లోని  సాఫ్ట్‌వేర్ సంస్థలతో పాటు హోటళ్ల భద్రత గురించి కూడా చర్చ మొదలైంది. అదే ఏడాది బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి ఘటన తర్వాత కాపలా సిబ్బందికి ఆయుధాలివ్వాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. ఐటీసంస్థలు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, పరిశ్రమలే, హోటళ్ల వద్ద ఉండే కాపలాసిబ్బందికి ఆయధాలిచ్చేందుకు సిద్ధమని అప్పట్లోనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.

ఆయుధాలకు లెసైన్సులు ఇస్తామన్నా స్పందించరే
సీసీ కెమెరాలను ఏర్పాటుచేయడంతోపాటు భద్రతా సిబ్బంది దరఖాస్తు చేసుకుంటే ఆయుధ లెసైన్సులు జారీ చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి ఆశించినంత స్పందన లేకపోవడంతో సీవీ ఆనంద్ నిర్ఘాంతపోయారు. అందుకే విడతల వారీగా ఆయా సంస్థలతో సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.  ఐటీ కారిడార్‌లో భద్రతతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్యలు తీసుకుంటున్నా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ)లో సభ్యత్వం తీసుకోవాలని సీవీ ఆనంద్ కోరారు.
 
నిర్వాహకుల భయాలకు కారణాలు
ప్రస్తుతం స్టార్ హోటళ్ల నిర్వహణ అంతా ప్రైవేటే వ్యక్తుల చేతుల్లోనే ఉంది. వీరికి ఆయుధాలిస్తే కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయన్న భయం నిర్వాహకుల్లో ఉంది.ఆయుధాలు ఉంటే వాటి నిర్వహణపై ఎప్పటికప్పుడు స్థానిక పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇస్తుండాలి.  ఆయుధం ఉంటే దుర్వినియోగం అవుతుందన్న భయం నిరంతరం ఉంటుంది. నిజంగానే దుర్వినియోగమైతే మొదటికే మోసం వస్తుందన్నది ప్రధాన ఆందోళన.
 
 

Advertisement
Advertisement