Sakshi News home page

ఆధారాలు బయటకొస్తాయ్

Published Sun, Feb 28 2016 2:23 AM

ఆధారాలు బయటకొస్తాయ్ - Sakshi

♦ పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడడం ఖాయం
♦ ఆ స్థానాల్ల్లో ఉప ఎన్నికలు వచ్చే వరకూ పోరాడుతాం
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి పచ్చ కండువాలు కప్పగానే పని అయిపోయిందని అనుకోకండి చంద్రబాబూ! అన్నీ బయటకు వస్తాయి. నువ్వు ఎవరెవరితో మాట్లాడిస్తున్నావు, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వజూపుతున్నావో ఆధారాలు బయటకు రాబోతున్నాయి... జాగ్రత్త’’ అని వెఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తాను పంపిన డబ్బు సక్రమంగా చేరుతుంది. వాళ్లందరూ చేరుతున్నారు.

అంతా సక్రమంగా జరుగుతోందని చంద్రబాబు అనుకుంటున్నారు. లీక్‌లు ఉంటాయి. దొంగలు ఆధారాలు వదిలే వెళ్తారు. అన్నీ బయటకు వస్తాయి’’ అని అంబటి చెప్పారు. వైఎస్సార్‌సీపీ పని అయిపోయిందంటూ టీడీపీ చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కష్టాల్లో పుట్టిన పార్టీ మాది. ఎండకు ఎండింది. వానకు తడిసింది. చలికి వణికింది. అయినా 67 సీట్లలో గెలిచింది. ప్రధాన ప్రతిపక్షంగా మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న వైఎస్సార్‌సీపీతో మైండ్ గేమ్ ఆడుతారా?’’ అని ధ్వజమెత్తారు. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు నైతిక విలువలుంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వచ్చే వర కు పోరాడుతామని స్పష్టం చేశారు.

 వారు ఎటు ఓటు వేస్తారు?
 శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని.. ఓటింగ్ వచ్చినప్పుడు పార్టీ విప్ జారీ చేయడం సాధారణమని అంబటి చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అప్పుడు ఎటు ఓటు వేస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కన్నా, వారి దగ్గర ఉన్న డబ్బుల కన్నా ప్రజాస్వామ్యం బలమైందని నిరూపితం కాబోతోందన్నారు.  

 తప్పు చేసింది బాబే..
 ‘‘తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయాడు కాబట్టే చంద్రబాబు తన పార్టీని కేసీఆర్‌కు దాసోహం చేశారు. ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పూ చేయలేదు కాబట్టే సోనియాగాంధీపై సైతం రాజీ పడకుండా పోరాడారు. 16 నెలలు జైల్లో ఉన్నా తలవంచని వ్యక్తి జగన్’’ అని అంబటి కొనియాడారు.

Advertisement

What’s your opinion

Advertisement