‘భూం’ఫట్‌..! | Sakshi
Sakshi News home page

‘భూం’ఫట్‌..!

Published Wed, Mar 1 2017 1:26 AM

‘భూం’ఫట్‌..! - Sakshi

సిటీబ్యూరో: అదో వ్యవస్థీకృత ముఠా...సిటీలోని ఖరీదైన ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలను గుర్తిస్తుంది...దానికి సంబంధించి ఫోర్జరీ పత్రాలు రూపొందిస్తుంది. ఆ స్థలం తమదేనంటూ వివాదం సృష్టించి కోర్టుకు వెళ్తుంది.చివరకు స్థలం స్వాహా చేయడమో, యజమానులు రాజీకి వచ్చేలా చేసుకోవడమో చేస్తుంటుంది. న్యాయవాది నేతృత్వంలో సాగుతున్న ఈ గ్యాంగ్‌ కార్యలాపాలపై నమోదైన మూడు కేసుల్ని సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సూత్రధారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అతడి వెనుక బడాబాబులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

‘నకిలీ’లతో టార్గెట్‌ చేస్తూ...
ఈ ముఠా తొలుత వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఖరీదైన భూముల్ని గుర్తిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనే తేడా లేకుండా తమ కన్నుపడిన స్థలంపై కాగితాల ద్వారా కబ్జా పెడుతుంది. ఆ భూమికి సంబంధించి ఓ నకిలీ యజమానికి సృష్టించడంతో పాటు ఆయన ఈ ముఠాకు చెందిన ఒకరికి దాన్ని విక్రయించినట్లు రికార్డులు సృష్టిస్తుంది. ఇందుకోసం వీరు వినియోగించే స్టాంపు పేపర్లు, స్టాంపులు తదితరాలు సైతం పాత తేదీలతో కూడి ఉండటం మరో కొసమెరుపు. వీటిని వినియోగించి ఆ భూమి తమదే అంటూ అందులోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తుంది. దీంతో అటు రెవెన్యూ అధికారులో, ఇటు ప్రైవేట్‌ వ్యక్తులైన దాని యజమానులో తప్పనిసరి పరిస్థితుల్లో ముందుకు వచ్చేలా చేస్తుంది.

వాదనలతో మొదలుపెట్టి...
తమ భూమో, ప్రభుత్వ స్థలమో అన్యాక్రాంతమవుతోందనే ఉద్దేశం, భయంతో ఇలా వచ్చిన వాళ్ళు ఆ భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించినా...అవి బోగస్‌ అంటూ ముఠా వాదిస్తుంది. ఆ స్థలాన్ని మీరు ఖరీదు చేయడానికి ముందే అసలు యజమాని మాకు అమ్మేశాడంటూ వాదిస్తారు. ఇలా మాటలతో విషయం ‘సెటిల్‌’ కాదని భావించినప్పుడు ముఠాకు చెందిన న్యాయవాది నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పటికే రూపొందించిన బోగస్‌ పత్రాలను అసలైనవిగా పేర్కొంటూ న్యాయస్థానంలో పిటిషన్‌ వేస్తాడు. దీంతో ఆయా స్థలాల్లో జరుగుతున్న, జరుగనున్న నిర్మాణాలు, అభివృద్ధి పనులు ఆగిపోయేలా చేయడంలో గ్యాంగ్‌ సఫలీకృతం అవుతుంది. ఫలితంగా ప్రభుత్వ స్థలమైతే ప్రాజెక్టులు ఆగిపోవడం, ప్రైవేట్‌ స్థలమైతే యజమానికి నష్టం వచ్చేలా చేయడం ఈ ముఠా ప్రధాన ఉద్దేశాలు.

రాజీ వైపే ప్రైవేట్‌ వ్యక్తుల మొగ్గు...
ఈ విధంగా వివాదంలోకి వచ్చిన స్థలానికి సంబంధించిన యజమాని ప్రైవేట్‌ వ్యక్తి అయితే వారు ఎక్కువగా రాజీ చేసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వ స్థలమైతేనే విషయం పోలీసుస్టేషన్లు, న్యాయస్థానాల వరకు వెళ్తోంది. ఈ రకంగా ఆసిఫ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల్లోని రూ.వందల కోట్ల భూములకు సంబంధించి నమోదైన మూడు కేసుల్ని సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని దాదాపు రెండు ఎకరాల సంస్థలం, ఆసిఫ్‌నగర్‌లో ఓ ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తి, బంజారాహిల్స్‌లో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి వివాదాలకు సంబంధించి ఈ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రాథమిక విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ముఠా సృష్టించింది బోగస్‌ పత్రాలనీ తేల్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగితాల్లోనే స్థలాల యజమానులు...
ఈ మూడు కేసుల దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్‌ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా ముఠా రూపొందించిన పత్రాల్లోని వివరాలను సరిచూడటం ప్రారంభించారు. అందులో ఆయాలు అమ్మినట్లు, కొన్నట్లు రికార్డు అయిన వ్యక్తుల పేర్లు, చిరునామాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే అవన్నీ బోగస్‌ పేర్లు, చిరునామాలుగా తేలాయి. ఆయా అడ్రస్‌ల్లో ఉంటున్న వారి నుంచి ఆరా తీయగా>... సదరు పత్రాల్లో ఉన్న వారు అక్కడ ఉండరని, వారు ఎవరో కూడా తమకు తెలియదని చెప్పుకొచ్చారు. దీంతో డాక్యుమెంట్లు నకిలీవని అధికారికంగా నిర్థారించిన పోలీసులు వాటిని తయారు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డాడు.
ఓ కేసుకు సంబంధించి ఈ పత్రాల సృష్టికర్తల్ని గుర్తించిన పోలీసుల వారిని విచారించగా..ముఠా సూత్రధారి, పాత్రధారులకు సంబంధించి కీలక విషయాలు తెలుసుకోగలిగారు.

న్యాయవాది కోసం గాలింపు ముమ్మరం...
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరి«ధిలోని మాదాపూర్‌కు చెందిన ఓ న్యాయవాది ఈ ముఠాకు సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా... ఈ గ్యాంగ్‌ గతంలోనే అనేక స్థలాలపై కన్నేసినట్లు, యజమానులతో రాజీ పేరుతో భారీగా దండుకున్నట్లు అనుమానిస్తున్నారు. న్యాయవాదితో పాటు మిగిలిన నిందితుల్ని పట్టుకుంటేనే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్న పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ తరహాలో ఈ గ్యాంగ్‌ చేతిలో బాధితులుగా మారిన వారు ఇంకా ఎవరైనా ఉంటే బయటకు రావాలని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement