Sakshi News home page

జీహెచ్‌ఎంసీ పీఠం టీఆర్‌ఎస్‌దే!

Published Sun, Dec 20 2015 4:11 AM

జీహెచ్‌ఎంసీ పీఠం టీఆర్‌ఎస్‌దే! - Sakshi

నంబర్ గేమ్‌లో మేమే ముందున్నాం: తలసాని
♦ హైదరాబాద్ నివాసితులంతా తెలంగాణ వారే
♦ సెటిలర్లకు కూడా సీట్లు ఇస్తాం..
♦ గ్రేటర్ హైదరాబాద్ కోసం ప్రత్యేక మేనిఫెస్టో
♦ సంక్షేమం, అభివృద్ధి నినాదాలతో ముందుకెళతామని వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌దేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 సీట్లలో 76 సీట్లు గెలుచుకున్న వాళ్లకే మేయర్ పదవి లభిస్తుందని, ఈ నంబర్ గేమ్‌లో తామే ముందున్నామని చెప్పారు. మేయర్‌ను ఎన్నుకునేవారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారని, ఆ లెక్కన తమకు కొన్ని ఓట్లు ఉన్నాయన్నారు. మరికొన్ని డివిజ న్లను గెలుచుకుంటే చాలని వ్యాఖ్యానించారు. అదే ప్రతిపక్షాలు జీరో నుంచి మొదలుపెట్టాలన్నారు. తలసాని శనివారం సచివాలయంలోని తన చాంబర్‌లో పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్‌లను పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం. 2002 ఎంసీహెచ్ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్) ఎన్నిక ల్లో ప్రత్యక్ష పద్ధతిలో తీగల కృష్ణారెడ్డిని మేయర్‌గా ఎన్నుకుంటే సుభాష్‌చందర్‌ను డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోవలసి వచ్చింది. అప్పుడు టీడీపీ, బీజేపీలకు బలం లేకపోయినా, ఎక్కడెక్కడో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను తీసుకొచ్చి ఓట్లు వేయించి గెలిపించారు.

అలాంటి సంఘటనలు పరోక్ష ఎన్నికల్లో చాలానే జరిగాయి..’’ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తలసాని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రేటర్‌లో 80 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవడం పెద్ద సమస్య కాదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని చెప్పారు.

 దొంగదారిలో గెలవాల్సిన అవసరం లేదు
 సంక్రాంతికి ఆంధ్రా ప్రాంతపు ప్రజలు సెలవు ల్లో వెళ్లిపోయాక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ అవసరం టీఆర్‌ఎస్‌కు లేదని తలసాని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, తరువాత కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయన్నారు. గత 19 నెలల కాలంలో ఆంధ్రా ప్రాంతపు ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. ‘‘విజయవాడకు కేసీఆర్ వెళితే వచ్చిన రెస్పాన్స్ మీకు తెలుసు.

ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అందరికి ఆమోదయోగ్యమైన సమయంలోనే నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రాకు ప్రజలు వెళ్లిన తరువాత ఓట్లు వేయించుకునే ఖర్మ మాకు లేదు. అయినా నంబర్ గేమ్‌లో మేం గెలిచిపోయాం. మెజారిటీనే మాకు కావలసింది. దొంగదారులు మాకెందుకు?’’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారంతా తెలంగాణ వారేనని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటేస్తారనేది తమ నమ్మకమని పేర్కొన్నారు.

 కేసీఆర్ విజన్ ముందు ఎవరూ పనికిరారు
 హైదరాబాద్ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు ఓ విజన్ ఉందని తలసాని స్పష్టం చేశా రు. ఇంజనీర్లను పిలిపించి రాత్రి వరకు సమావేశాలు నిర్వహించి, జీహెచ్‌ఎంసీ అభివృద్ధిపై ఓ కార్యాచరణ రూపొందించారని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ను కలుషితం చేసే నాలాలను మళ్లిస్తున్నామని.. ఇక సాగర్‌లోని నీటిని ఖాళీ చేయించి, అధునాతన టెక్నాలజీ ద్వారా కొత్త నీటిని నింపడమే మిగిలిందని పేర్కొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement