శభాష్ ప్రకాష్.. | Sakshi
Sakshi News home page

శభాష్ ప్రకాష్..

Published Mon, Aug 26 2013 2:02 AM

శభాష్ ప్రకాష్.. - Sakshi

అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: ప్రయాణికురాలు ఆటోలో మర్చిపోయిన రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారు ఆభరణాల బ్యాగును పోలీసులకు అప్పగించి ఆటోడ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. బేగంబజార్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. వినోద్, సరిత దంపతులు వనస్థలిపురంలో ఉంటున్నారు. శనివారం తన ఇంటికి వచ్చిన నలుగురు చెల్లెళ్లతో కలిసి సరిత తన భర్తతో అబిడ్స్ వచ్చారు. సరిత తన 50 తులాల బంగారు నగల్ని భద్రపర్చిన హ్యాండ్ బ్యాగును వెంట తెచ్చుకున్నారు.

షాపింగ్ అనంతరం రామకృష్ణ థియేటర్‌లో మొదటి ఆట సినిమా చూశారు. తరువాత వనస్థలిపురానికి ఆటో మాట్లాడుకున్నారు. ఆటోలో వెళ్తుండగా కుమార్తె ఏడవటంతో సరిత తన చేతిలోని బ్యాగును ఆటో సీటు వెనుక ఉంచారు. ఇల్లు రాగానే బ్యాగు మర్చిపోయి ఆటో దిగారు. సరిత దంపతులు కొద్దిసేపటికి ఆటోలో మర్చిపోయామని గుర్తించి అదేరోజు రాత్రి సరూర్‌నగర్, అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సరిత బృందాన్ని దింపిన అనంతరం ఎంజేమార్కెట్‌కు చేరుకునేసరికి ఆటో వెనుక సీట్లో శబ్దం వస్తుందని గ్రహించిన డ్రైవర్ ప్రకాష్ ఆటో నిలిపి చూడగా హ్యాండ్ బ్యాగు, అందులో నగలు, 2 సెల్‌ఫోన్లు, రూ.3వేల నగదు కనిపించాయి.

వాటిని అదేరోజు రాత్రి బేగంబజార్ పోలీసులకు అప్పగించాడు. సెల్‌ఫోన్‌ల్లో చార్జింగ్ లేకపోవడంలో పోలీసులు చార్జింగ్ పెట్టారు. ఆదివారం ఉదయం వినోద్, సరిత దంపతులు ఫోన్ చే యగా, విషయం చెప్పారు. దీంతో వారు బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వివరాలను సేకరించిన అనంతరం ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ వారికి సొత్తు అందజేశారు. కాగా, ఆటో డ్రైవర్ ప్రకాశ్ మంగళ్‌హాట్‌కు చెందిన వారు. వికలాంగుడైన ఆయన 20 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతని నిజాయితీకి మెచ్చిన సరిత దంపతులు, ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ రూ.వెయ్యి చొప్పున ప్రకాశ్‌కు అందచేసి అభినందించారు.
 

Advertisement
Advertisement