మిర్చిపై ఏం చేద్దాం? | Sakshi
Sakshi News home page

మిర్చిపై ఏం చేద్దాం?

Published Sun, Apr 30 2017 3:06 AM

మిర్చిపై ఏం చేద్దాం? - Sakshi

సర్కారు తర్జనభర్జన
- కేంద్రం కొనుగోలు చేస్తుందన్న ఆశలు గల్లంతు
- క్వింటాలుకు రూ.1,500 బోనస్‌తో కొనుగోలుకు యోచన
- ఖమ్మం సంఘటనలో అధికారుల వైఫల్యంపై ఆగ్రహం
- ఇష్టానుసారంగా ధరలు తగ్గిస్తున్న వ్యాపారులపై చర్యలు


సాక్షి, హైదరాబాద్‌: మిర్చి రైతులను ఆదుకునే విషయంలో ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఒకవైపు పంటకు సరైన ధర రాక రైతులు అల్లాడుతుం డటం.. మరోవైపు ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తుండటంతో సర్కారును కలవర పెడుతోంది. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

మిర్చి రైతుల గగ్గోలు..
నెల రోజులుగా మిర్చి రైతులు «గిట్టుబాటు ధర రాక గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది క్వింటాలుకు రూ.12 వేలు ధర రాగా, ఇప్పుడు అది రూ.4,500కు, ఒకానొక సంద ర్భంలో రూ.2,500కు పడిపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. అసహనంతో అనేక చోట్ల మిర్చిని తగులబెడుతున్నారు. తాజాగా ఖమ్మం మార్కెట్‌ యార్డు ధ్వంసంతో ప్రభు త్వం ఉలిక్కిపడింది. పరిస్థితి చేయిదాటి పోతోందన్న భయాందోళనలో పడింది. పరి స్థితిని చక్కదిద్దడంలో అధికారుల వైఫల్యంపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అక్కడ అంత జరుగుతున్నా శాంతిభద్రతల సమస్యగానే అధికారులు చెప్పడం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారు లను ఒప్పించి రైతులకు తగిన ధర ఇప్పించేలా అధికారులు ఎందుకు చొరవ చూపలేదన్న చర్చ నడుస్తోంది. కొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.

కేంద్రంపై ఆశలు గల్లంతు..
2016–17 ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లోనే అధిక సాగు జరిగింది. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అయితే ధర మాత్రం అమాంతం పడిపో యింది. 2015–16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది.  ఈ నేపథ్యంలో మిర్చిని క్వింటాలుకు రూ.7–8 వేల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. లేదంటే బోనస్‌గా క్వింటాలుకు రూ.1,500 ఇచ్చేలా సహకరించాలని కోరింది. లేఖ రాసినా, స్వయంగా అధికారులు వెళ్లి విన్నవించినా కేంద్రం మిన్నకుండిపోయింది. దీంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆశలు వదులుకుంది. ఇలాగే కొనసాగితే రైతుల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement
Advertisement