సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా

Published Wed, Aug 12 2015 10:39 PM

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద హైడ్రామా - Sakshi

హైదరాబాద్: బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ఏపీ సీఐడీ అధికారులు.. మంత్రి కేటీఆర్ గన్మన్, కారు డ్రైవర్లకు నోటీసులు ఇవ్వజూసిన క్రమంలో ఈ తతంగం జరిగింది.

ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలంటూ కేసులో నాలుగో నిందితుడైన జెరుసలేం మత్తయ్యను బెదిరించారని, దీనికి సంబంధించి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మంత్రి కేటీఆర్ గన్ మన్, డ్రైవర్లు అయిన జానకీరామ్, సత్యనారాయణలకు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు రాత్రి సమయంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే క్యాంప్ ఆఫీస్ భద్రతా సిబ్బంది.. ఏపీ సీఐడీ అధికారుల్ని గేటు వద్దే అడ్డుకుని అలాంటి పేర్లు గల వ్యక్తులెవరూ ఇక్కడ లేరని వెనక్కి పంపించారు.

దీనికి ప్రతిగా ఓ సారి లోపలికి వెళ్లి చూసొస్తామని ఏపీ అధికారులు అనడంతో.. అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ లోనికి అనుమతించేదిలేదంటూ భద్రతా సిబ్బంది తేల్చిచెప్పారు. అంతేకాదు మీరు ఇచ్చే నోటీసులు తీసుకోబోమన్నారు. దీంతో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వెనుదిరిగిన ఏపీ సీఐడీ అధికారులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నమే చేశారు. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఏపీ అధికారుల్ని లోనికి అనుమతించలేదు. కాగా,  రెండోసారి వారు రావడానికి కొద్ది క్షణాల ముందే సీఎం కాన్వాయ్ క్యాంప్ ఆఫీస్ లోపలికి ప్రవేశించడం గమనార్హం.

ఇంతటితో ముగిసిందనుకున్న హైడ్రామా నందినగర్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద మళ్లీ మొదలైంది. కేటీఆర్ క్యాంప్ కార్యాలయం (కేసీఆర్ స్వగృహం) వద్దకు చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు కేటీఆర్ గన్ మన్, కారు డ్రైవర్లను గురించి అక్కడున్న భద్రతా సిబ్బందిని వాకబు చేశారు. అలాంటి పేర్లున్నవారెవరూ లేరని చెప్పడంతో మళ్లీ వెనుదిరిగిపోయారు.   గారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ  మేం తాకేదే లేదన్నారు.  'మేము నోటీసులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తులెవరూ ఇక్కడ లేరని భద్రతా సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నాం' అని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement