జైళ్లు.. హౌస్‌ఫుల్! | Sakshi
Sakshi News home page

జైళ్లు.. హౌస్‌ఫుల్!

Published Wed, Jul 20 2016 4:26 AM

జైళ్లు.. హౌస్‌ఫుల్!

- ఖైదీలతో కిక్కిరిసిపోతున్న కారాగారాలు   
- వీరిలో శిక్ష పడిన వారు మూడో వంతే..


రాష్ట్రంలోని కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. సెంట్రల్ జైలు మొదలుకుని జిల్లా, సబ్‌జైళ్లు అన్నీ కూడా ఖైదీలతో నిండిపోయాయి. రాష్ట్రంలో మూడు కేంద్ర కారాగారాలతో పాటు మొత్తం 46 జైళ్లు ఉన్నాయి. అన్ని జైళ్లలో కలిపి 6,848 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది. అయితే ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు జైళ్లు నిండిపోయాయి. కేంద్ర కారాగారాల్లో అయితే సామర్థ్యం కంటే అధికంగా ఖైదీలు ఉన్నారు.
 
 మూడు కేంద్ర కారాగారాల్లో కలిపి 3,126 మంది ఖైదీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 3,500 మందితో కిక్కిరిసిపోయాయి. మహిళా కేంద్ర కారాగారం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఉమెన్ సెంట్రల్ జైలు కెపాసిటీ 220 కాగా.. ప్రస్తుతం 250 మంది ఉన్నారు. అయితే జిల్లా జైళ్లు, సబ్ జైళ్లలో మాత్రం సామర్థ్యం కంటే కాస్త తక్కువగానే ఖైదీలు ఉన్నారు.
 - సాక్షి, హైదరాబాద్
 
 శిక్షపడిన వారు 2,124 మందే
 జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీల్లో న్యాయస్థానాల్లో శిక్షపడిన వారు మూడో వంతు మాత్రమే. సుమారు 6,800 మంది ఖైదీలకుగానూ శిక్షపడిన వారు 2,124 మందే. మిగతా వారంతా కేసుల విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. శిక్షపడిన ఖైదీల్లో అత్యధికంగా హత్యానేరం కింద శిక్ష అనుభవిస్తున్న వారు 1,180 మంది. దొంగతనం(198), అత్యాచారం(154), వరకట్న హత్యలు(90) వంటి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారూ ఉన్నారు.
 
 సిబ్బందిపై పనిభారం..

రాష్ట్రంలోని అన్ని జైళ్లూ ఖైదీలతో నిండిపోయిన నేపథ్యంలో సరిపడా సిబ్బంది లేక జైళ్ల శాఖ సతమతమవుతోంది. మొత్తం 1,900 పోస్టులకుగానూ 1,500 మంది సిబ్బందితోనే జైళ్ల శాఖ నెట్టుకొస్తోంది. 400 పోస్టులు ఖాళీగా ఉండటంతో పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఐజీ ర్యాంకు స్థాయిగల అధికారి పోస్టు కూడా ఖాళీగానే ఉంది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపకపోవడంతో ఉన్నతాధికారులు ఆవేదన చెందుతున్నారు.
 
 తగ్గిన ఖైదీల మరణాలు..
మహా పరివర్తన్ పేరిట జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అవలంబిస్తున్న చర్యల ద్వారా ఖైదీల్లో మార్పు వస్తోంది. తెలిసో, తెలియకో తప్పు చేసి జైళ్లకు వచ్చే వారిని మరోసారి తప్పిదం చేయకుండా ఉండేందుకు మానసిక నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. వివిధ రకాల దురలవాట్లు, ఆరోగ్యం దెబ్బతిన్న వారు జైలుకు వచ్చాక పరిస్థితి మరింత విషమించి, సమయానికి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులకు దూరమై మనోధైర్యం కోల్పోయి.. వివిధ వ్యాధులకు గురై మరణిస్తుంటారు. అయితే గత ఏడాది కాలంగా యోగా, మానసిక నిఫుణుల శిక్షణల వల్ల మరణాల రేటు కూడా సగానికి పైగా తగ్గింది. 2014లో 52 మంది ఖైదీలు మరణించగా, 2015లో 26 మంది వివిధ కారణాల వల్ల మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎనిమిది మంది మాత్రమే మరణించినట్లు సమాచారం.

Advertisement
Advertisement