రైతు నెత్తిన ‘సోయా’ టోపీ | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన ‘సోయా’ టోపీ

Published Tue, May 17 2016 4:06 AM

రైతు నెత్తిన ‘సోయా’ టోపీ - Sakshi

♦ విత్తనాల సేకరణలో అడ్డగోలు విధానం
♦ మార్కెట్ ధర రూ.3 వేలుంటే..కంపెనీల నుంచి రూ.6,600కు కొనుగోలు
♦ కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టేందుకే అని విమర్శలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయశాఖ సోయాబీన్ విత్తన కుంభకోణానికి తెరలేపింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పండించాలని పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వం.. విత్తనాలను మాత్రం అధిక ధరలకు కొనేందుకు సిద్ధమైంది. వివిధ కంపెనీల నుంచి అధిక ధరకు కొనుగోలు చేసి వాటికి కోట్లు కట్టబెట్టే కుట్రలకు పాల్పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 గతేడాది 6.35 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగైతే ఈసారి 11.5 లక్షల ఎకరాల్లో సాగును పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు 4 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమని అంచనా వేసింది. ఆ విత్తనాలను సేకరించే బాధ్యత వివిధ కంపెనీలకు అప్పగించింది. మధ్యప్రదేశ్ నుంచి వాటిని సేకరించే పనిలో కంపెనీలున్నాయి. ప్రభుత్వం క్వింటాల్ సోయాబీన్ విత్తన ధరను రూ.6,600 ఖరారు చేసింది. అందులో 33.33 శాతం సబ్సిడీని భరించి రైతులకు రూ.4,400 ధరకు అందజేస్తామని ఇటీవల ఉత్తర్వులిచ్చింది. కానీ ఈ ఏడాది సోయాబీన్ ధర మార్కెట్లో గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలుకు రూ.3 వేలకు మించి ధర పలకడంలేదని స్వయంగా మార్కెటింగ్ శాఖే పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల కోసం ఏకంగా రెండింతల ధరను ఎలా ఖరారు చేశారో అంతుబట్టడం లేదు.

 ఒక్కో క్వింటాలుకు రైతుపై రూ.800 భారం
 ప్రస్తుత ధరను లెక్కలోకి తీసుకోకుండా గతేడాది ధరను అధికారులు ఎలా ఖరారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో ధర ప్రకారమే రైతులు కొనుగోలు చేస్తే వారికి రూ.3 వేలకే దొరుకుతుంది. ఒకవేళ దాన్ని ప్రాసెస్ చేసినా రూ.3,600కు మించి ధర ఉండదంటున్నారు. అలాంటిది రైతులకు క్వింటాలుకు రూ.4,400కు కట్టబెట్టబోతున్నారన్న మాట. ఈ లెక్కన రైతులపై ఒక్కో క్వింటాలుకు ఏకంగా రూ.800 భారం పడనుంది.

ఇలా కంపెనీల నుంచి అధికంగా కొనుగోలు చేయడం వల్ల రైతులపై రూ.32 కోట్లు, ప్రభుత్వంపై రూ.88 కోట్లు అదనపు భారం పడనుంది. ఈ తతంగంలో ప్రైవేటు కంపెనీలకు రూ.120 కోట్లు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం గతేడాది ధర ప్రకారమే సోయాబీన్ విత్తనాలను సరఫరా చేయాలని నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. ధర తగ్గినా ఎక్కువ ధరతో కంపెనీల నుంచి సోయాబీన్ విత్తనాలు ఎందుకు కొంటున్నారని ప్రశ్నించగా ఆయన సరైన సమాధానమివ్వలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement