Sakshi News home page

అధికార పార్టీలో అంతా గప్‌చుప్!

Published Mon, Aug 3 2015 12:58 AM

అధికార పార్టీలో అంతా గప్‌చుప్! - Sakshi

తలసాని రాజీనామా ఆమోదంపై వీడని సస్పెన్స్
* వరంగల్ అభ్యర్థి ఎవరో..?
* పార్టీ వ్యవహారాలన్నీ గోప్యం       

సాక్షి, హైదరాబాద్: అంతా రహస్యమే.. అధికార టీఆర్‌ఎస్‌లో జరుగుతుందో ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ వ్యవహారాలను పక్కన పెట్టినా.. సంస్థాగత వ్యవహారాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఒకటీ అరా విషయాలు తెలిసినా, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కాదని ఆ విషయాలను బయట చర్చించే సాహసం చేయడం లేదు.

వాస్తవానికి టీఆర్‌ఎస్ నేతల్లో అత్యధికులు పార్టీలో ఏం జరుగుతుందో తమకేమాత్రం తెలియదని చెబుతున్నారు. ఫలితంగా అధికార పార్టీలో అంతా గప్‌చుప్ వ్యవహారమే నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల పంపకం, గ్రేటర్ ఎన్నికలు, తదితర అంశాలపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీగా ఉంది.

ఆయన రాజీనామానూ లోక్‌సభ స్పీకర్ ఆమోదించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమైనట్లే. ఈ స్థానం నుంచి ఎవ రిని పోటీకి పెడతారన్న విషయం ఖరారు కాలేదు. ‘అధినేత ఒక పేరుపై ఇప్పటికే డిసైడ్ అయి ఉంటారు. దానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించుకుని ఉంటారు. కానీ, ఆ విషయాలేవీ మా దాకా రావు.. ఎవరు పోటీ చేస్తున్నారంటే, మేం ఏం చెప్పగలం..’ అంటూ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
 
అన్నీ గోప్యమే: ఒక వైపు వరంగల్ లోక్‌సభ స్థానానికి విపక్షాలు సిద్ధమవుతూనే, అభ్యర్థులను ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై తర్జన భర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ ఈ ఉపఎన్నికను సవాలుగా తీసుకుంటోంది. కానీ, టీఆర్‌ఎస్‌లో ఎలాంటి కసరత్తు జరగలేదు. అధినేత మదిలో ఏముందో తెలుసుకోలేక నేతలు అయోమయానికి గురవుతున్నారు. మంత్రి తలసాని రాజీనామాపై సస్పెన్స్ వీడలేదు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 7 నెలలు గడిచినా, ఇంకా హైడ్రామా నడుస్తోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తారా? సనత్‌నగర్‌లో ఉప ఎన్నికకు పోతారా? అన్న అంశంపై చర్చ జరుగుతు న్నా.. పార్టీ నేతలకు సమాచారం లేదు. అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియక వారూ పెదవి విప్పలేకపోతున్నారు.
 
ఒకే ఒక్కడు..: రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఒక్కరే పార్టీ పదవిలో ఉన్నట్టు లెక్క. రాష్ర్ట కమిటీ, పొలిట్‌బ్యూరో వంటి విభాగాలకు కొత్త వారిని ఎంపిక చేయలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పైపై సమాచారంతోనే విపక్షాలపై ఎదురుదాడిచేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, పార్టీకి అధికార ప్రతినిధులంటూ ఎవరూ లేకుండాపోయారు. చివరకు ప్రభుత్వం విప్‌లు సైతం స్వతంత్రించి ఏ అంశాలపైనా స్పందిచలేని పరిస్థితి ఉంది.

ఒకరిద్దరు మంత్రులు, మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే పార్టీ తరపున, ప్రభుత్వం తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. పార్టీ పరంగా ఎవ రికీ హోదా లేకపోవడంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ హోదా ఉన్నా, పూర్తి స్థాయి రాజకీయ పార్టీ స్వరూపం లేకుండా అయిందని, అన్ని కమిటీలూ ఖాళీగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement