రాష్ట్ర చేపగా కొరమీను | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చేపగా కొరమీను

Published Thu, Jul 21 2016 5:24 AM

రాష్ట్ర చేపగా కొరమీను - Sakshi

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
 సాక్షి, హైదరాబాద్: ‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చేపగా కొరమీనుకు గుర్తింపునిచ్చింది. దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్‌గా పిలుస్తారు. మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొరమీను శాస్త్రీయ నామం చన్నా స్ట్రయేటస్.  ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు.
 
 అలా గుర్తించిన చేపలను కాపాడుకోవడమే కాకుండా వాటి సంతతి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో లభించే వివిధ రకాల చేపల్లో కొరమీనుకు అత్యంత ప్రాధాన్యముంది. చేపల పులుసులో కొరమీను రుచికి మించింది లేదు. అందుకే పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ చేపలకు డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేటు కూడా ఎక్కువే. రాష్ట్రంలో మత్స్యకారులకు లాభాల పంట పండించే చేపగా కొరమీను అందరికీ సుపరిచితమే.

Advertisement
 
Advertisement