జాగ్రత్తగా వాడుకోండి.. | Sakshi
Sakshi News home page

జాగ్రత్తగా వాడుకోండి..

Published Wed, Jan 10 2018 2:05 AM

Krishna boar on water consumption  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నీటి నిల్వలపై తెలుగు రాష్ట్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అప్రమత్తం చేసింది. సాగు, తాగు అవసరాలకు తగ్గట్టుగా ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవడంతో నిల్వలు పడిపోతున్నాయని హెచ్చరించింది. ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో కలిపి 133.75 టీఎంసీల నీరే ఉండటం.. రబీ అవసరాలు, ఆగస్టు వరకు ఈ నీరే వినియోగించుకోవా ల్సిన నేపథ్యంలో ప్రణాళికతో ముందుకెళ్లాల ని రెండు రాష్ట్రాలకు మంగళవారం లేఖలు రాసింది.

ప్రస్తుతం ఉన్న 133.75 టీఎంసీల్లో వాటాల ప్రకారం తెలంగాణకు 60.33 టీఎంసీలు, ఏపీకి 73.42 టీఎంసీలు దక్కనున్నాయి. కానీ ఇరు రాష్ట్రాల అవసరాలు 170 టీఎంసీలకు పైనే ఉండటంతో నీటినెలా సర్దుకుంటారన్నది ప్రధాన అంశం. సాగర్‌ ఎడమ, కుడి కాల్వల కింది రబీ అవసరాలతో పాటు కృష్ణా డెల్టా, కల్వకుర్తి కింది అవసరాలకు మే 31 వరకూ ఈ నీరే వాడుకోవాలి.

అలాగే ఆగస్టు చివరి వరకు ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కూ వినియోగించుకోవాలి. మరోవైపు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ బుధవారం భేటీ కానుంది. జలసౌధలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు హాజరవనున్నట్లు బోర్డుకు సమాచారమిచ్చారు. రెండు రాష్ట్రాలకు జూన్‌ వరకు దక్కే వాటాలు, లభ్యత జలాలు, అవసరాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

Advertisement
Advertisement