హక్కుల సేనాని అస్తమయం | Sakshi
Sakshi News home page

హక్కుల సేనాని అస్తమయం

Published Sat, Sep 17 2016 1:59 AM

హక్కుల సేనాని అస్తమయం - Sakshi

బ్రెయిన్ కేన్సర్‌తో కన్నుమూసిన బొజ్జా తారకం
దళిత హక్కుల కోసం జీవితాంతం పరితపించిన నేత
సీఎం కేసీఆర్ సహా పలువురి  సంతాపం.. నేడు అంత్యక్రియలు

 
సాక్షి, హైదరాబాద్: హక్కుల సేనాని ఇక లేరు. పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనను కిమ్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు.

ఆయనకు భార్య విజయభారతి, కూతురు డాక్టర్ మహిత, కుమారుడు రాహుల్ బొజ్జా (హైదరాబాద్ కలెక్టర్) ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై తారకం.. దళిత పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడారు. దోషులకు శిక్షపడేలా చేశారు. తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేయించిన కేసుకు సంబంధించి ఎమినిది నెలల కిందట వైజాగ్ స్పెషల్ కోర్టుకు వెళ్లారు. అదే సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ్నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆగస్టు 15 నుంచి జొబ్జా తారకం నోటి నుంచి మాట రావడం లేదు.

అంబేడ్కర్ రచించిన ‘రాముడు, కృష్ణుడు ర హస్యాలు’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన తారకం.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖను రిజిస్టర్ చేయించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీలో తారకం కీలకంగా పనిచేశారు. ‘పోలీసులు అరెస్టుచేసే’్త‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’‘పంచతంత్రం’ (నవల)‘నది పుట్టిన గొంతుక’ వంటి రచనలు చేశారు.

సీఎం సంతాపం
బొజ్జా తారకం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బహుముఖ సేవలందించిన బొజ్జా తారకం అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ధర్మాన్ని గుర్తించి, తనకు, ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విరసం నేత వరవరరావు తదితరులు కూడా సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement