వాహనదారుల్లో లైసెన్స్ భయం | Sakshi
Sakshi News home page

వాహనదారుల్లో లైసెన్స్ భయం

Published Wed, Mar 16 2016 12:37 AM

వాహనదారుల్లో లైసెన్స్ భయం - Sakshi

పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో పెరుగుతున్న దరఖాస్తులు
 
 సాక్షి, హైదరాబాద్:
► పక్షం రోజుల క్రితం... నగరంలోని రవాణాశాఖ కార్యాలయాల్లో తాత్కాలిక లెసైన్సుల కోసం వచ్చే వారి సంఖ్య సగటున రోజుకు 600.
► సోమవారం తాత్కాలిక లెసైన్సు కోసం 2300 మంది కార్యాలయాలకు వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ రోజుకు సగటున రెండు వేల మందికి చేరుకుంది.
► తాత్కాలిక లెసైన్సుల కోసం వాహనదారులు ఎగబడుతున్నారు.  ఒక్కసారిగా ఇంత రద్దీ ఎందుకు పెరిగిందో తెలుసా..!!

 లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడటమే దీనికి కారణం. లెసైన్సు లేకుంటే జరిమానాతో సరిపెడుతూ వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఏకంగా వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు వాహనదారుకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో లెసైన్సులేని వారిలో కలవరం మొదలైంది. హైదరాబాద్‌లో దాదాపు 46 లక్షల వాహనాలుంటే లెసైన్సుల సంఖ్య 34 లక్షలున్నట్టు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. అంటే మరో 12 లక్షల మంది లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నట్టు స్పష్టమైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు లెసైన్సు లేనివారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

మార్చి ఒకటి నుంచి మోటారు వాహనాల చట్టంలోని అంశాలను కఠినంగా అమలు చేయనున్నట్టు కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. లెసైన్సు, వాహనాలకు సంబంధించిన పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటం, సిగ్నల్ జంపింగ్, ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడపటం... తదితర అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ముమ్మరంగా ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే మార్చి ఒకటి నుంచి కొరడా ఝళిపించటం మొదలుపెట్టారు.

ముఖ్యంగా లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై దృష్టి సారించారు. తొలిసారి పట్టుబడితే జరిమానాతో వదిలేస్తున్న పోలీసులు తదుపరి పట్టుబడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో దాదాపు వంద వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వారికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో మిగతావారిలో భయం పట్టుకుంది. దీంతో తాత్కాలిక లెసైన్సు కోసం రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement