కార్మిక హక్కులను కాలరాస్తే ఖబడ్దార్: ఉత్తమ్ | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులను కాలరాస్తే ఖబడ్దార్: ఉత్తమ్

Published Sun, May 1 2016 5:06 PM

May Day celebrations held at Gandhi Bhavan

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. కార్మికులకు అన్యాయం చేసే కార్యక్రమాలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఆదివారం ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో మేడే సంబరాలు జరిగాయి.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఐఎన్‌టీయూసీ పతాకావిష్కరణ చేశారు. అనంతరం టీపీసీసీ అనుబంధ కార్మిక విభాగం అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. కార్మికులు జమ చేసుకున్న పీఎఫ్ డబ్బులపై పన్నులు వేస్తామని, వడ్డీ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యమించిడంతో తోక ముడిచిందన్నారు.

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు చేసే పోరాటాలకు తాము సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసే దిశగా అడుగులు వేస్తున్నారని, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా యాజమాన్యాలతో కుమ్మక్కై పనిచేస్తున్నారని విమర్శించారు. ఉత్తమ కార్మిక నేతలకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement
Advertisement