ఈసారైనా రాష్ట్రానికి ఎయిమ్స్‌ వచ్చేనా? | Sakshi
Sakshi News home page

ఈసారైనా రాష్ట్రానికి ఎయిమ్స్‌ వచ్చేనా?

Published Wed, Feb 1 2017 4:06 AM

Medical Health is awaiting the Union Budget

కేంద్ర బడ్జెట్‌పై వైద్య ఆరోగ్యశాఖ ఎదురుచూపు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు రావాల్సిన ఎయిమ్స్‌ రెండేళ్లుగా దోబూచులాడుతోంది. ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవిస్తూనే ఉన్నా.. ఇప్పటివరకు కేంద్ర బడ్జెట్లో దానికి నిధుల కేటాయింపు జరగలేదు. ఇక బుధవారం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లోనైనా రాష్ట్రానికి ఎయిమ్స్‌ వస్తుందా? రాదా? అన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది. ఎయిమ్స్‌ను రాష్ట్రానికి రప్పించేందుకు స్వయానా సీఎం కేసీఆర్‌ గతంలో ఒకసారి కేంద్రానికి ప్రత్యేకంగా విన్నవించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ కూడా ఈ బడ్జెట్లో ఎయిమ్స్‌ కేటాయించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు.

దీంతో ఈసారి మనకు ఎయిమ్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఎయిమ్స్‌ను యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి ఏకంగా రూ.820 కోట్లు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు. ఆ మొత్తాన్ని కేంద్రమే సమకూర్చనుంది. ఎయిమ్స్‌ ఏర్పాటుతో అధునాతన వైద్య వసతి సౌకర్యాలు, సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తాయి. ఏకంగా 30 వరకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎయిమ్స్‌ పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడిచే సంస్థ కావడంతో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు.

Advertisement
Advertisement