Sakshi News home page

‘మెట్రో’పై 25న కీలక భేటీ

Published Wed, Jul 16 2014 1:53 AM

‘మెట్రో’పై 25న కీలక భేటీ - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో పనులపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు మరో పది రోజుల్లో తెరపడే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రదేశాల్లో మెట్రో మార్గాన్ని భూగర్భానికి మళ్లించాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నగర మెట్రో ప్రాజెక్టు పనుల పురోగతి, ట్రయల్న్ ్రఏర్పాట్లు, భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలు ఇతర ఆర్థిక సంబంధిత అంశాలపై హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
సుల్తాన్‌బజార్, ఎంజే మార్కెట్, అసెంబ్లీ, గన్‌పార్క్ ప్రాంతాల్లో భూగర్భ మెట్రో మార్గం సాధ్యాసాధ్యాలపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఇంజినీర్ల బృందం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించినట్టు తెలిసింది. నివేదికను ఈ నెల 25లోగా పూర్తిచేసి ఆర్థికశాఖకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సమాచారం. భూగర్భ మార్గం సాధ్యాసాధ్యాలను, అలైన్‌మెంట్ మారిస్తే భూసేకరణ బిల్లు ప్రకారం ఆస్తుల సేకరణ కష్టసాధ్యం కానుందని తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో ప్రాజెక్టు వ్యయం పెరిగితే భరించే స్థితిలో లేమని, ప్రభుత్వ పరంగా ఇతరత్రా రాయితీలిస్తేనే 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల ప్రాజెక్టును 2017 జనవరి నాటికి పూర్తిచేయగలమని ఎల్ అండ్ టీ సంస్థ ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ఆర్థికశాఖకు విన్నవించనున్నట్టు తెలిసింది.
 
ఆర్థికశాఖ మార్గదర్శకాలే కీలకం?
మెట్రో రైలు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయకుంటే అన్ని రంగాల్లో పీపీపీ ప్రయోగం విఫలమౌతుందన్న సంకేతాలు వెలువడితే దేశవ్యాప్తంగా మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతంలో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఒప్పందపత్రం ప్రకారమే ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని పూర్తిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించనున్నట్టు సమాచారం. సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు నిధి కింద రూ.1458 కోట్లు కేటాయించాల్సి ఉన్నందున ఆర్థికశాఖ మార్గదర్శకాలే రాష్ట్ర ప్రభుత్వానికి శిరోధార్యమయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement