మెట్రో మాల్స్ | Sakshi
Sakshi News home page

మెట్రో మాల్స్

Published Wed, Mar 4 2015 12:17 AM

మెట్రో మాల్స్ - Sakshi

4 ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌ల నిర్మాణం
అనుమతి కోసం హెచ్‌ఎంఆర్ దర ఖాస్తు
జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం

 
సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే, ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో భారీ షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించనున్నారు. ఎర్రమంజిల్, పంజగుట్ట, గడ్డిఅన్నారం, మాదాపూర్‌లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అనుమతి కోరుతూ జీహెచ్‌ఎంసీకి హెచ్‌ఎంఆర్ దరఖాస్తు చేసింది. వాటిలో ఒకదానికి ఇప్పటికే అనుమతి లభించింది. మరో రెండింటికి అతి త్వరలో మంజూరు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకొకటి పరిశీలన దశలో ఉంది. పూర్తి స్థాయి పరిశీలన  అనంతరం దానికి అనుమతి ఇవ్వనున్నారు. జీహెచ్‌ఎంసీ ఖజానాకు వీటి ఫీజుల రూపంలో దాదాపు రూ.50 కోట్లు సమకూరనుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్యం రూ.500 కోట్లు కాగా... ఇప్పటి వరకు దాదాపు రూ.390 కోట్లు వచ్చినట్లు తెలిసింది.

రైలుతో పాటే ప్రారంభం?

మెట్రో రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయం మాత్రమే కాక... వివిధ మార్గాల్లో వ్యాపారాల నిర్వహణకు హెచ్‌ఎంఆర్ నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో నాలుగు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులిచ్చే ఎంఎస్‌బీ కమిటీ సమావేశాల్లో ఇటీవలే పరిశీలన పూర్తయింది. దీంతో త్వరలోనే అనుమతులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండడంతో రైలు పట్టాల పైకి వచ్చే నాటికి ఈ కాంప్లెక్స్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కాంప్లెక్స్‌ల నిర్మాణం తీరిదీ...

ఖైరతాబాద్ ఎర్రమంజిల్ వద్ద షాపింగ్‌మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను నిర్మించనున్నారు. స్టిల్ట్ ప్లస్ ఆరు అంతస్తులతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్‌లో రెండు బేస్‌మెంట్లు ఉంటాయి. పంజగుట్ట వద్ద షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను రెండు బ్లాకులుగా నిర్మించనున్నారు. వీటిల్లో ఒక బ్లాకులో జీ ప్లస్ ఐదంతస్తులు, మరో బ్లాకులో జీ ప్లస్ ఆరంతస్తులు నిర్మించనున్నారు. మూడు బేస్‌మెంట్లను పార్కింగ్‌కు వినియోగిస్తారు. దీనికి ప్రాథమిక అనుమతి లభించడమే కాక ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిసింది.  సైదాబాద్ గడ్డిఅన్నారం వద్ద షాపింగ్‌మాల్ కమ్ మల్టీప్లెక్స్‌ను జీ ప్లస్ రెండంతస్తులతో నిర్మించనున్నారు. మూడు బేస్‌మెంట్లతో నిర్మాణం జరుగనున్న ఈ కాంప్లెక్స్‌కు సంబంధించిన దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.మాదాపూర్‌లో జీ ప్లస్ ఐదంతస్తులతో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒక మెజానైన్ ఫ్లోర్ ఉంటుంది. సినిమా ప్రొజెక్టర్ల కోసం దీనిని నిర్మించనున్నట్లు సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement