నవంబర్‌లో మెట్రో పరుగులు! | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో మెట్రో పరుగులు!

Published Mon, Aug 14 2017 1:49 AM

నవంబర్‌లో మెట్రో పరుగులు! - Sakshi

30 కి.మీ. మార్గంలో మెట్రో ప్రారంభిస్తామన్న ఎన్వీఎస్‌ రెడ్డి 
- కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ 
మియాపూర్‌–అమీర్‌పేట్, అమీర్‌పేట్‌–నాగోల్‌ రూట్లు ప్రారంభం 
ఆసియాలోనే అతిపెద్ద ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌గా అమీర్‌పేట్‌
 
సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు నవంబర్‌లో పరుగులు పెట్టనుంది. ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మెట్రోను ప్రారంభించనున్నారు. తొలి విడతగా నాగోల్‌–అమీర్‌పేట్‌(17కి.మీ), మియాపూర్‌–అమీర్‌పేట్‌ (13 కి.మీ).. మొత్తంగా 30 కి.మీ మార్గంలో మెట్రో  పరుగులు తీయనున్నట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. నవంబర్‌లోగా ఈ 2 రూట్లలో మిగిలిన స్టేషన్లు, రైలు ఓవర్‌ బ్రిడ్జీలు, ఇతర నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నా రు. నగర మెట్రో ప్రాజెక్టులో మరో అద్భుతం చోటుచేసుకుందని.. ఆసియాలోనే అతిపెద్ద విశిష్ట మెట్రో స్టేషన్‌గా అమీర్‌పేట్‌ ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ ఖ్యాతి గడించిందని ఆయన పేర్కొన్నారు. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ (కారిడార్‌–1), నాగోల్‌–రాయదుర్గం (కారిడార్‌–3) కారిడార్లు కలిసే చోట నిర్మిస్తోన్న ఇంటర్‌చేంజ్‌ స్టేషన్‌ ఇదేనన్నారు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో ఈ స్టేషన్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఆదివారం ఈ పనులను ఇతర అధికారులతో కలసి ఆయన తనిఖీ చేశారు. 
 
స్టేషన్‌ విశిష్టతలివే..
► మూడు అంతస్తులుగా విభజన ఉండే ఈ స్టేషన్‌ మధ్యభాగంలో సాంకేతిక గదులు, ఆటోమేటిక్‌ టికెట్‌ కలెక్షన్‌ గేట్లు, టికెటింగ్‌ గదులుంటాయి. 
► ఈ స్టేషన్‌కు ఇరువైపులా 16 లిఫ్టులు, 12 ఎస్కలేటర్లు, 12 మెట్ల దారులున్నాయి. 
► రెండు కారిడార్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఒక కారిడార్‌ నుంచి మరో కారిడార్‌కు మారేందుకు విశాలమైన మెట్లు, స్కైవేస్‌ ఏర్పాటు. 
► రోజుకు దాదాపు 30 వేల మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ స్టేషన్‌లో ఏ సమయంలోనైనా ఒకేసారి 6,000 మంది ప్రయాణికులు సులువుగా రాకపోకలు సాగించవచ్చు. 
► స్టేషన్‌ కింది భాగం(రోడ్‌ లెవల్‌) పాదచారులు నడిచేందుకు ప్రత్యేకమైన దారులు, బస్సులు, ఆటోలు ఇతర వాహన మార్గాలను అనుసంధానించేందుకు సర్వీస్‌ లేన్లు, ఫీడర్‌ సౌకర్యాలను రూపకల్పన చేస్తున్నారు.  
►  ప్రస్తుతం ఈ స్టేషన్‌ నిర్మాణం కోసం 800 మంది కార్మికులు.. 24 గంటల పాటు శ్రమిస్తున్నారు. 
► స్టేషన్‌లో ప్లాట్‌ఫాం ఎత్తు 92 అడుగులు కాగా..పైకప్పు ఎత్తు 112 అడుగులు.

Advertisement

తప్పక చదవండి

Advertisement