మంత్రి కుటుంబసభ్యులైనా అరెస్టు చేస్తాం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

మంత్రి కుటుంబసభ్యులైనా అరెస్టు చేస్తాం: కేటీఆర్

Published Fri, Dec 9 2016 10:40 AM

మంత్రి కుటుంబసభ్యులైనా అరెస్టు చేస్తాం: కేటీఆర్ - Sakshi

నానక్‌రాంగూడ ప్రాంతంలో కుప్పకూలిన భవన యజమాని ఒక మంత్రికి దగ్గర అన్నట్లుగా కొన్ని కథనాలు వచ్చాయని.. ఈ ఘటనలో నిందితులు స్వయానా మంత్రి కుటుంబ సభ్యులైనా కూడా వదిలేది లేదని, అరెస్టు చేసి తీరుతామని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. భవనం కూలిన స్థలానికి వచ్చి సహాయ పనులను పర్యవేక్షించిన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు 1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను, ఏసీపీని తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నామని, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సూచించామని అన్నారు. తాను సాయంత్రం వరకు ఇక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తానన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, బిల్డర్ల దురాశ కారణంగా ఇలా జరుగుతోందని, కనీస విద్యార్హతలు లేకపోయినా ఎవరైనా కూడా బిల్డర్లుగా అయిపోవచ్చని ఆయన అన్నారు. దురాశ కారణంగా చిన్న స్థలంలోనే ఇంత పెద్ద భవనం కట్టారని, అందులోనూ నాణ్యత లేకపోవడంతో అది కుప్పకూలిందని చెప్పారు. 
 
భవన యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నారని, సెల్ స్విచాఫ్ చేసి ఉందంటున్నారని, మరికొందరు శబరిమల వెళ్లారంటున్నారని.. ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సత్యనారాయణ సింగ్ కుటుంబసభ్యులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నాని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందే నిర్మాణాలను అడ్డుకుని ఉంటే ప్రమాదం సంభవించేది కాదని అన్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్‌ను తిరిగి తెరవడానికి కూడా తాము అనుమతి ఇవ్వలేదని, వాళ్లు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారని.. జీహెచ్ఎంసీ వైపు నుంచి ఎవరినీ ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. 
 
నానక్‌రాంగూడ అనేది గ్రామపంచాయతీ అని, పైగా ఈ స్థలం గ్రామకంఠని.. ఇలాంటి నిర్మాణాలను నియంత్రించాలంటే ప్రభుత్వం, జీహెచ్ఎంసీ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలని చెప్పారు. ఈ ఘటన జరగకముందే, మొన్నటినుంచి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ నడుస్తోందని, అధికారులు మొత్తం 12 బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలు, లే అవుట్లను కూల్చివేసే చర్యలు మొదలయ్యాయని తెలిపారు.  ఇన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలా జరగడం దురదృష్టకరం, బాధాకరమని, ప్రభుత్వం పక్షాన పూర్తి పునరావాస చర్యలు తీసుకుంటాం, పరిహారం ఇస్తామని అన్నారు. ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరారు.
Advertisement
Advertisement