సింహభాగం సింగపూర్‌కే | Sakshi
Sakshi News home page

సింహభాగం సింగపూర్‌కే

Published Sat, Jun 11 2016 9:25 AM

సింహభాగం సింగపూర్‌కే - Sakshi

రాజధాని మాస్టర్ డెవలపర్‌కు సర్కారు దాసోహం
 
 సాక్షి, హైదరాబాద్: సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం తలాడిస్తోం ది. రాజధాని అమరావతి మాస్టర్ డెవలపర్‌గా అసెండాస్, సెమ్బ్‌కార్ఫ్, సెంబ్రిడ్జి కన్సార్టియంలను ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సీఎం ఆ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రంలోనూ, సింగపూర్‌కు వెళ్లి  మంతనాలు  జరిపారు. ఆ కంపెనీలు సమర్పించిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలపై చర్చించి ఖరారు చేయడానికి యనమల నేతృత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇదివరకు 33 ఏళ్లు కాదని సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 99 ఏళ్లపాటు సర్వ హక్కులతో భూమిని లీజుకు కట్టబెట్టేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టాన్ని సవరించిన విషయం తెలిసిందే.

తాజాగా ఆ కంపెనీల కోసం రెండోసారి ఆ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. రాజ ధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 58% వాటా కట్టబెట్టి, రాష్ట్ర ప్రభుత్వం 42% వాటాతో సరిపుచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం కలిసి జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పడతాయి. ఇందులో కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌కు 42%, సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంకు 58% వాటా ఉండనుంది. అయితే ఇందుకు అమల్లో ఉన్న రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టం అంగీకరించదు. ప్రస్తుత చట్టం ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలకు కచ్చితంగా 51% వాటా ఉండాలి. ప్రైవేట్ రంగానికి 49 % వాటానే ఉండాలి. ఈ నేపథ్యంలో చట్ట  సవరణకు ప్రభుత్వం  నిర్ణయించింది.

Advertisement
Advertisement