Sakshi News home page

మూలకణ చికిత్సకు నిమ్స్‌లో ప్రత్యేక విభాగం

Published Thu, Aug 18 2016 3:29 AM

మూలకణ చికిత్సకు  నిమ్స్‌లో ప్రత్యేక విభాగం

రూ. 25 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం


హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా ప్రభుత్వరంగంలో కేన్సర్, కీళ్ల నొప్పులు వంటి మొండి జబ్బులను నయం చేసే మూలకణ చికిత్స నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)లో అందుబాటులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు కానుంది. మూల కణాలను సేకరించడం, సంబంధిత బంధువులకుగాని, ఇతర రోగులకుగాని ఇచ్చి చికిత్స నిర్వహించడం ఈ విభాగం పని. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటుకు రూ.25 కోట్లు మంజూరు చేసిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మూల కణాల సేకరణ, భద్రత కోసం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు ఇటీవల సీసీఎంబీతో నిమ్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు మూలకణాలను సేకరించి భద్రపరిస్తే, వాటితో నిమ్స్ వైద్యులు  రోగులకు చికిత్స నిర్వహిస్తారు. నిమ్స్‌లోని ఈ విభాగానికి అధిపతిగా డాక్టర్ నరేంద్ర వ్యవహరిస్తారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మూలకణ చికిత్సకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుండగా నిమ్స్‌లో రూ.10 లక్షలకే అందుబాటులోకి రానుంది. బోన్‌మ్యారో చికిత్సను ఆరోగ్యశ్రీ రోగులకైతే రూ. 8.7 లక్షలకే చేస్తారు.


నిమ్స్‌లో మూలకణ చికిత్స విభాగం మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ప్రత్యేక విభాగం కోసం నిమ్స్‌లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఒక అంతస్తును కేటాయించారు.   రాష్ట్రంలో రెండు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే మూలకణ చికిత్స అందుబాటులో ఉంది. వివిధ రకాల క్యాన్సర్లతో వచ్చే రోగులకు మూల కణ చికిత్స అత్యంత కీలకమైందని, దీన్ని ప్రభుత్వం రంగంలో తీసుకురావడం అభినందనీయమని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి.   

 

 

Advertisement

What’s your opinion

Advertisement