మూడేళ్లు ఢోకా లేదు | Sakshi
Sakshi News home page

మూడేళ్లు ఢోకా లేదు

Published Tue, Sep 27 2016 2:34 AM

మూడేళ్లు ఢోకా లేదు - Sakshi

ప్రాజెక్టుల్లోకి పుష్కలంగా నీళ్లు వచ్చాయి: సీఎం కేసీఆర్
వర్షాలతో ప్రాణనష్టం వందలోపే
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం
పనుల్లో జాప్యం వల్లే మిడ్‌మానేరుకు గండి
కాంట్రాక్టర్‌ను తొలగించి మళ్లీ టెండర్లు పిలవండి
యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టండి
వర్షాలపై కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్ష
మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే

 
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోకి నీళ్లు పుష్కలంగా చేరాయని, రాబోయే రెండు మూడేళ్ల వరకు నీటికి ఢోకా లేదంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. వరదల వల్ల జరిగిన ప్రాణనష్టం వందలోపే ఉందని, బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. రాష్ర్టంలో జరిగిన నష్టాలపై యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారుచేసి కేంద్రానికి నివేదిక అందిస్తామన్నారు. దశాబ్ద కాలంగా పనుల్లో జరిగిన  జాప్యం వల్లే మిడ్‌మానేరు రిజర్వాయర్ కట్టకు గండి పడిందని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన కాంట్రాక్టర్‌ను తొలగించడంతోపాటు తాజా రేట్లతో కొత్తగా టెండర్లు నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 
సోమవారం రోడ్డు మార్గాన కరీంనగర్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ కలెక్టరేట్‌లో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శి బీఆర్.మీనా, కలెక్టర్ నీతూప్రసాద్ తదితరులతో కలసి వరదలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గండిపడిన మిడ్‌మానేరు రిజర్వాయర్‌తోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలసి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
 
రెండ్రోజులు మకాం వేద్దామని వచ్చా..
ఉత్తర తెలంగాణ జిల్లాలకు గోదావరి వరద పోటెత్తే అవకాశముందని వాతావరణ శాఖ సూచించడంతో అవసరమైతే ఒకట్రెండు రోజులు కరీంనగర్‌లోనే మకాం వేసి ఎస్సారెస్పీ నుంచి కాళేశ్వరం వరకు ప్రాజెక్టులను సందర్శించాలని ఇక్కడికొచ్చిన. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని అంచనాకు వచ్చాం. ఇక కరీంనగర్‌లో ఉండాల్సిన అవసరం లేనందున హైదరాబాద్ వెళ్తున్నా. అవసరమైతే మళ్లీ వస్తా.
 
అద్భుతమైన వర్షాలొచ్చినయ్
రాష్ట్రంలో రాబోయే రెండుమూడేళ్లకు సరిపడేంతగా అద్భుతమైన వర్షపాతం కురిసింది. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నరు. కరీంనగర్ వస్తుంటే దారిపొడవునా అన్ని గ్రామాల ప్రజలు నిలబడి సంతోషం వ్యక్తం చేసిండ్రు. చేతికి రావని భావించిన వర్షాధార పంటలన్నీ కొద్దిపాటి నష్టం మినహా చేతికొచ్చే అవకాశముంది. ఈసారి రెండోపంట బలంగా వస్తది. రైతులకు ఈసారి ఎంత కష్టమైనా 9 గంటల కరెంటు సరఫరా చేస్తం. ఎగువ నుంచి ఎస్సారెస్పీకి ఇంకా 3.18 లక్షల క్యూసెక్కుల నీరొస్తోంది. ప్రస్తుతం 81.9 టీఎంసీల నీరుంది. నిజాంసాగర్‌లో 12.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎల్‌ఎండీలో 20.5 టీఎంసీల నీరుంది. మరో 3.5 టీఎంసీల నీరొస్తే పూర్తిగా నిండుతది. కృష్ణా బేసిన్‌లో జూరాల నిండింది. శ్రీశైలంకు 1.4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అక్కడ్నుంచి నాగార్జునసాగర్‌కు 70 వేల క్యూసెక్కుల నీరొస్తుంది.
 
మిడ్‌మానేరు ప్రమాదం తప్పింది..
మిడ్‌మానేరు ఆనకట్ట 130 మీటర్లు దెబ్బతిన్నది. దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినం. ప్రస్తుతం ప్రమాదం తప్పింది. దీంతో వాళ్లందరినీ మళ్లీ సురక్షితంగా ఇండ్లకు పంపించినం. మిడ్‌మానేరుకు గండి పడటానికి కాంట్రాక్టర్ చేసిన జాప్యమే కారణం. ఈ ప్రాజెక్టుకు ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేస్తే అందులో కుడివైపు భాగమంతా నిబంధనల ప్రకారం జరిగాయి. ఎడమ వైపు మాత్రం పనులు చేయలేదు. దాని ఫలితంగానే గండిపడింది. మిడ్‌మానేరు కాళేశ్వరం ప్రాజెక్టుకు జీవనాడి. భవిష్యత్తులో ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని తీసుకొచ్చే లింకేజీ మిడ్‌మానేరు. ఇది పటిష్టంగా ఉండాలి. అందుకే కాంట్రాక్టర్‌ను తొలగిస్తున్నాం. కొత్త రేట్ల ప్రకారం ఫ్రెష్ టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించినం. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
 
బాధితులారా.. క్షమించండి!
గతేడాది జూన్ 18న వేములవాడ పర్యటనకు వచ్చిన సమయంలో మిడ్‌మానేరు బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన. కానీ ఆ రోజు నాకు అవగాహన లేదు. అప్పటికే బాధితులకు ప్లాట్లు ఇచ్చారట. రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కల్పించారట. ఈ విషయాన్ని అధికారులు చెప్పిండ్రు. మళ్లీ వాళ్లకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తే డూప్లికేషన్ సమస్యతోపాటు ఆడిట్‌పరంగా ఇబ్బంది వస్తుందన్నారు.
మిడ్‌మానేరు బాధితులు పెద్ద మనుసుతో నన్ను క్షమించాలి. వాళ్లకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇవ్వలేకపోతున్నా. కొత్తగా భూసేకరణ చేసేచోట నిర్వాసితులకు మాత్రం డబుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణం కోసం అయ్యే వ్యయం రూ.5.05 లక్షలు మొత్తాన్ని చెల్లిస్తాం. వాళ్లు ఎక్కడ నివాసం ఉంటారనేది వాళ్ల ఇష్టానికే వదిలేస్తాం. ఎందుకంటే మిడ్‌మానేరు కింద నిర్వాసితులైన వారిలో మా తోడల్లుడు రవీందర్‌రావు కూడా ఉన్నడు. ఆర్‌అండ్‌ఆర్ కింద ఆయనకు ప్లాట్ ఇస్తే అక్కడ ఉండలేక దాన్ని అమ్ముకుంటుండు. అందుకే బాధితులు ఎక్కడ ఉండాలనేది వాళ్ల ఇష్టానికే వదిలేస్తాం. అదే సమయంలో మిడ్‌మానేరు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటాం.
 
 థ్యాంక్స్ టు మిషన్ కాకతీయ
కాంగ్రెస్ హయూంలో వరదలొస్తే ఏకంగా రెం డు మూడు వేల చెరువులు తెగిపోయిన ఉదంతాలు చూసినం. ఈసారి పెద్ద ఎత్తున వరదలొచ్చినా రాష్ర్టం మొత్తం 122 చెరువులు మాత్ర మే తెగిపోయాయి. అవి కూడా మిషన్ కాకతీయ కింద పనులు చేపట్టని చెరువులే. పునరుద్ధరణ చేపట్టిన చెరువులు పటిష్టంగా ఉన్నారుు. ఈ జిల్లాలో ఎస్సారెస్పీ కాలువ డామేజ్ అయినా.. పక్కనే ఉన్న మానాల చెరువు కట్ట తెగకపోవడమే ఇందుకు నిదర్శనం.
 
వెంటనే కేంద్రానికి నివేదిక
వర్షాలు, వరదలతో కరీంనగర్ సహా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నష్టంపై వెంటనే సర్వే నిర్విహించి కేంద్రానికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలి.
 
 2008 తర్వాత మేజర్లకూ పరిహారం చెల్లిస్తాం
 మిడ్‌మానేరు, ఎల్లంపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో గత ప్రభుత్వాలు చాలా జాప్యం చేశారుు. 2008 వరకున్న మేజర్లకే సాయం అందిస్తామన్నారుు. ప్రజలు మాత్రం ఈ రోజు వరకు మేజర్లయిన వారందరికీ పరిహారం వర్తింపజేయాలని కోరుతున్నారు. అట్లా చేస్తే మిడ్‌మానేరు పరిధిలో 4,231, ఎల్లంపల్లి పరిధిలో 1,447 మందికి లబ్ధి చేకూరుతుంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తే ప్రభుత్వంపై రూ.114 కోట్లు భారం పడుతుంది. న్యాయమైన డిమాండే కాబట్టి వాళ్లకు చెల్లిస్తాం. గండిపెల్లి, గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోనూ ఈ సమస్య ఉన్నందున వాళ్లకూ వర్తింపజేస్తాం.
 
బ్యాంకు గ్యారంటీ తీసుకోండి
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇకపై టెండర్లు నిర్వహించినప్పుడు 5 శాతానికి మించి లెస్‌కు పోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ లెస్ టెండర్లు వేసిన వారి నుంచి అంత మొత్తం బ్యాంకు గ్యారంటీ తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నందున పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. 123 జీవో కింద మంచి పరిహారం ఇస్తున్నందున త్వరితగతిన భూసేకరణ చేపట్టాలన్నారు. వరదల నేపథ్యంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, జిల్లాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎల్‌ఎండీ నుంచి విడుదలయ్యే నీటిని ఖమ్మం, నల్లగొండ జిల్లాల దాకా చేర్చాలని ఆదేశించారు. కర్ణాటక నుంచి వచ్చే వరదను బట్టి సింగూరు ప్రాజెక్టు ఔట్‌ఫ్లోను ఎప్పటికప్పుడు నిర్ణయించాలని సూచించారు.

Advertisement
Advertisement