Sakshi News home page

నాటి బాలనేరస్తుడే.. నేటి ఘరానా చోరుడు

Published Tue, Aug 15 2017 7:12 AM

నాటి బాలనేరస్తుడే.. నేటి ఘరానా చోరుడు - Sakshi

♦ 22 ఏళ్ల క్రితం తీసుకున్న వేలిముద్రలతో వీడిన చోరీ కేసు
♦  సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను పట్టుకున్న  పోలీసులు
♦  26 చోరీలు చేసినట్లుగా గుర్తింపు
 
హైదరాబాద్‌: బాలనేరస్తుడిగా 1995లో పోలీసులకు చిక్కిన సమయంలో తీసుకున్న వేలిముద్రలే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఓ దొంగను  పట్టించాయి. మీర్‌పేట ఠాణా పరిధిలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగులగొట్టి సొత్తు దోచుకెళ్లిన కేసులో  హబీబ్‌ అలియాస్‌ చోటు అలియాస్‌ యూసుఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ  మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 
 
మీర్‌పేటలో జరిగిన ఓ చోరీ కేసుకు సంబంధించి ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులకు లభించిన వేలిముద్రలను ఫింగర్‌ ప్రింట్స్‌ విభాగానికి పంపగా, 22 ఏళ్ల క్రితం పోలీసులకు చిక్కిన హబీబ్‌ అలియాస్‌ చోటు అలియాస్‌ యూసుఫ్‌ వేలిముద్రలతో సరిపోలినట్లు నివేదిక వచ్చింది. అప్పటి నుంచి అతడిపై నిఘా ఉంచిన పోలీసులు రాజేంద్రనగర్‌ మండలం, హసన్ననగర్‌లోని ఇంట్లో ఉన్నట్టుగా గుర్తించి ఈ నెల13న అతడిని అరెస్టు చేసి, రూ.30 లక్షల విలువచేసే కిలో బంగారం, 2.5కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా మీర్‌పేట, బాలాపూర్, హయత్‌నగర్, పహడీషరీఫ్, ఎల్‌బీ నగర్, చైతన్యపురి, వనస్థలిపురం, నార్సింగ్‌ ఠాణా పరిధిల్లో 26 ఇళ్లల్లో చోరీ చేసినట్లుగా అంగీకరించాడు. వేలిముద్రలు పడకుండా చాలా చాకచాక్యంగా వ్యహరించిన హబీబ్‌ మీర్‌పేటలో చేసిన చోరీలో మాత్రం చేసిన తప్పుతో పోలీసులకు దొరికిపోయాడు.
 
♦ 22 ఏళ్ల తర్వాత తొలిసారి అరెస్టు...
ఉదయం, రాత్రి వేళల్లో రెక్కీలు నిర్వహించే యూసుఫ్‌ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి ప్రధాన ద్వారం తలుపులకు ఉన్న తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడేవాడు. ఇంట్లో దాచి ఉన్న బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళతాడు. చిన్నతనంలో చెడుస్నేహాల కారణంగా జల్సాల కోసం చోరీల బాట పడ్డాడు. 1995లో అతను తన సహచరులు సంజయ్, సర్వర్, హర్షద్‌లతో కలిసి చోరీ చేసిన కేసులో హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేసి జువైనల్‌ కోర్టుకు తరలించారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాక తన ప్రవర్తన మార్చుకొకుండా చోరీలు కొనసాగిస్తున్నాడు. అయితే అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న హబీబ్‌ను ఎట్టకేలకు మీర్‌పేటలో చోరీ చేసిన ప్రాంతంలో లభించిన వేలిముద్రలు పట్టించాయి.  

Advertisement

What’s your opinion

Advertisement