ప్రాజెక్టులకు సాయం అందించండి | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు సాయం అందించండి

Published Sun, Sep 6 2015 2:17 AM

ప్రాజెక్టులకు సాయం అందించండి - Sakshi

కేంద్ర అదనపు కార్యదర్శికి రాష్ర్ట అధికారుల వినతి
 
 సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రతి నీటిచుక్కను వాడుకలోకి తెచ్చే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అవసరమైన  సాయం అందించాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్‌జీత్ సింగ్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు మురళీధర్, విజయప్రకాశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకం వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

రాష్ట్రంలో రూ.1.05 లక్షల కోట్లు వెచ్చించి 60 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం లక్ష్యాలు, బడ్జెట్ అవసరాలను కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. సాగునీటి రంగంలో రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం తనవంతు సాయం చేయాల్సిందిగా రాష్ట్రం తరపున విజ్ఞప్తి చేశారు. చిన్న నీటి వనరుల పునరుద్దరణ లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు.

 కేంద్ర పథకాల నిధులు విడుదల చేయండి
 కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పేరిట ఏఐబీపీ, ట్రిపుల్ ఆర్ తదితర పథకాలను ఒకేచోట చేర్చి రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి రావాల్సిన రూ.175 కోట్లు, ట్రిపుల్ ఆర్ పథకం కింద మిషన్ కాకతీయకు రూ.182 కోట్లు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అమర్‌జీత్ సింగ్ హామీ ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement