మళ్లీ ‘భూమ్’ | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘భూమ్’

Published Wed, Oct 7 2015 12:54 AM

మళ్లీ ‘భూమ్’

నగరంలో పుంజుకున్న క్రయవిక్రయాలు
వరంగల్, సాగర్, విజయవాడ హైవేలలో అధికం
రిజిస్ట్రేషన్ల శాఖకు లక్ష్యానికి మించి ఆదాయం

 
సిటీబ్యూరో: మహా నగరంలో మళ్లీ భూ క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు సాగాయి. దీంతో నగరంలో మళ్లీ రియల్ రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1,44,959 రిజిస్ట్రేషన్లతో రూ.1038 కోట్ల ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ టార్గెట్ మేరకు హైదరాబాద్‌లో 98, రంగారెడ్డి జిల్లాలో 80.10 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి ఎంతో మెరుగుపడింది. వచ్చే ఐదు నెలల్లో మరింత సానుకూలమవుతుందని... ఐటీ జోన్ సహా కరీంనగర్, నిజామాబాద్ రూట్లలోనూ క్రయ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా.

 వరంగల్, సాగర్ హైవేలపై ఊపు
 ప్రస్తుత సంవత్సరంలో నగర శివార్లలో భూ క్రయవిక్రయాలు అధికంగా ఉన్నాయి. ఉప్పల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ల పరిధిలో లక్ష్యానికి మించి రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి తోడు బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటు... ఇన్పోసిస్ విస్తరణ, ఘట్‌కేసర్ నుంచి ఔటర్ రింగురోడ్డు అందుబాటులోకి రావటంతో ఉప్పల్, బోడుప్పల్ పరిధిలో భూములకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఆదిభట్లలో టాటా ఏరోస్పెస్, టీసీఎస్, ముచ్చర్ల ఫార్మాసిటీ, రాచకొండలో చిత్రనగరి నిర్మాణానికి సన్నాహాలు సాగుతున్నాయి. దీంతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధిలోనూ ‘భూం’ జోరందుకుంది. హైదరాబాద్- రంగారెడి జిల్లాల్లో గత సంవత్సరంతో పోలిస్తే... ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దస్తావేజుల సంఖ్య అదనంగా 34,105 పెరుగగా.... రూ.181 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ 86.5 శాతానికి పైగా లక్ష్యం సాధించినట్టు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుందని... మూడేళ్ల తరువాత ఈ ఏడాది లక్ష్యాన్ని దాటబోతున్నామని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

26 శాతం అధికంగా నమోదు: నగర శివార్లలో మళ్లీ క్రయవిక్రయాలు ఊపందుకోవడం సంతోషకరం. తెలంగాణ జిల్లాలను కలిపే రహదారుల వెంట రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. వరంగల్ హైవేను ఆనుకొని ఉన్న ఉప్పల్ ప్రాంతంలో గత ఏడాదితో పోలిస్తే 26శాతం అధికంగా క్రయ విక్రయాలు సాగాయి. ఇప్పటికే తొమ్మిది వేల డాక్యుమెంట్లు రిజిస్టరయ్యాయి.
 గోన విష్ణువర్ధన్‌రావు, అధ్యక్షులు,
 స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ
 

Advertisement
Advertisement